మార్కెట్లో లాభాల వర్షం! | Global cues drive Sensex, Nifty, Midcap lower; ITC soars 5% | Sakshi
Sakshi News home page

మార్కెట్లో లాభాల వర్షం!

Published Thu, May 26 2016 2:18 AM | Last Updated on Mon, Sep 4 2017 12:55 AM

మార్కెట్లో లాభాల వర్షం!

మార్కెట్లో లాభాల వర్షం!

స్కైమెట్ అంచనాలతో స్టాక్ సూచీలకు భారీ లాభాలు
ప్రొత్సాహకరంగా కంపెనీల ఫలితాలు
ఆర్థిక సంస్కరణలపై ఆశలు
సానుకూలంగా అంతర్జాతీయ సంకేతాలు
డెరివేటివ్స్ ముగింపు కారణంగా షార్ట్ కవరింగ్
576 పాయింట్ల లాభంతో 25,881కు సెన్సెక్స్
186 పాయింట్ల లాభంతో 7,935కు చేరిన నిఫ్టీ

స్టాక్ మార్కెట్లో బుధవారం లాభాల వర్షం కురిసింది. ప్రభుత్వం సంస్కరణలను వేగవంతం చేయనున్నదన్న అంచనాలకు సానుకూల అంతర్జాతీయ సంకేతాలు తోడవడంతో స్టాక్ సూచీలు దూసుకుపోయాయి.

సెన్సెక్స్, నిఫ్టీలు 2 శాతానికి పైగా పెరిగాయి. కంపెనీల ఆర్థిక ఫలితాలు ప్రోత్సాహాకరంగా ఉండడం, వర్షాలు విస్తారంగా కురుస్తాయన్న స్కైమెట్ తాజా అంచనాలు, నేడు (గురువారం) డెరివేటివ్ కాంట్రాక్టులు ముగియనున్న నేపథ్యంలో ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు కవర్ చేసుకోవడం  సానుకూల ప్రభావం చూపాయి. సెన్సెక్స్ 576 పాయింట్లు లాభపడి 25,881 పాయింట్ల వద్ద, నిఫ్టీ 186 పాయింట్లు లాభపడి 7,935  పాయింట్ల పైన ముగిశాయి. ఆర్థిక, బ్యాంక్ షేర్లు బాగా పెరిగాయి. క్యాపిటల్ గూడ్స్, టెక్నాలజీ, విద్యుత్, ఇంధన, రియల్టీ, వాహన షేర్లు లాభపడ్డాయి. అన్ని రంగాల సూచీలు లాభాల్లో ముగిశాయి.
 
రోజంతా లాభాలే...
బీఎస్‌ఈ సెన్సెక్స్ 25,432 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఆ తర్వాత ఈ లాభాల పరుగు ఎలాంటి అడ్డంకులు లేకుండా జోరుగా కొనసాగింది. ఇంట్రాడేలో 25,898 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 576 పాయింట్ల (2.28 శాతం)లాభంతో 25,881 పాయింట్ల వద్ద ముగిసింది. మార్చి 1 తర్వాత సెన్సెక్స్ ఈ స్థాయి లాభాలను కళ్ల జూడటం ఇదే మొదటిసారి. ఇంట్రాడేలో 7,841 పాయింట్లను తాకిన నిఫ్టీ చివరకు 186 పాయింట్లు(2.4%) లాభపడి 7,935 పాయింట్ల వద్ద ముగిసింది.
 
సెన్సెక్స్‌లో ఒక్క షేరుకే నష్టాలు..
సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 29 షేర్లు లాభాల్లోనే ముగిశాయి. ఒక్క షేర్ మాత్రమే నష్టపోయింది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడంతో సిప్లా షేర్ 5 శాతం క్షీణించి రూ. 470 వద్ద ముగిసింది. ఇక లాభపడిన షేర్ల విషయానికొస్తే,  ఐసీఐసీఐ బ్యాంక్ 4.4 శాతం, భెల్ 4.3 శాతం, ఎల్ అండ్ టీ 4 శాతం, బజాజ్ ఆటో 3.9 శాతం, మారుతీ సుజుకి 3.4 శాతం, ఎస్‌బీఐ 3.3 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 2.8 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 2.8 శాతం, గెయిల్ 2.7 శాతం, ఏషియన్ పెయింట్స్ 2.7 శాతం, యాక్సిస్ బ్యాంక్ 2.6 శాతం,ఎన్‌టీపీసీ 2.4 శాతం, టీసీఎస్ 2.4 శాతం చొప్పున పెరిగాయి.  

మొత్తం మీద 1,579 షేర్లు లాభాల్లో, 960 షేర్లు నష్టాల్లో ముగిశాయి. మంగళవారం అమెరికా స్టాక్ సూచీలు లాభాల్లో ముగిసిన ప్రభావంతోఆసియా మార్కెట్లు (చైనా మినహా)కూడా లాభపడ్డాయి. హాంగ్‌కాంగ్ 2.7 శాతం, జపాన్ 1.5 శాతం, దక్షిణ కొరియా 1.1 శాతం, తైవాన్ 1.1 శాతం, సింగపూర్ 0.6 శాతం చొప్పున పెరిగాయి.
* నికర లాభం 29 శాతం పెరగడంతో బజాజ్ ఆటో షేర్ బీఎస్‌ఈలో 5% లాభపడి రూ.2,505 వద్ద ముగిసింది.
* కర్ణాటకలోని రాయ్‌చూర్‌లో తొలి 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ యూనిట్‌ను ప్రారంభించడంతో భెల్ షేర్ 4 శాతం పెరిగి రూ. 123కు చేరింది.
* ఏషియన్ పెయింట్స్, హావెల్స్ ఇండియా, గోద్రేజ్ కన్సూమర్ ప్రొడక్ట్స్ వంటి 11 షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలను (ఇంట్రాడేలో) తాకాయి.
* వీఆర్‌ఎల్ లాజిస్టిక్స్ షేర్ పతనం కొనసాగుతోంది. విమానయాన వెంచర్‌లోకి ప్రవేశిస్తామని ఈ కంపెనీ  ప్రకటించడంతో అది సంస్థ బ్యాలెన్స్ షీట్‌పై ప్రభావం చూపుతుందన్న అంచనాలే దీనికి కారణం. బుధవారం బీఎస్‌ఈలో 13% పడి రూ.275 వద్ద ముగిసింది. మంగళవారం 20% దిగజారిన సంగతి తెలిసిందే.
 
సెన్సెక్స్ పరుగు ఎందుకంటే..

సంస్కరణలపై ఆశలు:  2025 కల్లా 2 కోట్లకు పైగా ఉద్యోగాలు కల్పించగలిగే క్యాపిటల్ గూడ్స్ పాలసీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో సంస్కరణల జోరు పెరుగుతుందని ఇన్వెస్టర్లలో ధీమా పెరిగింది.
 
వర్షపాత తాజా అంచనాలు: నైరుతి రుతు పవనాలు సకాలంలోనే వస్తాయని.. సాధారణం కంటే అధిక వర్షపాతనం ఉంటుందని ప్రైవేట్ రంగ వాతావరణ సంస్థ స్కైమెట్ చెప్పడంతో స్టాక్ సూచీలు దూసుకుపోయాయి.
 
మోర్గాన్ స్టాన్లీ రేటింగ్ పెంపు: వర్ధమాన దేశాల్లో  భారత్ ఆకర్షణీయంగా ఉందని, కంపెనీల ఆర్థిక ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయంటూ  భారత రేటింగ్‌ను ఓవర్ వెయిట్ నుంచి ఈక్వల్ వెయిట్‌కు పెంచుతున్నామని మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది.
 
చమురు ధరల పెరుగుదల: అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు బ్యారెల్‌కు 50 డాలర్లకు చేరువ కావడంతో సెంటిమెంట్ బలపడింది.
 
వేల్యూ బయింగ్: ఇటీవల పతనం కారణంగా పలు బ్లూ చిప్ షేర్లు ఆకర్షణీయంగా ఉన్నాయని, అందుకని ఈ షేర్లలో కొనుగోళ్లు జోరుగా జరగడంతో స్టాక్ మార్కెట్ భారీగా లాభపడిందని నిపుణులంటున్నారు.
 
షార్ట్ కవరింగ్: నేడు మే నెల సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్న నేపథ్యంలో షార్ట్ కవరింగ్ జరగడం కలసి వచ్చిందని మార్కెట్ విశ్లేషకుల మాట.
 
ప్రోత్సాహకరంగా ఫలితాలు:  ఎల్ అండ్ టీ, బజాజ్ ఆటో వంటి కంపెనీల ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడం కూడా కలసి వచ్చింది.
 
సానుకూల అంతర్జాతీయ సంకేతాలు:
అమెరికాలో ఏప్రిల్ నెలలో కొత్త ఇళ్ల అమ్మకాలు జోరుగా ఉన్నాయన్న గణాంకాలతో అమెరికా ఆర్థిక వ్యవస్థ రికవరీ బాటలోనే ఉందన్న అంచనాలతో మంగళవారం అమెరికా మార్కె ట్లు జోరుగా పెరిగాయి. దీంతో బుధవారం ఆసియా మార్కెట్లు లాభపడ్డాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుండటంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడీరేట్లను జూన్‌లోనే పెంచుతుందన్న అంచనాలు బలపడ్డాయి. జూన్‌లో ఫెడ్ రేట్ల పెంపు ఉందని మార్కెట్లు ఇప్పటికే డిస్కౌంట్ చేసుకున్నాయని నిపుణులంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement