ఎస్‌బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి
చిన్న వ్యాపార సంస్థలు తీసుకునే రుణాలు లేదా ఈక్విటీ కింద సమీకరించే సద్వినియోగం అవుతున్నాయో లేదో పరిశీలించేందుకు మార్కెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థలాంటిదేదైనా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) చైర్మన్ సీఎస్ శెట్టి అభిప్రాయపడ్డారు.
‘నిధులను దేని కోసం తీసుకుంటున్నారో కచి్చతంగా ఆ అవసరానికే వినియోగించేలా చూసేందుకు ఒక యంత్రాంగం అవసరం. రుణంగా లేదా ఈక్విటీ కింద తీసుకున్న నిధుల వినియోగాన్ని ట్రాక్ చేసే అధికారాలతో ప్రత్యేక మార్కెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థలాంటిది ఉండాలి‘ అని ఎన్‌ఐఎస్‌ఎం నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ఇలాంటి సంస్థను ఏర్పాటు చేయడం వల్ల రుణదాతలు, ఇన్వెస్టర్లకు కొంత భరోసా లభించగలదని శెట్టి చెప్పారు.
చిన్న వ్యాపార సంస్థలు సమీకరించిన నిధులను అంతిమంగా ఉపయోగించే తీరుతెన్నులపై ఆందోళన వ్యక్తమవుతుండటం, నిధుల వినియోగాన్ని పర్యవేక్షించాలంటూ బ్యాంకులపై ఆర్‌బీఐ కూడా ఒత్తిడి పెంచుతుండటం తదితర పరిణామాల నేపథ్యంలో శెట్టి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
మరోవైపు, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఎదగాలంటే దేశీయంగా పొదుపు రేటు మరింత పెరగాలని, ఇందులో క్యాపిటల్ మార్కెట్లు కూడా కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని శెట్టి చెప్పారు. క్రెడిట్ రేటింగ్స్‌ను పొందాలంటే చిన్న, మధ్య తరహా సంస్థలకు సరైన ఆర్థిక వివరాల రికార్డులు గానీ ఆర్థిక వనరులు గానీ ఉండవని, అలాంటి సంస్థలకు రుణాలివ్వడంలో రిస్కులను మదింపు చేయడం బ్యాంకులకు కష్టతరంగా ఉంటుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment