బ్యాంక్ షేర్ల జోరు 28 వేల పాయింట్లపైకి సెన్సెక్స్
- 240 పాయింట్ల లాభంతో 28,021 పాయింట్లకు ప్రధాన సూచీ
- 85 పాయింట్ల లాభంతో 8,453కు నిఫ్టీ...
ప్రభుత్వ రంగ బ్యాంకులకు పెట్టుబడులందిస్తామన్న ప్రభుత్వ ప్రకటనకు సానుకూల అంతర్జాతీయ సంకేతాలు తోడవడంతో బుధవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. ఎనిమిది కీలక పరిశ్రమల గణాంకాలు ప్రోత్సాహాకరంగా ఉండడం సెంటిమెంట్‌కు మరింత జోష్‌నిచ్చింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 28,000 మార్క్‌ను. నిఫ్టీ 8,400 మార్క్‌ను దాటాయి. సెన్సెక్స్ 240 పాయింట్లు లాభపడి 28,021 పాయింట్ల వద్ద, నిఫ్టీ 85 పాయింట్లు లాభపడి 8,453 పాయింట్ల వద్ద ముగిశాయి. సూచీ లు రెండున్నర నెలల గరిష్టానికి చేరాయి. క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్, రియల్టీ, ఐటీ, టెక్నాలజీ షేర్లలో కొనుగోళ్ల జోరు కనిపించింది.
ఒక్కటి మినహా అన్ని సూచీలు లాభాల్లోనే...
గ్రీస్ ప్రధాని బెయిలవుట్ ప్యాకేజీకి అంగీకరించనున్నారన్న వార్తలు అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లను లాభాల్లో ముంచెత్తాయి. ఇది మన మార్కెట్లపై సానుకూలత చూపించింది. అంతర్జాతీయ మార్కెట్లు ఒడిదుడుకుల వల్ల భారత మార్కెట్లోకి నిధులు తరలివస్తాయని, ఈ విశ్వాసం తోనే పలు కంపెనీలు ఐపీఓల కోసం దరఖాస్తులు సమర్పిస్తున్నాయనే అంచనాలూ మార్కెట్ లాభాలకు తోడ్పడ్డాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 27,800- 28,099 పాయింట్ల కనిష్ట, గరిష్ట స్థాయిల మధ్య కదలాడింది.
మార్కెట్ క్యాప్... ఓఎన్‌జీసీ స్థానంలోకి కోల్ ఇండియా...
షేర్ ధర పరుగు కారణంగా... అత్యధిక మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న ప్రభుత్వ రంగ కంపెనీగా కోల్ ఇండియా నిలిచింది. ఇప్పటి వరకూ ఈ స్థానంలో ఉన్న ఓఎన్‌జీసీ రెండో స్థానానికి పడిపోయింది. గురువారం నాటికి కోల్ ఇండియా మార్కెట్ క్యాప్ రూ.2,68,509 కోట్లుగా, ఓఎన్‌జీసీ మార్కెట్ క్యాప్ 2,68,386 కోట్లుగా ఉన్నాయి.
30కి 23 సెన్సెక్స్ షేర్లు లాభాల్లోనే..:
30 సెన్సెక్స్ షేర్లలో 23 షేర్లు లాభాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.3,226 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ నగదు విభాగంలో రూ.15,886 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.1,75,052 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.75 కోట్లు, దేశీ ఇన్వెస్టర్లు రూ.52 కోట్ల విలువైన నికర కొనుగోళ్లు జరిపారు.