జోరందుకున్న బ్యాంకుల డిపాజిట్ వేట
రుణాల జోరు.. డిపాజిట్ల డీలా ఎఫెక్ట్
అధిక వడ్డీ స్కీమ్‌లతో నిధుల సమీకరణకు సై..
సీనియర్ సిటిజన్లకు అర శాతం అదనం
గత కొన్నాళ్లుగా బ్యాంకుల రుణ వృద్ధి భారీగా ఎగబాకుతోంది. డిపాజిట్లు మాత్రం ఆ మేరకు పెరగడం లేదు. రెండింటి మధ్య కొంత అంతరం ఉండటం సహజమే కానీ, ఇంత భారీ వ్యత్యాసం ఉండకూడదు. దీనివల్ల బ్యాంకింగ్ రంగంలో వ్యవస్థాగత ద్రవ్య సరఫరా (లిక్విడిటీ) సమస్యలకు దారితీస్తుంది. ప్రజల పొదుపు ధోరణుల్లో తీవ్ర మార్పులు చోటు చేసుకుంటాయి. దీన్ని అధిగమించేందుకు బ్యాంకులు వెంటనే తగిన వ్యూహాలను అమలు చేయాలి.
– తాజాగా ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వ్యక్తం చేసిన ఆందోళన ఇది.
ఈ దెబ్బతో బ్యాంకులు డిపాజిట్ల వేటను ముమ్మరం చేశాయి. ప్రత్యేక స్కీమ్‌ల ద్వారా మరిన్ని రిటైల్ డిపాజిట్ల సమీకరణకు తెరతీస్తున్నాయి. ఇప్పటికే ఉన్న డిపాజిట్ పథకాలతో పోలిస్తే 25–30 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు అంటే 1 శాతం) అధిక వడ్డీని కూడా ఆఫర్ చేస్తూ డిపాజిటర్లకు గాలం వేస్తున్నాయి. తాజా పరిణామాలతో, రుణా లపై అధిక వడ్డీరేట్ల భారం మరికొన్నాళ్లు కొనసాగుందని స్పష్టమవుతోంది.
డిపాజిట్ల పెంపునకు తక్షణం చర్యలు చేపట్టాలంటూ బ్యాంకులను ఆర్‌బీఐ ఆదేశించిన తర్వాత ప్రభుత్వ రంగ బ్యాంకులు పొలోమంటూ కొత్త పథకాలను ప్రకటించాయి. ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ), యూనియన్ బ్యాంక్, అలాగే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఈ రేసులో ముందున్నాయి. 7.25 శాతం నుంచి 7.3 శాతం మేర వడ్డీరేట్లతో డిపాజిట్ స్కీమ్‌లను ప్రకటించాయి. వీటి కాలవ్యవధి 399 రోజుల నుంచి 444 రోజుల వరకు ఉంటోంది. ఐఓబీ అత్యధికంగా 444 రోజుల డిపాజిట్ స్కీమ్‌పై 7.3 శాతం వడ్డీ ఇస్తోంది.
అంతేకాకుండా బ్యాంకులన్నీ సీనియర్ సిటిజన్లకు అదనంగా మరో అర శాతం వడ్డీని కూడా అందిస్తుండటంతో డిపాజిటర్లకు మేలు చేకూరుతోంది. ‘4% స్థాయికి ద్రవ్యోల్బణం శాంతిస్తే, ఆర్‌బీఐ రేట్ల కోత మొదలవుతుంది. అప్పుడు డిపాజిట్లపై అధిక రేట్ల వల్ల బ్యాంకుల వ్యయాలు పెరిగిపోతాయి. అందుకే బ్యాంకులు స్వల్ప కాలిక డిపాజిట్లకే అధిక వడ్డీని పరిమితం చేస్తున్నాయి’ అని ఇక్రా రేటింగ్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ గుప్తా అభిప్రాయపడ్డారు.
20 ఏళ్లలో తొలిసారి...
ఈ ఏడాది జూలై 12 నాటికి బ్యాంకుల డిపాజిట్ల వృద్ధి 11 శాతానికి పరిమితమైంది. అయితే, రుణ వృద్ధి మాత్రం 14 పైగా శాతంగా నమోదైంది. దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో రుణ, డిపాజిట్ వృద్ధిలో ఇంత తేడా రావడం గడిచిన 20 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీంతో ఈ అంతరాన్ని తగ్గించాల్సిందేనని బ్యాంకు సీఈఓలకు ఆర్‌బీఐ స్పష్టం చేస్తోంది. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో భారత్ కూడా అందుకు మినహాయింపు కాదని, పాలసీ వడ్డీ రేట్ల కోత గురించి ఆలోచించడం తొందరపాటేనంటూ గవర్నర్ శక్తికాంత్ దాస్ తాజాగా పేర్కొనడం విశేషం. కాగా, ప్రస్తుత వడ్డీ రేట్లతో రిటైల్ డిపాజిట్ల సమీకరణ బ్యాంకులకు కష్టతరంగా మారిందని, అందుకే పరిమిత కాల స్కీమ్‌లను ప్రారంభించాల్సి వస్తోందని ఓ వాణిజ్య బ్యాంకు ట్రెజరీ హెడ్ పేర్కొన్నారు.
ప్రత్యేక డిపాజిట్ ఆఫర్స్...
ఎస్‌బీఐ– అమృత్ వృష్టి: వడ్డీ రేటు 7.25% (కాల వ్యవధి 444 రోజులు)
బ్యాంక్ ఆఫ్ బరోడా – మాన్సూన్ ధమాకా: 7.25% (399 రోజులు)
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర: 7.15% (666 రోజులు)
యూనియన్ బ్యాంక్: 7.25% (399 రోజులు)
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్: 7.3% (444 రోజులు)
Comments
Please login to add a commentAdd a comment