బకాయిలు.. బాబోయ్! | Bank of Baroda's acquired loans help bank post lower NPAs | Sakshi
Sakshi News home page

బకాయిలు.. బాబోయ్!

Published Fri, Jun 3 2016 12:38 AM | Last Updated on Mon, Sep 4 2017 1:30 AM

బకాయిలు.. బాబోయ్!

బకాయిలు.. బాబోయ్!

ఎన్‌పీఏలు మరింత పెరిగే అవకాశం
బోలెడన్ని ఖాతాల్ని వాచ్‌లిస్ట్‌లో ఉంచామంటున్న బ్యాంకులు
ఇప్పటికే రూ.5.8 లక్షల కోట్లకు చేరిన లిస్టెడ్ బ్యాంకుల ఎన్‌పీఏలు
మొండిబకాయిలు, నష్టాలతో ప్రభుత్వ రంగ బ్యాంకుల కుదేలు
మున్ముందు పరిస్థితిపై మార్కెట్ వర్గాల ఆందోళన

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : తాజాగా దేశీ పీఎస్‌యూ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా... ఏకంగా లక్ష కోట్ల రూపాయల మొండి బకాయిలు(ఎన్‌పీఏ) ప్రకటించింది. ఇక మిగిలిన ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని చూస్తే గుండె గుభేలుమంటుంది. కొన్ని బ్యాంకులైతే ఏకంగా తమ వ్యాపారంలో 13-15% వరకూ మొండి బకాయిలున్నట్లు తేల్చాయి. అసలు 15% మొండి బకాయిలుంటే ఇక ఆ బ్యాంకుల నిర్వహణ ఖర్చులెంత? అవి ఇచ్చే రుణాలెంత? ఇవన్నీ చూస్తే అవి బతికి బట్టకట్టగలవా? అని సందేహాలు రేగుతున్నాయి.

 సాధారణంగా 90 రోజులు దాటిన తరవాత కూడా వాయిదా మొత్తం లేదా వడ్డీ చెల్లింపులు రాకపోయిన పక్షంలో సదరు ఖాతాలను ఎన్‌పీఏలుగా వర్గీకరిస్తారు. ఎందుకంటే వీటిద్వారా బ్యాంకులకు రావాల్సిన ఆదాయం రావడం ఆగిపోతుంది. దీంతో వాటి దృష్టిలో ఇవి నిరర్ధక ఆస్తులుగా మారతాయి. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభానంతరం ఎకానమీ మందగించటం, ప్రాజెక్టుల అమల్లో జాప్యం... వంటి అంశాలవల్లే చాలా కంపెనీలు రుణాల్ని తిరిగి చెల్లించలేకపోతున్నాయి.

మరోవంక ఉద్దేశపూర్వక ఎగవేతదారులు దీనికి తోడవుతుండటంతో బకాయిలు కొండలా పేరుకుపోతున్నాయి. అయితే, లాభాలు చూపించుకోక తప్పని ఒత్తిళ్లు, తాపత్రయంలో బ్యాంకులు వీటిని చాన్నాళ్లుగా మరుగున పెడుతూ వచ్చాయి. ఇవి ఏదో ఒక రోజున ఆటంబాంబుల్లా పేలక తప్పదని గుర్తించిన ఆర్‌బీఐ... నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా మొండిబకాయిలకు ప్రొవిజనింగ్ చేసేలా అసెట్ క్వాలిటీ  సమీక్షకు (ఏక్యూఆర్) ఆదేశించింది. దీంతో బ్యాంకులు ఎన్‌పీఏ గణాంకాలు బయటకు తియ్యకతప్పలేదు.

 రికార్డు స్థాయి నష్టాలు...
మొండి బకాయిల్లాంటి వాటికి ప్రొవిజనింగ్‌లు తదితర కారణాలతో ఈ మార్చి క్వార్టర్‌లో 25 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 15 నష్టాలు ప్రకటించాయి. ఇవి ప్రకటించిన నష్టాలు మొత్తం దాదాపు రూ. 23,493 కోట్ల పైచిలుకే. అంతక్రితం క్యూ4లో ఇవి రూ. 8,800 కోట్ల పైగా లాభాలు నమోదు చేశాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)... నష్టాల్లో రికార్డులు సృష్టించింది. దేశీయంగా ఏ బ్యాంకూ ఎరగనంత స్థాయిలో రూ.5,367 కోట్లు నష్టాన్ని ప్రకటించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా తదితర బ్యాంకులు కూడా అదే బాటలో నడిచాయి. రాష్ట్రానికి వస్తే.. ప్రొవిజనింగ్ తదితరాలకు కేటాయింపులు రూ. 1,023 కోట్లు కేటాయించడంతో క్యూ4లో ఆంధ్రా బ్యాంకు  నికర లాభం ఏకంగా 72 శాతం క్షీణించి రూ. 52 కోట్లకు తగ్గిపోయింది.

 ఇంకా పెరుగుతాయ్..!
గతేడాది ఆగస్టులో ప్రభుత్వ బ్యాంకులకు దాదాపు రూ. 70,000 కోట్ల మూలధనం సమకూర్చేలా ఆర్థిక మంత్రి జైట్లీ ప్రతిపాదన చేశారు. 2017 నాటికి బ్యాంకులు బ్యాలెన్స్ షీట్లను ప్రక్షాళన చేసుకోవాలనీ చెప్పారాయన. అయితే బ్యాంకులు కుస్తీ పడుతున్నప్పటికీ.. ఎన్‌పీఏల సమస్య ఇప్పుడే తీరేట్లు కనిపించడం లేదు. వచ్చే ఏడాది మార్చి దాకా ఇది కొనసాగవచ్చని ఆంధ్రా బ్యాంకు ఎండీ సురేశ్ ఎన్ పటేల్ వ్యాఖ్యానించారు. దాదాపు రూ.2,500-3,000 కోట్ల దాకా విలువ చేసే ఏడెనిమిది ఖాతాలు అనుమానాస్పదంగానే ఉన్నట్లు చెప్పారాయన. ఎస్‌బీఐ సుమారు రూ.31,000 కోట్ల అసెట్స్‌ను వాచ్ లిస్టులో ఉంచింది.

ఇందులో దాదాపు 70% ఖాతాలు సందేహాస్పదమైనవేనని బ్యాంకు చైర్మన్ అరుంధతీ భట్టాచార్య పేర్కొన్నారు. ఇతరత్రా ప్రైవేట్ బ్యాంకులూ ఇలాంటి హెచ్చరికలే చేశాయి. ఐసీఐసీఐ బ్యాంకు రూ. 52,638 కోట్లు, యాక్సిస్ బ్యాంక్ రూ. 22,000 కోట్ల విలువైన ఖాతాలను వాచ్ లిస్టులో ఉంచినట్లు చెప్పాయి. ఐతే చాలా బ్యాంకులు ఇప్పటికే పెద్ద ఎత్తున దిద్దుబాటు చర్యలు తీసుకున్నందున రాబోయే రోజుల్లో మొండి బాకీలు, నష్టాల తీవ్రత తగ్గొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

ఎన్‌పీఏలు రూ.5.8 లక్షల కోట్లు..
ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం 2004-2012 మధ్య సుమారు 4% మాత్రమే ఉన్న ఎన్‌పీఏల పెరుగుదల 2013-15 మధ్య ఏకంగా 60 %కి ఎగిసింది.

పీఎస్‌బీల్లో 2011లో రూ. 71,000 కోట్లుగా ఉన్న ఎన్‌పీఏలు 2015 నాటికి అయిదు రెట్లు పెరిగి రూ. 3.6 లక్షల కోట్లకు చేరాయి.

2013-15 మధ్య 29 పీఎస్‌యూలు దాదాపు రూ.1.14 లక్షల కోట్ల విలువైన మొండిబకాయిలను రైటాఫ్ చేసేశాయి.

2015-16 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రొవిజనింగ్ ఏకంగా 87 శాతం పెరుగుదలతో రూ. 96,698 కోట్ల నుంచి రూ. 1.75 లక్షల కోట్లకు ఎగిసింది.

{పస్తుతం స్టాక్ మార్కెట్లో లిస్టయిన 38 బ్యాంకుల స్థూల మొండిబకాయిలు 95 శాతం ఎగిసి రూ. 5.8 లక్షల కోట్లకు చేరాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement