ఇప్పటికిప్పుడు వడ్డీరేటు తగ్గే పరిస్థితి లేదు
ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: తక్షణం వడ్డీరేటు సరళతరం అయ్యే అవకాశం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ తెలిపారు. వినియోగ ధరల సూచీ ఆధారిత (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2 ప్లస్‌తో ఆరు శాతానికి కట్టడి చేయాలన్న కేంద్రం నిర్దేశం... ప్రస్తుతం 6 శాతం దిగువనే ఉన్న పరిస్థితి (మేలో ఏడాది కనిష్ట స్థాయిలో 4.75 శాతం)ని ఆయన ప్రస్తావిస్తూ, ‘‘ప్రస్తుత ద్రవ్యోల్బణం–4 శాతం లక్ష్యం మధ్య ఉన్న అంతరాన్ని బట్టి వడ్డీ రేటుపై వైఖరిని మార్చడం చాలా ముందస్తు చర్య అవుతుంది’’ అని ఉద్ఘాటించారు.
రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యం 4 శాతమేనని పలు సందర్భాల్లో ఆర్‌బీఐ గవర్నర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణంపై ఆందోళనలు పొంచి ఉన్నాయని కూడా ఆయన పలు సందర్భాల్లో ప్రస్తావించారు. ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణంపై గవర్నర్ ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. జూన్ 2023 నుండి వరుసగా 11వ నెలలో ప్రధాన ద్రవ్యోల్బణం తగ్గింది. సేవల ద్రవ్యోల్బణం చారిత్రక కనిష్ట స్థాయిలకు దిగివచి్చంది. వస్తు ద్రవ్యోల్బణం అదుపులోనే ఉంది. ఈ నేపథ్యంలో గవర్నర్ ఇచి్చన ఒక ఇంటర్వ్యూలో కొన్ని ముఖ్యాంశాలు..
→ మనం స్థిరమైన ప్రాతిపదికన 4 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం వైపునకు వెళ్లినప్పుడు వడ్డీరేటు వైఖరిలో మార్పు గురించి ఆలోచించే విశ్వాసం మనకు లభిస్తుంది.
→ ద్రవ్యోల్బణం ప్రయాణం అంచనాలకు తగ్గట్టుగానే పురోగమిస్తున్నది. అయితే పూర్తి 4 శాతం దిశగా ప్రయాణం అత్యంత కష్టతరమైన అంశం. ఇందుకు పలు అడ్డంకులు ఉన్నాయి.
→ మార్చి–మే మధ్య తయారీ, ఫ్యూయల్ అండ్ లైట్ ద్రవ్యోల్బణం తగ్గింది. అయితే ఆహార ద్రవ్యోల్బణం విషయలో ఇంకా ఆందోళనలు ఉన్నాయి. కూరగాయలుసహా పలు నిత్యావసరాల వస్తువుల ద్రవ్యోల్బణం స్పీడ్ రెండంకెలపైనే ఉంది.
→ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విషయానికి వస్తే పలు అంశాలు వృద్ధికి దోహదపడే విధంగా తమ పాత్రను పోషిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో వృద్ధి వేగం చాలా బలంగా ఉంది. ఇది మొదటి త్రైమాసికంలో బలంగా కొనసాగుతుందని భావిస్తున్నాం. జూన్ పాలసీ సమావేశంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాలను ఆర్‌బీఐ క్రితం 7 శాతం నుంచి 7.2 శాతానికి పెంచడం ఇక్కడ గమనార్హం. ఇదే జరిగితే దేశం వరుసగా నాలుగు సంవత్సరాల్లో 7 శాతం ఎగువన వృద్ధి సాధించినట్లు అవుతుంది.
పాలసీ విధానం పునరుద్ఘాటన
ఇంటర్వ్యూలో గవర్నర్ పాలసీ విధాన సమీక్ష అంశాలను పునరుద్ఘాటించడం గమనార్హం. ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షకు సంబంధించి జూన్ 5 నుంచి 7వ తేదీ మధ్య మూడు రోజుల పాటు సమావేశమైన ఆరుగురు సభ్యుల ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ)లో మెజారిటీ 4 శాతం దిగువకు రిటైల్ ద్రవ్యోల్బణం కట్టడే తన ప్రధాన లక్ష్యంగా పేర్కొంటూ వరుసగా ఎనిమిదవసారి కీలక రేటు– రెపోను (6.5 శాతం) యథాతథంగా ఉంచింది. అయితే వడ్డీ రేటును తగ్గించాలని గత సమీక్షలో అభిప్రాయపడిన వారు ఒకరే ఉండగా ఈసారి అది ఇద్దరికి పెరిగింది.
వీరిలో ఎంపీసీ ఎక్స్టర్నల్ సభ్యులు జయంత్ వర్మతో ఆషిమా గోయల్ కూడా ఉన్నారు. అయితే ఆర్బీఐ ఎంపీసీ మెజారిటీ సభ్యులు –ఎటువంటి అనిశ్చితి లేకుండా ద్రవ్యోల్బణం దిగువబాటనే కొనసాగుతుందన్న భరోసా వచ్చే వరకూ– వేచిచూసే ధోరణి పాటించాలని అభిప్రాయపడ్డారు. బ్యాంకులకు ఆర్‌బీఐ తానిచ్చే నిధులపై వసూలు చేసే వడ్డీ రేటును రెపో రేటుగా వ్యవహరిస్తారు. బ్యాంకింగ్ వ్యవస్థలో వడ్డీ రేట్లు ప్రధానంగా దీనిపై ఆధారపడి ఉంటాయి. 2023 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ దీన్ని యథాతథంగా కొనసాగిస్తోంది.
కాగా, వృద్ధికి విఘాతం కలగకుండా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయగలిగిన విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, ఆహార ధరలపరంగా ద్రవ్యోల్బణం మళ్లీ ఎగిసే రిసు్కలను ఎంపీసీ నిశితంగా పరిశీలిస్తోందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పాలసీ సమీక్ష సందర్భంగా చెప్పారు. ధరలు నిలకడగా ఉండే విధంగా స్థిరత్వాన్ని సాధించగలిగితేనే అధిక వృద్ధి సాధనకు పటిష్టమైన పునాదులు వేయడానికి సాధ్యపడగలదని ఆయన పేర్కొ న్నారు. ద్రవ్యోల్బణం భయాలు ఇంకా పొంచే ఉన్నాయని ఎంపీసీలోని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు.
ఆర్బీఐ పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2024–25లో 4.5 శాతం ఉంటుందన్నది ఆర్‌బీఐ పాలసీ అంచనా. క్యూ1 (ఏప్రిల్–జూన్) 4.9 శాతం, క్యూ2లో 3.8 శాతం, క్యూ3 లో 4.6 శాతం, క్యూ4లో 4.5 శాతం రిటైల్ ద్రవ్యో ల్బణం ఉంటుందని ఆర్‌బీఐ భావిస్తోంది. ఆహార ధరల తీవ్రతవల్లే రిటైల్ ద్రవ్యోల్బణం 4 శాతం దిగువకు రావడం లేదని ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష పేర్కొంది. మేలో ఏడాది కనిష్ట స్థాయిలో 4.75 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం నమోదయినప్పటికీ, ఆర్‌బీఐ గవర్నర్ పేర్కొంటున్న లక్ష్యం కన్నా 75 బేసిస్ పాయింట్లు అధికం.
Comments
Please login to add a commentAdd a comment