సాక్షి, న్యూఢిల్లీ : రుణాలు తీసుకున్న విద్యార్థులు తిరిగి వాటిని చెల్లించక పోవడంతో భారతీయ బ్యాంకులు వారికి రుణాలు ఇవ్వాలంటే భయపడుతున్నాయి. దాంతో విద్యార్థులకు రుణాలిస్తున్న శాతం రోజు రోజుకు గణనీయంగా పడిపోతోంది. 2015 నుంచి 2017 సంవత్సరాల మధ్య విద్యార్థులకు రుణాలు మంజూరు చేయడం ఏకంగా 17 శాతం నుంచి రెండు శాతానికి పడిపోయింది. విద్యార్థులు తాము తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లించక పోవడమే కారణమని ‘ది రీసర్చ్ అండ్ రేటింగ్ ఏజెన్సీ–కేర్ రేటింగ్స్’ తన తాజా నివేదికలో వెల్లడించింది.
విద్యార్థులు తీసుకున్న రుణాల్లో 2015 నుంచి 2017 సంవత్సరాల మధ్య నిరర్థక ఆస్తులు 5.7 శాతం నుంచి 7.7 శాతానికి పెరిగాయి. అంటే, 2017, మార్చి నెల నాటికి నిరర్థక ఆస్తులు 5,192 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఆర్బీఐ లెక్కల ప్రకారం 2016, డిసెంబర్ నెల నాటికి దేశంలోని విద్యార్థులకు బ్యాంకులు మొత్తం 72,336 కోట్ల రూపాయల రుణాలను మంజూరు చేశాయి. వాటిలో 95 శాతం రుణాలను ప్రభుత్వరంగ బ్యాంకులే అందజేశాయి. మొండి బకాయిల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కాకుండా డిగ్రీ విద్యార్థులు తీసుకున్న రుణాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ రుణాల్లో కూడా మూడవ పార్టీ, కొలాటరల్ గ్యారెంటీ అవసరం లేకుండా నాలుగు లక్షల రూపాయలలోపు తీసుకున్న రుణాలే ఎక్కువ. తల్లిదండ్రులు, విద్యార్థులు సంయుక్తంగా చెల్లించాల్సిన రుణాలకన్నా విద్యార్థులు చెల్లించాల్సిన రుణాల్లోనే ఎక్కువ మొండి బకాయిలు ఉన్నారు.
ఇక ప్రాంతాల వారిగా ఈ మొండి బకాయిలను చెల్లించని వారు ఎంతంటే దక్షిణాదిలో 56 శాతం మంది విద్యార్థులుండగా, ఉత్తరాదిలో 44 శాతం మంది విద్యార్థులు ఉన్నారు. దక్షిణాదిలోనూ కేరళ, తమిళనాడులోనే మొండి బకాయిలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో మొండి బకాయిల శాతం పది శాతం ఉండగా, దేశవ్యాప్తంగా సగటున 7.67 శాతం ఉంది.
బ్యాంకులు విద్యార్థులకు రుణాలు మంజూరు చేయడానికి నిరాకరిస్తున్న నేపథ్యంలో నాన్ బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలు విద్యార్థులకు రుణాలను మంజూరు చేస్తున్నాయి. ఆ సంస్థలు 2017, మార్చి నెల నాటికి 5000 కోట్ల రూపాయలను విద్యార్థులకు రుణంగా అందజేశాయి. రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకులు చేసిన పొరపాట్లను ఈ సంస్థలు చేయడం లేదు. ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, మాస్టర్ ఆఫ్ సైస్స్ కోర్సులు చేస్తున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు మాత్రమే రుణాలు మంజూరు చేస్తున్నాయి. కొలాటరల్ లేదా మూడవ పార్టీ గ్యారెంటీ అవసరం లేని రుణాలను మంజూరు చేయడం లేదు. ఉద్యోగాలు లేక , రాక, వచ్చిన తక్కువ జీతాలను ఆఫర్ చేయడం వల్ల తాము రుణాలను చెల్లించలేక పోతున్నామని మొండి బకాయిల విద్యార్థులు వాపోతున్నారు. నీరవ్ మోదీ లాంటి వాళ్లు వేల, వేల కోట్ల రూపాయలను చెల్లించక పోయినా పట్టించుకోరుగానీ, తాము పది, పాతిక లక్షల రూపాయలను చెల్లించకపోతనే బ్యాంకులు లబోదిబోమంటున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment