
ఎగవేతల నిగ్గు తేలాలి!
పది, ఇరవై వేల రూపాయల స్వల్పమొత్తం అప్పుతీసుకుంటున్న రైతులు దీనిని తీర్చడానికి అష్టకష్టాలు పడుతూ ఒకపక్క భూములు అమ్ముకుంటుంటే...
♦ మొండి బకాయిల మొత్తమెంతో ప్రజలకు తెలియాలి: సుప్రీం
♦ అభ్యంతరం వ్యక్తం చేసిన ఆర్‌బీఐ
♦ పూర్తిస్థాయిలో విచారణ చేస్తానన్న అత్యున్నత న్యాయస్థానం
♦ చిన్న రుణ రైతులు కష్టాలు
♦ పడుతుంటే కోట్ల బకాయిదారులు తప్పించుకుంటున్నారని వ్యాఖ్య
♦ పార్టీలుగా ఆర్థికశాఖ, ఐబీఏ కేసు తదుపరి విచారణ 26న
న్యూఢిల్లీ: పది, ఇరవై వేల రూపాయల స్వల్పమొత్తం అప్పుతీసుకుంటున్న రైతులు దీనిని తీర్చడానికి అష్టకష్టాలు పడుతూ ఒకపక్క భూములు అమ్ముకుంటుంటే... మరోవైపు బ్యాంకింగ్‌కు కోట్ల రూపాయలు బకాయిలు పడినవారు తమ కంపెనీలను దివాలాగా ప్రకటించి తప్పించుకుతిరుగుతున్నారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రూ.500 కోట్లు, ఆపైన బ్యాంకింగ్ బకాయిలు ఉన్న వ్యక్తులు, కంపెనీల పేర్లను రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) సీల్డ్ కవర్‌లో సమర్పించిన నేపథ్యంలో సుప్రీం మంగళవారం ఈ వ్యాఖ్యలు చేసింది. బకాయిదారులు, కంపెనీల పేర్లను బహిరంగపరిచే విషయాన్ని పక్కనపెడితే..
సంబంధిత రుణ మొత్తం భారీగా ఉన్నందున ఈ పరిమాణం దేశ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఆర్ భానుమతిలతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే దీనికి సైతం ఆర్‌బీఐ వ్యతిరేకత వ్యక్తం చేసింది. వ్యవస్థపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొంది. ఇటీవల పార్లమెంటుకు ఫైనాన్షియల్ స్టాండింగ్ కమిటీ సమర్పించిన నివేదిక ప్రకారం 2015 మార్చి ఆఖరునాటికి షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల మొండి బకాయిలు రూ. 3.23 లక్షల కోట్ల మేర వున్నాయి. తాజాగా ఆర్‌బీఐ సమర్పించిన వివరాలపై సుప్రీంకోర్టు వ్యక్తంచేసిన అభిప్రాయాన్ని బట్టి ఈ మొత్తం చాలా ఎక్కువ వుండవచ్చు.
పార్టీగా ఆర్థిక మంత్రిత్వశాఖ: కేసు మొత్తం విచారించి ఒక నిర్ణయం బకాయిల మొత్తాన్ని బహిరంగపర్చే విషయంలో) తీసుకుంటామని సుప్రీంకోర్టు తెలిపింది. కేసులో ఆర్థిక మంత్రిత్వశాఖ, ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ (ఐబీఏ) అభిప్రాయాలను కూడా తీసుకోవాలని నిర్ణయించిన కోర్టు వీటిని కేసులో ఇన్‌ప్లీడ్ చేస్తూ, నోటీసులు జారీ చేసింది. కేసు విచారణను 26వ తేదీకి వాయిదా వేసింది. కేసు విచారణ సందర్భంగా ఆర్‌బీఐ న్యాయవాది ఆర్‌బీఐ యాక్ట్, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ (రెగ్యులేషన్)యాక్ట్, 2005లనూ ప్రస్తావించారు. భారీ రుణ సమాచారాన్ని రహస్యంగా ఉంచాలంటూ ఈ చట్టాలు నిర్దేశిస్తున్నాయని తెలిపారు. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని (పిల్) దాఖలు చేసిన సెంటర్ ఫర్ పబ్లిక్ ఇన్‌ట్రస్ట్ లిటిగేషన్ (సీపీఐఎల్) తరఫు ప్రశాంత్ భూషన్ వాదనలు వినిపిస్తూ... రుణ పరిమాణం మొత్తం ఎంత ఉందన్నది వెల్లడించడం సరైనదేనని అన్నారు.
ఆర్‌బీఐపై ప్రశ్నల వర్షం..
కేసు విచారణ సందర్భంగా ఆర్‌బీఐపై అత్యున్నత న్యాయస్థానం కీలక ప్రశ్నలు సంధించింది. ‘మీరు ఇచ్చిన సంఖ్య భారీగా ఉంది. ఈ సంఖ్యను చూసిన తరువాత... రికవరీకి మీరు ఏమిచేస్తున్నారన్న ప్రశ్న తలెత్తుతుంది. ఇప్పటి వరకూ ఏమి చర్యలు తీసుకున్నారు’ అని న్యాయస్థానం ఆర్‌బీఐ న్యాయవాదిని ప్రశ్నించింది. రెగ్యులేటర్‌గా రుణ ఎగవేతదారుల పట్ల ఆర్‌బీఐ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
నేపథ్యం చూస్తే...
నిజానికి సెంటర్ ఫర్ పబ్లిక్ ఇన్‌ట్రస్ట్ లిటిగేషన్ దాదాపు పదేళ్ల క్రితం ఒక ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేస్తూ... అప్పట్లో ప్రభుత్వ రంగ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (హడ్కో) పలు కంపెనీలకు రుణాలు ఇవ్వడాన్ని ప్రశ్నించింది. ఆ కేసు పెండింగులో ఉన్న నేపథ్యంలోనే... ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండిబకాయిలు... కేవలం 2013-2015 మధ్య కాలంలోనే దాదాపు రూ.1.14 లక్షల కోట్ల రుణాల రద్దు చేయడం, మిగిలిన బకాయిలు కూడా రాబట్టుకోలేని పరిస్థితి వంటి అంశాలపై ఇటీవల ఒక జాతీయ దినపత్రికలో వచ్చిన నివేదికను అత్యున్నత న్యాయస్థానం తనకుతానుగా విచారణకు చేపట్టింది.
ఈ నేపథ్యంలో రూ.500 కోట్లు ఆపైన బకాయిదారులు, కంపెనీల జాబితాను ఆరు వారాల్లో అందించాలని గత నెలలో ఆర్‌బీఐని ఆదేశించింది. ఈ నెల 5వతేదీన పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ డిఫాల్టర్ల విషయాన్నీ ప్రస్తావించారు. డిఫాల్లర్ల(రుణ ఎగవేతదారులు) పేర్లన్నీ బయటపెట్టడం కుదరదని, దీని వల్ల వ్యాపారాలు పూర్తిగా మూతపడే అవకాశం ఉందనీ వెరసి పరిస్థితి అనవసర ఇబ్బందులకు దారితీస్తుందని విశ్లేషించారు.