ఈ బ్యాంకుల్లో ఇంతే...
న్యూఢిల్లీః సగటు మదుపరిపై భారతీయ బ్యాంకులు పంజా విసురుతున్నాయి. ఒకదాని వెంట ఒకటి సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లను కోత పెడుతున్నాయి. నోట్ల రద్దుతో బ్యాంకుల వద్ద మిగులు నిల్వలు ఉండటం, ద్రవ్యోల్బణం దిగి రావడంతో వడ్డీ రేట్లను బ్యాంకులు తగ్గించేస్తున్నాయి. దేశంలో అతి పెద్ద బ్యాంకు ఎస్‌బీఐ సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేటును నాలుగు శాతం నుంచి 3.5 శాతానికి తగ్గించడంతో ఇతర బ్యాంకులూ అదే బాట పట్టాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.50 లక్షల లోపు బ్యాలెన్స్ కలిగిన పొదుపు ఖాతాలపై వడ్డీ రేటును 4 నుంచి 3.5 శాతానికి తగ్గించింది.
ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ సైతం సేవింగ్స్ ఖాతా వడ్డీ రేట్లలో కోతలు విధించింది. ఇండియన్ బ్యాంక్, కర్నాటక బ్యాంక్‌లూ పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లను తగ్గించేశాయి. మరో వైపు పొదుపు ఖాతాలపై ఆరు శాతం వడ్డీ రేటుతో మదుపరులను ఆకర్షించే యస్ బ్యాంక్ సైతం వడ్డీ రేటును ఒక శాతం తగ్గించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సైతం పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.