ముంబై: బ్యాంకుల్లోకి రూ.2,000 నోట్ల రూపంలో రూ.1–1.5 లక్షల కోట్ల వరకు డిపాజిట్లు అదనంగా వచ్చి చేరొచ్చని యాక్సిస్ బ్యాంక్ ముఖ్య ఆర్థికవేత్త సౌగత భట్టాచార్య తెలిపారు. దీంతో 2023–24లో డిపాజిట్లలో వృద్ధి 11 శాతానికి పైగా ఉండొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆర్‌బీఐ రూ.2,000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించడం తెలిసిందే. వ్యవస్థలో రూ.3.62 లక్షల కోట్ల విలువైన రూ.2,000 నోట్లు ఉన్నట్టు ఆర్‌బీఐ గణాంకాల ఆధారంగా తెలుస్తోంది.
ఈ నోట్లను వచ్చే సెప్టెంబర్ 30 నాటికి బ్యాంకుల్లో మార్చుకోవడం లేదా ఖాతాలలో డిపాజిట్ చేసుకునేందుకు ఆర్‌బీఐ అనుమతించింది. రుణాల్లో వృద్ధి గత ఆర్థిక సంవత్సరంలో 16 శాతంగా ఉంటే, అది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13 శాతానికి తగ్గొచ్చని భట్టాచార్య అంచనా వేశారు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్నందున ఆర్‌బీఐ వచ్చే వారం సమీక్షలో రేట్లపై యథాతథ స్థితిని కొనసాగించొచ్చని, రేట్లను తగ్గించాల్సిన అవసరం ఇప్పుడు అయితే లేదన్నారు. వృద్ధిపై ఒత్తిళ్లు ఉన్నందున 2023–24 నాలుగో త్రైమాసికంలో (2024 జనవరి–మార్చి) ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించొచ్చని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం సగటున 4.8 శాతం స్థాయిలో ఉండొచ్చన్నారు. ఇది ఆర్‌బీఐ నిర్ధేశిత లక్ష్యంలోపు అనే విషయాన్ని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment