సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో సిలబస్ భారం తగ్గనుంది. ప్రతి కోర్సులో, ప్రతి సబ్జెక్టులో కొన్ని పాఠ్యాంశాలను తగ్గించి కొత్త పుస్తకాలను అందుబాటులోకి తెచ్చేందుకు ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రస్తుతమున్న 180 క్రెడిట్ పాయింట్లను 150 క్రెడిట్లకు తగ్గించాలని నిర్ణయించింది. అలాగే పది పాయింట్ల యూనిఫామ్ గ్రేడింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చేలా చర్యలు చేపట్టింది. దీంతోపాటు డిగ్రీలో ఔట్‌కమ్ బేస్డ్ విద్యా విధానాన్ని అమల్లోకి తెచ్చేలా చర్యలు చేపట్టింది. ప్రతి పాఠ్యాంశానికి ముందు, ప్రతి పుస్తకానికి ముందు పేజీల్లో దానిని చదివితే ఒనగూరే ప్రయోజనాలను వివరిస్తూ ముందుమాట పొందుపరిచేందుకు చర్యలు చేపట్టింది. ఆయా కోర్సు చదివితే భవిష్యత్తులో ఉండే అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కలిగేలా విషయాన్ని పుస్తకాల్లో పొందుపరుచాలని నిర్ణయించింది. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం (సీబీసీఎస్) అమల్లోకి తెచ్చి మూడేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఉన్నత విద్యా మండలి ఆ విధానంపై సమీక్షించి ఈ నిర్ణయాలు తీసుకుంది. అంతేకాదు విద్యా ర్థుల్లో సామర్థ్యాలు, నైపుణ్యాల పెంపునకు డిగ్రీలో ప్రాధాన్యం ఇవ్వనుంది. కోర్ సబ్జెక్టులు, ఎలక్టివ్స్‌తోపాటు వీటిని తప్పనిసరి అంశాలుగా చేర్చింది. ఈ మేరకు సిలబస్‌లో మార్పులు తెస్తోంది. ఇందులో భాగంగా వివిధ యూనివర్సిటీలకు చెందిన తెలుగు, హిందీ, ఉర్దూ, ఆంగ్లం, కన్నడ, సంస్కృతం, పర్షియన్, అరబిక్, మరాఠీ విభాగాలకు చెందిన బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్లు, విభాగాధిపతులతో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి భేటీ అయ్యారు. భాషల్లో తీసుకురావాల్సిన మార్పులపై చర్చించారు. మిగతా సబ్జెక్టుల వారితోనూ సమావేశమై సిలబస్ తగ్గింపునకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మార్పు లను 2019–20 విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి తేవాలని మండలి నిర్ణయించింది.
ఒక్కో వర్సిటీలో ఒక్కోలా గ్రేడింగ్
ప్రస్తుతం రాష్ట్రంలోని ఒక్కో వర్సిటీలో ఒక్కో తరహా గ్రేడింగ్, మార్కుల విధానం ఉంది. ఒక వర్సిటీలో గ్రేడింగ్ ఎ+ నుంచి ప్రారంభిస్తే కొన్నింట్లో ఎ నుంచి ఉంది. కొన్ని వర్సిటీల్లో 80 శాతం నుంచి 100 శాతం మార్కులు వస్తే ఎ గ్రేడ్ ఉండగా, కొన్నింట్లో 90 శాతం నుంచి 100 శాతం మార్కులు వచ్చినా ఎ గ్రేడ్ ఉంది. ఈ నేపథ్యంలో అన్ని వర్సిటీల్లో ఒకే తరహా గ్రేడింగ్, మార్కుల విధానం తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది.
యూజీసీ నిబంధనల మేరకు..
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనలకు అనుగుణంగా డిగ్రీలో ఉన్న క్రెడిట్స్‌ను తగ్గించాలని నిర్ణయించింది. యూజీసీ నిబంధనల ప్రకారం 120 క్రెడిట్స్‌తో మూడేళ్ల డిగ్రీ కోర్సును పూర్తి చేయవచ్చు. అయితే రాష్ట్రంలో ఇప్పటి వరకు 180 క్రెడిట్స్‌తో డిగ్రీ కోర్సును నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థులపై భారం పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రతి సెమిస్టర్‌లో 25 క్రెడిట్స్ చొప్పున మూడేళ్లలో ఆరు సెమిస్టర్లకు 150 క్రెడిట్స్‌తో డిగ్రీని పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. ఆ మేరకు పాఠ్యాంశాలను తగ్గించాలని నిర్ణయించారు.
ఔట్‌కమ్ బేస్డ్ విద్యా విధానం
సిలబస్ మార్పులతోపాటు డిగ్రీలో ఔట్‌కమ్ బేస్డ్ విద్యా విధానానికి శ్రీకారం చుట్టింది. ఔట్‌కమ్ బేస్డ్ లెర్నింగ్, ఔట్ కమ్ బేస్డ్ టీచింగ్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. ఒక విద్యార్థి ఒక కోర్సులో చేరుతున్నప్పుడు ఆ కోర్సులో చేరితే చేకూరే ప్రయోజనాలు, భవిష్యత్‌లో అవకాశాలను లెక్చరర్లు క్షుణ్ణంగా వివరిస్తారు. అలాగే ప్రతి సబ్జెక్టులో ముందు పేజీల్లో దాన్ని చదివితే విద్యార్థికి లభించే ప్రయోజనాలు, అందే విజ్ఞానం గురించి చెబుతారు. ప్రతి పాఠ్యాంశం ముందు కూడా అలాగే ప్రయోజనాలను పొందుపరుస్తారు.
మూడేళ్ల పాటు భాషలు, ఇతర మార్పులు
భాషా సబ్జెక్టులు ప్రస్తుతం డిగ్రీ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లోనే 4 సెమిస్టర్లలో ఉన్నాయి. వాటిని ఇకపై మూడేళ్లపాటు ఆరు సెమిస్టర్లలో కొనసాగిస్తారు. వీటికి 20 క్రెడిట్స్ ఇచ్చేలా చర్యలు చేపట్టారు.
వీటితోపాటు..
- ఐదో సెమిస్టర్‌లో జనరల్ ఎలక్టివ్‌కు 4 క్రెడిట్స్, ఆరో సెమిస్టర్‌లో ప్రాజెక్టు వర్క్ పెట్టి దానికి 4 క్రెడిట్స్ ఇవ్వాలని మండలి నిర్ణయించింది.
- ఎబిలిటీ ఎన్‌హాన్స్‌మెంట్ కోర్సు, స్కిల్ ఎన్‌హాన్స్‌మెంట్ కోర్సును తప్పనిసరి సబ్జెక్టులుగా అమలు చేయనున్నారు. ఇందులో ఎన్విరాన్‌మెంట్ సైన్స్, బేసిక్ కంప్యూటర్ స్కిల్స్‌తోపాటు ఇతర అంశాలు నేర్పిస్తారు.
- ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ, ఇతర స్పోర్ట్స్‌కు మొత్తంగా 6 క్రెడిట్స్ ఇవ్వనున్నారు.
- విద్యార్థులకు 6 వారాల పాటు సమ్మర్ ఇంటర్న్‌షిప్ అమలు చేయనుంది. ప్రథమ సంవత్సరం పూర్తయ్యాక లేదా ద్వితీయ సంవత్సర పూర్తయిన తరువాత దీనిని అమలు చేయనుంది. దానికి 2 క్రెడిట్స్ ఇవ్వనుంది.
- అలాగే బీకాంలో కొత్త కోర్సులను ప్రవేశ పెట్టేలా చర్యలు చేపట్టింది. బీకాంతోపాటు బీకాం కంప్యూటర్ అప్లికేషన్స్, బీకాం అడ్వర్టైజింగ్ అండ్ సేల్స్ మేనేజ్‌మెంట్, బీకాం టాక్స్ ప్రొసీజర్స్, బీకాం ఫారిన్ ట్రేడ్, బీకాం హానర్స్ కోర్సులను నిర్వహించాలని నిర్ణయించింది.
- ఇప్పటివరకు ఉన్న బీకాం కంప్యూటర్స్, బీకాం ఈ కామర్స్ రెండింటిని కలిపి బీకాం కంప్యూటర్ అప్లికేషన్స్‌గా నిర్వహించనుంది.
Comments
Please login to add a commentAdd a comment