లండన్: తమను కోట్లాది రూపాయలమేర మోసగించి బ్రిటన్‌లో తలదాచుకుంటున్న లిక్కర్ వ్యాపారస్తుడు విజయ్‌మాల్యాను భారత్ బ్యాంకులు వదలడంలేదు. ఆయనను దివాలాకోరుగా ప్రకటించాల్సిందేనని మరోసారి ఇంగ్లాండ్‌లోని హైకోర్టులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) నేతృత్వం లోని 13 బ్యాంకుల కన్సార్షియం పటిష్టమైన వాదనలను వినిపించింది. ఇరు వర్గాల వాదనలు విన్న జస్టిస్ బ్రిగ్స్ తీర్పును రిజర్వ్ చేసుకున్నారు. మాల్యాను దివాలాకోరుగా ప్రకటిస్తే... రుణాలు రాబట్టుకునే విషయంలో భారత్ బ్యాంకింగ్ తదుపరి చర్యలు తీసుకోగలుగుతుంది.
కేసు వివరాలు క్లుప్తంగా...
► భారత్ నుంచి బ్రిటన్ పారిపోయిన మాల్యా నుంచి 114.5 కోట్ల పౌండ్ల (రూ.10 వేల కోట్లపైన) వసూలు చేసుకునే క్రమంలో బ్యాంకింగ్ కన్సార్షియం 2018లో దివాలా పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో మాల్యా తన వాదనలు వినిపిస్తూ... భారత్‌లోని పలు కోర్టుల్లో తనపై కేసులు విచారణ దశలో ఉన్నాయన్నారు. ఆ కేసుల్లో తాను విజయం సాధించే అవకాశాలూ ఉన్నాయన్నారు. పైగా తనకు ఇచ్చిన రుణాల విషయంలో బ్యాం కులకు పూర్తి గ్యారంటీ (సెక్యూర్డ్ క్రెడిటార్స్) ఉందన్నారు. రుణ చెల్లింపుల పరిష్కారానికి తాను ఇచ్చిన ఆఫర్లను బ్యాంకింగ్ పట్టించుకోవడంలేదని వివరించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న లండన్ కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ బ్రిగ్స్ మాల్యాపై పిటిషన్‌ను ఈ ఏడాది ఏప్రిల్ 10న కొట్టివేశారు.
► అయితే ఈ తీర్పుపై భారత్ బ్యాంకింగ్ కన్సార్షియం ఇటీవలే తాజాగా అమెండెడ్ పిటిషన్ దాఖలు చేసింది. మాల్యా చెబుతున్న అంశాల్లో నిజాలు లేవని ఈ పిటిషన్‌లో వివరించింది. మాల్యా ప్రతిపాదించిన సెటిల్‌మెంట్ ఆఫర్ యునైటెడ్ బ్రూవరీస్ హోల్డింగ్ లిమిటెడ్ (యూబీహెచ్‌ఎల్) ఆస్తులను బ్యాంకులు హైకోర్టులో ప్రస్తావిస్తూ, ‘‘ఈ ఆస్తులు అధికారిక లిక్విడేటర్ కింద ఉన్నాయి. మాల్యాకుగానీ లేదా ఒకప్పటి యూబీహెచ్‌ఎల్ యాజమాన్యానికి ఇవి అందుబాటులో లేవు. ఇలాంటి పరిస్థితుల్లో సెటిల్‌మెంట్ ఆఫర్‌కు మాల్యా ఆయా ఆస్తులపై ఆధారపడజాలరు. ఆయన సెటిల్‌మెంట్ ఆఫర్ అమలుకు సాధ్యం కాదు. మాల్యా పేర్కొన్నట్లు బ్యాంకులు సెక్యూర్డ్ క్రెడిటార్స్ కాదు’’ అని మంగళవారంనాటి తన వాదనల్లో బ్యాంకింగ్ కన్సార్షియం తరఫు బారిష్టర్ షేక్‌డీమియన్ పేర్కొన్నారు. భారత్‌కు తనను అప్పగించరాదంటూ మాల్యా చేసిన వాదనలూ బ్రిటన్ న్యాయస్థానాల్లో వీగిపోయిన విషయాలను బ్యాంకింగ్ తరఫు న్యాయవాది ప్రస్తావించారు.
► బారిష్టర్ ఫిలిప్ మార్షల్ నేతృత్వంలోని మాల్యా తరఫు లీగల్ టీమ్ మాత్రం బ్యాంకులు ‘సెక్యూర్ట్ క్రెడిటార్స్’ అనీ, బ్యాంకింగ్ తాజా పిటిషన్‌నూ కొట్టేయాలని తన వాదనల్లో వినిపించింది.
Comments
Please login to add a commentAdd a comment