
2017 నాటికి కుప్పకూలనున్న భారత బ్యాంకులు
న్యూఢిల్లీ: భారత బ్యాంకుల నుంచి వేలాది కోట్ల రూపాయలను రుణంగా తీసుకొని ఎగవేసిన వారిలో మనకు ప్రత్యక్షంగా కనిపించేది లిక్కర్ బారెన్ విజయ్ మాల్యానే కావచ్చు. ఇలా ఎగవేస్తున్న టాప్ వంద కంపెనీల్లో ఆయన ఒక భాగం మాత్రమే. విజయ్ మాల్యా తొమ్మిదివేల కోట్ల రూపాయలను ఎగవేయగా, ఆయనలాగా ఎగవేసిన వారి మొత్తం రుణాలు 1.14 లక్షల కోట్ల రూపాయలంటే ఆశ్చర్యం వేస్తోంది. ఇక వసూలు కావనుకొని బ్యాంకులు ఇప్పటికే నిరర్థక ఆస్తుల కింద లెక్కించిన రుణాల మొత్తం 3.6 లక్షల కోట్ల రూపాయలు. వాయిదాలు గడిచిపోయినప్పటికీ చెల్లించని వారి రుణాల మొత్తాన్ని కలుపుకుంటే 6.7 లక్షల కోట్ల రూపాయలు ఉంటుందట.
భారత బ్యాంకుల ఆర్థిక పరిస్థితిపై తాజాగా విడుదలైన ఆర్థిక సుస్థిరత నివేదికే ఈ అంశాలను వెల్లడించింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే 2017 నాటికి బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని ఆ నివేదిక హెచ్చరిస్తోంది. 6.7 లక్షల కోట్ల రూపాయలు ఒక్క పైసా కూడా వసూలయ్యే అవకాశం ఎలాగు లేదని రిసెర్చ్ అండ్ క్రెడిట్ రేటింగ్ సంస్థలే తెలియజేస్తున్నాయి.
భారత బ్యాంకుల నుంచి ఐదు కోట్ల రూపాయలకుపైగా రుణాలు తీసుకున్న వారి సంఖ్య మొత్తం రుణ గ్రహీతల్లో 58 శాతం ఉండగా, మొత్తం డీ ఫాల్టర్లలో వీరి సంఖ్య 86.4 శాతం ఉండడం గమనార్హం. వేలాది కోట్ల రూపాయలను ఎగవేసిన వారిలో వంద ప్రముఖ కార్పొరేట్ సంస్థలు ఉండడం దిగ్భ్రాంతికరమైన విషయం. నిరర్థక ఆస్తుల కింద మొండిబకాయిలుగా మారిన రుణాలు గత సెప్టెంబర్ నెలలో 5.1 శాతంకాగా, మార్చి నెలనాటికి అది 7.6 శాతానికి పెరిగింది. 2017 నాటికి 9.3 శాతానికి పెరుగుతుందని ఆర్థిక సుస్థిర నివేదిక అంచనావేసింది.
మొండి బకాయిలను 2017లోగా వసూలుచేసి క్లియర్ బ్యాలెన్స్ షీటును రూపొందించాలని దేశంలోని అన్ని బ్యాంకులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. వేలాది కోట్ల రూపాయలను రుణంగా తీసుకున్న 500 మంది డీఫాల్టర్లలో 240 మంది రుణాలను చెల్లించే పరిస్థితుల్లోనే లేరని ఆర్థిక సుస్థిరత నివేదికనే తెలియజేస్తుంటే ఇంక ఆర్‌బీఐ గవర్నర్ ఉత్తర్వులను బ్యాంకులు ఎలా అమలు చేయగలగుతాయి. మొండి బకాయిలపై కఠిన చర్యలను తీసుకొని నిరర్థక ఆస్తుల విలువను తగ్గించుకోలేకపోయినట్లయితే బ్యాంకులు కుప్పకూలే ప్రమాదం తప్పదు.