
ముంబై: ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 27 శాతం తగ్గింది. గత క్యూ2లో రూ.357 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.260 కోట్లకు తగ్గినట్లు కెనరా బ్యాంక్ తెలిపింది. ఆదాయం తగ్గడం, కేటాయింపులు అధికంగా ఉండటం వల్ల నికర లాభం ఈ స్థాయిలో తగ్గిందని వివరించింది.
మొత్తం ఆదాయం రూ.12,187 కోట్ల నుంచి రూ.11,995 కోట్లకు తగ్గింది. స్థూల మొండి బకాయిలు 9.81 శాతం నుంచి 10.51 శాతానికి, నికర మొండి బకాయిలు 6.69 శాతం నుంచి 7.02 శాతానికి పెరిగాయి. అయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన చూస్తే స్థూల మొండి బకాయిలు ఆదే స్థాయిలో ఉండగా, నికర మొండి బకాయిలు తగ్గాయి.
మొండి బకాయిలకు కేటాయింపులు రూ.1,558 కోట్ల నుంచి రూ.1,950 కోట్లకు పెరిగాయని తెలిపింది. నికర వడ్డీ ఆదాయం 14 శాతం వృద్ధితో రూ.2,783 కోట్లకు పెరిగింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో కెనరా బ్యాంక్ షేర్ 5 శాతం తగ్గి రూ.404 వద్ద ముగిసింది. ఈ షేర్ ఏడాది కనిష్ట స్థాయి రూ.250, గరిష్ట స్థాయి రూ.463గా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment