
బ్యాంక్ షేర్ల ర్యాలీ..ప్రభావం చూపిన
ఆర్‌బీఐ విధాన సమీక్ష నేపథ్యంలో స్టాక్ మార్కెట్ లాభాల బాటలో సాగింది...
పెట్టుబడులు, రేట్ల కోత ఆశలు
- 72 పాయింట్ల లాభంతో 28,187 పాయింట్లకు సెన్సెక్స్
- 10 పాయింట్ల లాభంతో 8,543కు నిఫ్టీ
ఆర్‌బీఐ విధాన సమీక్ష నేపథ్యంలో స్టాక్ మార్కెట్ లాభాల బాటలో సాగింది. 2 నెలల్లో పలు ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.20,000 కోట్ల నిధులు అందించనున్నామన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటన కారణంగా బ్యాంక్ షేర్లు జోరుగా పెరిగాయి. దీనికి తోడు కీలక రేట్ల కోత ఉంటుందనే అంచనాలతో బ్యాంక్, వాహనషేర్లు ఎగిశాయి. దీంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 72పాయింట్లు లాభపడి 28,187 పాయింట్ల వద్ద, నిఫ్టీ 10 పాయింట్లు లాభపడి 8,543 పాయింట్ల వద్ద ముగిశాయి.సెన్సెక్స్‌కు ఇది ఒక వారం గరిష్ట స్థాయి. నాలుగు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 728 పాయింట్లు లాభపడింది.
ఎఫ్‌ఐఐల విశ్వాసం...
ఈ వారంలోనే ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్‌ఓ) స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల్ని ప్రారంభించడం, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడం, రూపాయి బలపడడం సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చాయి. చైనా తయారీ రంగం వృద్ధి జూలైలో రెండేళ్ల కనిష్ట స్థాయికి పడిపోవడంతో ఆసియా మార్కెట్లు నష్టాల పాలయ్యాయి. అయినప్పటికీ, ఇక్కడ బ్యాంక్, వాహన షేర్ల ర్యాలీతో స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. మారుతీ సుజుకీ, టాటా మోటార్స్ కార్ల అమ్మకాలు జూలైలో జోరుగా ఉండడంతో వాహన షేర్లుపెరగడం, కొన్ని బ్లూ-చిప్ షేర్ల ఆర్థిక ఫలితాలు బావుండడం కూడా ప్రభావం చూపాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు గత నెలలో రూ.2,298 కోట్ల నికర కొనుగోళ్లు జరపడం భారత మార్కెట్‌పై వారి విశ్వాసాన్ని సూచిస్తోందని నిపుణులంటన్నారు. కాగా నేడొక్కరోజే 209 షేర్లు ఏడాది గరిష్ట స్థాయిని తాకాయి.