న్యూఢిల్లీ: బ్యాంకులకు చిప్ ఆధారిత డెబిట్, క్రెడిట్ కార్డులను సరఫరా చేసే సంస్థలు కుమ్మక్కైన అవకాశాలపై విచారణ జరపాలంటూ కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ)ని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) కోరింది. చిప్‌ల కొరత పేరుతో వివిధ వెండర్లు కార్డుల రేట్లను పెంచేస్తున్నట్లు, పెంపు పరిమాణం దాదాపు ఒకే రకంగా ఉంటున్నట్లు తమకు పలు ఫిర్యాదులు అందాయని తెలిపింది. ఇదంతా చూస్తుంటే వెండర్లు కుమ్మక్కయ్యే ఇలా చేస్తుండవచ్చన్న అనుమానాలు తలెత్తుతున్నాయని పేర్కొంది. ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై విచారణ జరపాలంటూ సీసీఐకి లేఖ రాయడంతో పాటు అటు ఆర్థిక శాఖకు కూడా ఐబీఏ విషయాన్ని తెలియజేసింది.
సీనియర్ బ్యాంకు అధికారి వివరణ ప్రకారం.. గతేడాది 4–5 కార్డు సంస్థలు చిప్‌ల కొరత వల్ల ధరలు పెంచాల్సి వస్తోందంటూ బ్యాంకులను సంప్రదించాయి. అప్పట్లో ఒక్కో కార్డు ధరను రూ. 35 నుంచి రూ. 42కి పెంచేందుకు బ్యాంకులు అంగీకరించాయి. అయితే, అవే వెండర్ సంస్థలు మూడు నెలల క్రితం మళ్లీ రేట్లు పెరిగాయంటూ బ్యాంకులను సంప్రదించాయి. దీంతో కార్డులు లేకుంటే వ్యాపారం దెబ్బతింటుందనే భయంతో ఒక పెద్ద ప్రైవేట్ బ్యాంకు రూ. 10 మేర పెంచేందుకు అంగీకరించిందని అధికారి తెలిపారు.
గత కొద్ది నెలలుగా కార్డులకు డిమాండ్ పెరుగుతుండటంతో బ్యాంకులే పెరిగిన రేటు భారాన్ని మోస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది జూలై ఆఖరు నాటి 92.81 కోట్ల డెబిట్ కార్డులు, 8 కోట్ల పైగా క్రెడిట్ కార్డులు ఉన్నాయి. ఏప్రిల్ మొదలైన ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా 20 లక్షల పైచిలుకు కార్డులు జారీ అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment