బ్యాంకులకు కుచ్చు టోపీ...రూ. 22,842 కోట్ల మోసం | CBI books ABG shipyard for biggest bank loan fraud | Sakshi
Sakshi News home page

బ్యాంకులకు కుచ్చు టోపీ...రూ. 22,842 కోట్ల మోసం

Published Sun, Feb 13 2022 4:24 AM | Last Updated on Sun, Feb 13 2022 8:33 AM

CBI books ABG shipyard for biggest bank loan fraud - Sakshi

న్యూఢిల్లీ: అక్షరాలా రూ.22,842 కోట్లు. స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం నుంచి వ్యాపారం కోసమంటూ రుణాలుగా తీసుకున్నారు. చెల్లించకుండా చేతులెత్తేశారు. దీన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఇప్పటిదాకా నమోదు చేసిన బ్యాంకు మోసాల్లో అతి పెద్దదిగా భావిస్తున్నారు. నిధులు మింగేసిన ఏబీజీ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (ఏబీజీఎస్‌ఎల్‌), ఆ సంస్థ మాజీ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రిషి కమలేశ్‌ అగర్వాల్‌తో పాటు ఇతరులపై కేసు నమోదు చేసినట్లు సీబీఐ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది.

సంస్థ మాజీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సంతానం ముత్తస్వామి, డైరెక్టర్లు అశ్వినీ కుమార్, సుశీల్‌కుమార్‌ అగర్వాల్, రవి విమల్‌ నెవెతియాతో పాటు మరో సంస్థ ఏబీజీ ఇంటర్నేషనల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పైనా పలు ఐపీసీ సెక్షన్లు, అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పింది. ‘‘ఈ కంపెనీలకు, నిందితులకు చెందిన సూరత్, భరూచా, ముంబై, పుణే తదితర పట్టణాల్లో 13 ప్రాంతాల్లో సోదాలు చేశాం. కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నాం’’ అని తెలిపింది.  

ఎస్‌బీఐ రుణం రూ.2,468.51 కోట్లు
రుణాలు తీసుకొని చెల్లించలేదంటూ 2019 నవంబర్‌ 8న సీబీఐకి ఎస్‌బీఐ ఫిర్యాదు చేసింది. 2020 మార్చి12న సీబీఐ మరిన్ని వివరాలు కోరింది. 2020 ఆగస్టులో ఎస్‌బీఐ మరోసారి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును ఏడాదిన్నరపాటు క్షుణ్నంగా పరిశీలించిన సీబీఐ ఈ నెల 7న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఏబీజీ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌కు 28 బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణాలిచ్చాయి. ఎస్‌బీఐ ఒక్కటే రూ.2,468.51 కోట్లు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.

2012–17 వరకు కంపెనీ కార్యకలాపాలపై ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ సంస్థ ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించింది. నిందితులంతా కుమ్మక్కై నిధులను దారి మళ్లించి దుర్వినియోగం చేసినట్లు గుర్తించింది. ఏబీజీ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ లోన్‌ అకౌంట్‌ను 2016 జూలైలో నిరర్థక ఆస్తిగా (ఎన్‌పీఏ) బ్యాంకుల కన్సార్టియం ప్రకటించింది. ఏబీజీ గ్రూప్‌నకు చెందిన ఏబీజీ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ ప్రధానంగా నౌకల నిర్మాణం, మరమ్మతులు చేస్తున్నట్లు ఎస్‌బీఐ ఫిర్యాదులో పేర్కొంది. గుజరాత్‌ కేంద్రంగా పని చేసే దీనికి భారత నౌకా నిర్మాణ పరిశ్రమలో అతిపెద్ద కంపెనీగా పేరుంది. గత 16 ఏళ్లలో ఇది 165కు పైగా నౌకలను నిర్మించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement