International codes
-
మార్కెట్లో లాభాల వర్షం!
స్కైమెట్ అంచనాలతో స్టాక్ సూచీలకు భారీ లాభాలు ♦ ప్రొత్సాహకరంగా కంపెనీల ఫలితాలు ♦ ఆర్థిక సంస్కరణలపై ఆశలు ♦ సానుకూలంగా అంతర్జాతీయ సంకేతాలు ♦ డెరివేటివ్స్ ముగింపు కారణంగా షార్ట్ కవరింగ్ ♦ 576 పాయింట్ల లాభంతో 25,881కు సెన్సెక్స్ ♦ 186 పాయింట్ల లాభంతో 7,935కు చేరిన నిఫ్టీ స్టాక్ మార్కెట్లో బుధవారం లాభాల వర్షం కురిసింది. ప్రభుత్వం సంస్కరణలను వేగవంతం చేయనున్నదన్న అంచనాలకు సానుకూల అంతర్జాతీయ సంకేతాలు తోడవడంతో స్టాక్ సూచీలు దూసుకుపోయాయి. సెన్సెక్స్, నిఫ్టీలు 2 శాతానికి పైగా పెరిగాయి. కంపెనీల ఆర్థిక ఫలితాలు ప్రోత్సాహాకరంగా ఉండడం, వర్షాలు విస్తారంగా కురుస్తాయన్న స్కైమెట్ తాజా అంచనాలు, నేడు (గురువారం) డెరివేటివ్ కాంట్రాక్టులు ముగియనున్న నేపథ్యంలో ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు కవర్ చేసుకోవడం సానుకూల ప్రభావం చూపాయి. సెన్సెక్స్ 576 పాయింట్లు లాభపడి 25,881 పాయింట్ల వద్ద, నిఫ్టీ 186 పాయింట్లు లాభపడి 7,935 పాయింట్ల పైన ముగిశాయి. ఆర్థిక, బ్యాంక్ షేర్లు బాగా పెరిగాయి. క్యాపిటల్ గూడ్స్, టెక్నాలజీ, విద్యుత్, ఇంధన, రియల్టీ, వాహన షేర్లు లాభపడ్డాయి. అన్ని రంగాల సూచీలు లాభాల్లో ముగిశాయి. రోజంతా లాభాలే... బీఎస్ఈ సెన్సెక్స్ 25,432 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఆ తర్వాత ఈ లాభాల పరుగు ఎలాంటి అడ్డంకులు లేకుండా జోరుగా కొనసాగింది. ఇంట్రాడేలో 25,898 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 576 పాయింట్ల (2.28 శాతం)లాభంతో 25,881 పాయింట్ల వద్ద ముగిసింది. మార్చి 1 తర్వాత సెన్సెక్స్ ఈ స్థాయి లాభాలను కళ్ల జూడటం ఇదే మొదటిసారి. ఇంట్రాడేలో 7,841 పాయింట్లను తాకిన నిఫ్టీ చివరకు 186 పాయింట్లు(2.4%) లాభపడి 7,935 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో ఒక్క షేరుకే నష్టాలు.. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 29 షేర్లు లాభాల్లోనే ముగిశాయి. ఒక్క షేర్ మాత్రమే నష్టపోయింది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడంతో సిప్లా షేర్ 5 శాతం క్షీణించి రూ. 470 వద్ద ముగిసింది. ఇక లాభపడిన షేర్ల విషయానికొస్తే, ఐసీఐసీఐ బ్యాంక్ 4.4 శాతం, భెల్ 4.3 శాతం, ఎల్ అండ్ టీ 4 శాతం, బజాజ్ ఆటో 3.9 శాతం, మారుతీ సుజుకి 3.4 శాతం, ఎస్బీఐ 3.3 శాతం, హెచ్డీఎఫ్సీ 2.8 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.8 శాతం, గెయిల్ 2.7 శాతం, ఏషియన్ పెయింట్స్ 2.7 శాతం, యాక్సిస్ బ్యాంక్ 2.6 శాతం,ఎన్టీపీసీ 2.4 శాతం, టీసీఎస్ 2.4 శాతం చొప్పున పెరిగాయి. మొత్తం మీద 1,579 షేర్లు లాభాల్లో, 960 షేర్లు నష్టాల్లో ముగిశాయి. మంగళవారం అమెరికా స్టాక్ సూచీలు లాభాల్లో ముగిసిన ప్రభావంతోఆసియా మార్కెట్లు (చైనా మినహా)కూడా లాభపడ్డాయి. హాంగ్‌కాంగ్ 2.7 శాతం, జపాన్ 1.5 శాతం, దక్షిణ కొరియా 1.1 శాతం, తైవాన్ 1.1 శాతం, సింగపూర్ 0.6 శాతం చొప్పున పెరిగాయి. * నికర లాభం 29 శాతం పెరగడంతో బజాజ్ ఆటో షేర్ బీఎస్ఈలో 5% లాభపడి రూ.2,505 వద్ద ముగిసింది. * కర్ణాటకలోని రాయ్‌చూర్‌లో తొలి 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ యూనిట్‌ను ప్రారంభించడంతో భెల్ షేర్ 4 శాతం పెరిగి రూ. 123కు చేరింది. * ఏషియన్ పెయింట్స్, హావెల్స్ ఇండియా, గోద్రేజ్ కన్సూమర్ ప్రొడక్ట్స్ వంటి 11 షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలను (ఇంట్రాడేలో) తాకాయి. * వీఆర్ఎల్ లాజిస్టిక్స్ షేర్ పతనం కొనసాగుతోంది. విమానయాన వెంచర్లోకి ప్రవేశిస్తామని ఈ కంపెనీ ప్రకటించడంతో అది సంస్థ బ్యాలెన్స్ షీట్‌పై ప్రభావం చూపుతుందన్న అంచనాలే దీనికి కారణం. బుధవారం బీఎస్ఈలో 13% పడి రూ.275 వద్ద ముగిసింది. మంగళవారం 20% దిగజారిన సంగతి తెలిసిందే. సెన్సెక్స్ పరుగు ఎందుకంటే.. సంస్కరణలపై ఆశలు: 2025 కల్లా 2 కోట్లకు పైగా ఉద్యోగాలు కల్పించగలిగే క్యాపిటల్ గూడ్స్ పాలసీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో సంస్కరణల జోరు పెరుగుతుందని ఇన్వెస్టర్లలో ధీమా పెరిగింది. వర్షపాత తాజా అంచనాలు: నైరుతి రుతు పవనాలు సకాలంలోనే వస్తాయని.. సాధారణం కంటే అధిక వర్షపాతనం ఉంటుందని ప్రైవేట్ రంగ వాతావరణ సంస్థ స్కైమెట్ చెప్పడంతో స్టాక్ సూచీలు దూసుకుపోయాయి. మోర్గాన్ స్టాన్లీ రేటింగ్ పెంపు: వర్ధమాన దేశాల్లో భారత్ ఆకర్షణీయంగా ఉందని, కంపెనీల ఆర్థిక ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయంటూ భారత రేటింగ్‌ను ఓవర్ వెయిట్ నుంచి ఈక్వల్ వెయిట్‌కు పెంచుతున్నామని మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. చమురు ధరల పెరుగుదల: అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు బ్యారెల్‌కు 50 డాలర్లకు చేరువ కావడంతో సెంటిమెంట్ బలపడింది. వేల్యూ బయింగ్: ఇటీవల పతనం కారణంగా పలు బ్లూ చిప్ షేర్లు ఆకర్షణీయంగా ఉన్నాయని, అందుకని ఈ షేర్లలో కొనుగోళ్లు జోరుగా జరగడంతో స్టాక్ మార్కెట్ భారీగా లాభపడిందని నిపుణులంటున్నారు. షార్ట్ కవరింగ్: నేడు మే నెల సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్న నేపథ్యంలో షార్ట్ కవరింగ్ జరగడం కలసి వచ్చిందని మార్కెట్ విశ్లేషకుల మాట. ప్రోత్సాహకరంగా ఫలితాలు: ఎల్ అండ్ టీ, బజాజ్ ఆటో వంటి కంపెనీల ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడం కూడా కలసి వచ్చింది. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు: అమెరికాలో ఏప్రిల్ నెలలో కొత్త ఇళ్ల అమ్మకాలు జోరుగా ఉన్నాయన్న గణాంకాలతో అమెరికా ఆర్థిక వ్యవస్థ రికవరీ బాటలోనే ఉందన్న అంచనాలతో మంగళవారం అమెరికా మార్కె ట్లు జోరుగా పెరిగాయి. దీంతో బుధవారం ఆసియా మార్కెట్లు లాభపడ్డాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుండటంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడీరేట్లను జూన్‌లోనే పెంచుతుందన్న అంచనాలు బలపడ్డాయి. జూన్‌లో ఫెడ్ రేట్ల పెంపు ఉందని మార్కెట్లు ఇప్పటికే డిస్కౌంట్ చేసుకున్నాయని నిపుణులంటున్నారు. -
కొనసాగుతున్న నష్టాలు..
ఆరో రోజూ క్షీణ పథంలో స్టాక్ మార్కెట్ అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉండడం, కంపెనీల ఆర్థిక ఫలితాలు అంతంత మాత్రంగా ఉండటంతో వరుసగా ఆరో ట్రేడింగ్ సెషన్లోనూ స్టాక్‌మార్కెట్ నష్టాల్లో ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 98 పాయింట్లు నష్టపోయి 26,559 పాయింట్ల వద్ద, నిఫ్టీ 15 పాయింట్ల నష్టంతో 8,051 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో నిఫ్టీ 8,000 పాయింట్ల దిగువకు జారిపోయింది. జూన్ తర్వాత స్టాక్ మార్కెట్ వరుసగా ఇన్ని రోజులు నష్టాలపాలవడం ఇదే మొదటిసారి. గత ఆరు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ మొత్తం 912 పాయింట్లు నష్టపోయింది. దిగ్గజ వాహన కంపెనీల అక్టోబర్ అమ్మకాలు బాగా ఉన్నప్పటికీ, సెంటిమెంట్‌కు ఊపునివ్వడంలో విఫలమయ్యాయి. మరోవైపు అక్టోబర్‌లో భారత తయారీ రంగ వృద్ధి రెండేళ్ల కనిష్టానికి పతనమైందని ఒక ప్రైవేట్ సర్వే వెల్లడించడం, చైనా ఫ్యాక్టరీ, సేవల గణాంకాలు అంతంతమాత్రంగానే ఉండడం.. ఈ అంశాలన్నీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పట్ల ఇన్వెస్టర్లలో ఆందోళనను మరింత పెంచాయి. ఈ అంశాలతో పాటు డాలర్‌తో రూపాయి మారకం తగ్గడం, బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ ఎదురుదెబ్బ తగిలే అవకాశాలున్నాయన్న ఊహాగానాలు..ప్రతికూల ప్రభావం చూపించాయి. ఐటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లలో కొనుగోళ్లు, ఇన్ఫోసిస్ రికవరీ కారణంగా చివరి గంట ట్రేడింగ్‌లో స్టాక్ సూచీలు కోలుకున్నాయి. అక్టోబర్‌లో అమ్మకాలు 9 శాతం తగ్గడంతో బజాజ్ ఆటో షేర్ 5 శాతం క్షీణించి రూ.2,432 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో అధికంగా నష్టపోయిన షేర్ ఇదే. -
సెన్సెక్స్‌కు స్వల్ప నష్టాలు..
కొనసాగుతున్న రేట్ల కోత ఆశలు - మైనస్ 246 నుంచి మైనస్ 26కు తగ్గిన సెన్సెక్స్ నష్టం - 26,193 పాయింట్ల వద్ద ముగింపు - 5 పాయింట్ల నష్టంతో 7,977కు నిఫ్టీ అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉన్నప్పటికీ, విద్యుత్తు, బ్యాంక్, కన్సూమర్ గూడ్స్ షేర్ల లాభపడ్డ కారణంగా సోమవారం స్టాక్ మార్కెట్ స్వల్పంగా నష్టపోయింది. రేట్ల కోత అంచనాలతో విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు జరపడంతో ప్రారంభ నష్టాల నుంచి స్టాక్ మార్కెట్ సూచీలు కోలుకున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 26 పాయింట్లు నష్టపోయి 26,193 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 5 పాయింట్ల నష్టంతో 7,977 పాయింట్ల వద్ద ముగిశాయి. గత శుక్రవారం అమెరికా స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసిన ప్రభావంతో ఆసియా మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఈ ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్ కూడా నష్టాల్లోనే మొదలైంది. ఇటీవల పెరిగిన షేర్లలో లాభాల స్వీకరణ కారణంగా మరింతగా నష్టపోయింది. ఒక దశలో 246 పాయింట్ల వరకూ నష్టపోయింది. మధ్యాహ్నం తర్వాత కొనుగోళ్ల జోరుతో స్వల్పంగా లాభపడింది. కానీ చివరకు 26 పాయింట్ల నష్టంతో 26,193 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ మొత్తం 260 పాయింట్ల రేంజ్లో కదలాడింది. రూపాయి బలపడడం,రేట్ల కోత ఆశలు సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చాయని హెమ్ సెక్యూరిటీస్ డెరైక్టర్ గౌరవ్ జైన్ చెప్పారు. 30 సెన్సెక్స్ షేర్లలో 17 షేర్లు నష్టాల్లో ముగిశాయి. 1,604 షేర్లు లాభాల్లో, 1,032 షేర్లు నష్టాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.2,358 కోట్లుగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.14,732 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.2,90,242 కోట్లుగా నమోదైంది. -
ఫెడ్ రేట్ల పెంపు భయాలు..
- కరువు, రూపాయి పతనం ప్రభావం - నష్టాల్లో సెన్సెక్స్-30, నిఫ్టీ-50 ముంబై: అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉండడం, ప్రత్యేకించి అమెరికా ఫెడ్ వడ్డీరేట్లు పెంచుతుందన్న భయాలు జీడీపీ గణాంకాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్ సోమవారం ఆద్యంతమూ తీవ్రమైన ఒడిదుడుకులకు గురై నష్టాల్లో ముగిసింది. వీటికి వర్షాభావ కష్టాలు, రూపాయి పతనం, లాభాల స్వీకరణ కూడా తోడవడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 109 పాయింట్లు నష్టపోయి 26,283 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 31 పాయింట్లు నష్టపోయి 7,971 పాయింట్ల వద్ద ముగిశాయి. విద్యుత్, రియల్టీ, ఇన్ఫ్రా, క్యాపిటల్ గూడ్స్, వాహన షేర్లు నష్టపోయాయి. ఫార్మా షేర్లు లాభపడ్డాయి. అధ్వాన ఆగస్టు: నెలవారీగా చూస్తే ఆగస్టు నెలలో బీఎస్ఈ సెన్సెక్స్ 1,831 పాయింట్లు(6.51 శాతం), ఎన్ఎస్ఈ నిఫ్టీ 562 పాయింట్లు(6.58 శాతం) చొప్పున పతనమయ్యాయి. 2011 నవంబర్ తర్వాత ఒక నెలలో ఈ స్థాయిలో సెన్సెక్స్ నష్టపోవడం ఇదే మొదటిసారి. ఇక విదేశీ ఇన్వెస్టర్ల నికర అమ్మకాల విషయంలో కూడా గత నెల రికార్డ్ సృష్టించింది. గత నెలలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.17,000 కోట్ల నికర అమ్మకాలు జరిపారు. ఒక నెలలో విదేశీ ఇన్వెస్టర్లు ఈ స్థాయిలో నికర అమ్మకాలు జరపడం ఇది రికార్డ్ స్థాయి. మ్యాట్రిక్స్ ఐపీఓకు సెబీ ఓకే న్యూఢిల్లీ: అంతర్జాతీయ సిమ్ కార్డ్నందించే మ్యాట్రిక్స్ సెల్యులర్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత్ నుంచి విదేశాలకు వెళ్లే పర్యాటకులకు మ్యాట్రిక్స్ సెల్యులర్ కంపెనీ వివిధ దేశాల సిమ్‌కార్డ్‌లను , వాయిస్, డేటా, ఎస్ఎంఎస్ సర్వీసులను మ్యాట్రిక్స్ బ్రాండ్ కింద అందజేస్తోంది. కాగా ఈ ఏడాది ఇప్పటిరవకూ సెబీ 26 కంపెనీల ఐపీఓలకు అనుమతులిచ్చింది.వీటిల్లో 13 కంపెనీలు ఐపీఓకు వచ్చాయి. -
బ్యాంక్ షేర్ల జోరు 28 వేల పాయింట్లపైకి సెన్సెక్స్
- 240 పాయింట్ల లాభంతో 28,021 పాయింట్లకు ప్రధాన సూచీ - 85 పాయింట్ల లాభంతో 8,453కు నిఫ్టీ... ప్రభుత్వ రంగ బ్యాంకులకు పెట్టుబడులందిస్తామన్న ప్రభుత్వ ప్రకటనకు సానుకూల అంతర్జాతీయ సంకేతాలు తోడవడంతో బుధవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. ఎనిమిది కీలక పరిశ్రమల గణాంకాలు ప్రోత్సాహాకరంగా ఉండడం సెంటిమెంట్‌కు మరింత జోష్‌నిచ్చింది. బీఎస్ఈ సెన్సెక్స్ 28,000 మార్క్‌ను. నిఫ్టీ 8,400 మార్క్‌ను దాటాయి. సెన్సెక్స్ 240 పాయింట్లు లాభపడి 28,021 పాయింట్ల వద్ద, నిఫ్టీ 85 పాయింట్లు లాభపడి 8,453 పాయింట్ల వద్ద ముగిశాయి. సూచీ లు రెండున్నర నెలల గరిష్టానికి చేరాయి. క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్, రియల్టీ, ఐటీ, టెక్నాలజీ షేర్లలో కొనుగోళ్ల జోరు కనిపించింది. ఒక్కటి మినహా అన్ని సూచీలు లాభాల్లోనే... గ్రీస్ ప్రధాని బెయిలవుట్ ప్యాకేజీకి అంగీకరించనున్నారన్న వార్తలు అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లను లాభాల్లో ముంచెత్తాయి. ఇది మన మార్కెట్లపై సానుకూలత చూపించింది. అంతర్జాతీయ మార్కెట్లు ఒడిదుడుకుల వల్ల భారత మార్కెట్లోకి నిధులు తరలివస్తాయని, ఈ విశ్వాసం తోనే పలు కంపెనీలు ఐపీఓల కోసం దరఖాస్తులు సమర్పిస్తున్నాయనే అంచనాలూ మార్కెట్ లాభాలకు తోడ్పడ్డాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 27,800- 28,099 పాయింట్ల కనిష్ట, గరిష్ట స్థాయిల మధ్య కదలాడింది. మార్కెట్ క్యాప్... ఓఎన్జీసీ స్థానంలోకి కోల్ ఇండియా... షేర్ ధర పరుగు కారణంగా... అత్యధిక మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న ప్రభుత్వ రంగ కంపెనీగా కోల్ ఇండియా నిలిచింది. ఇప్పటి వరకూ ఈ స్థానంలో ఉన్న ఓఎన్జీసీ రెండో స్థానానికి పడిపోయింది. గురువారం నాటికి కోల్ ఇండియా మార్కెట్ క్యాప్ రూ.2,68,509 కోట్లుగా, ఓఎన్జీసీ మార్కెట్ క్యాప్ 2,68,386 కోట్లుగా ఉన్నాయి. 30కి 23 సెన్సెక్స్ షేర్లు లాభాల్లోనే..: 30 సెన్సెక్స్ షేర్లలో 23 షేర్లు లాభాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.3,226 కోట్లుగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.15,886 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.1,75,052 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.75 కోట్లు, దేశీ ఇన్వెస్టర్లు రూ.52 కోట్ల విలువైన నికర కొనుగోళ్లు జరిపారు. -
మూడు రోజుల నష్టాలకు బ్రేక్
* కలసివచ్చిన అంతర్జాతీయ సంకేతాలు * బ్లూచిప్‌ల ల్లో పెరిగిన కొనుగోళ్లు * 366 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ * నిఫ్టీ లాభం 133 పాయింట్లు మార్కెట్ అప్డేట్ ముంబై: స్టాక్ మార్కెట్లు మూడు వారాల కనిష్టం నుంచి గురువారం కోలుకున్నాయి. గత మూడు రోజుల్లో దాదాపు 1,000 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 366 పాయింట్లు లాభపడింది. సానుకూలమైన అంతర్జాతీయ సంకేతాల ఫలితంగా బీఎస్ఈ సెన్సెక్స్ 366 పాయింట్ల లాభంతో 27,275 పాయింట్ల వద్ద, నిఫ్టీ 133 పాయింట్ల లాభంతో 8,235 పాయింట్ల వద్ద ముగిశాయి. అమెరికాలో ప్రైవేట్ రంగ ఉద్యోగ గణాంకాలు ప్రోత్సాహాకరంగా ఉండడం, ద్రవ్యోల్బణం ప్రతికూలంగా నమోదు కావడంతో యూరోజోన్ తాజా ప్యాకేజీ ప్రకటిస్తుందన్న అంచనాలు, ముడి చమురు ధరలు స్వల్పంగా పెరగడం...ఇవన్నీ అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి అవకాశాలపై ఇన్వెస్టర్ల ఆందోళనలను తగ్గించాయి. ఏప్రిల్‌కు ముందు వడ్డీరేట్లు పెంచే అవకాశాల్లేవని అమెరికా ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్ సమావేశ మినట్స్ ద్వారా వెల్లడి కావడంతో ఆసియా మార్కెట్లు కూడా లాభాల బాట పట్టాయి. రియల్టీ, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, విద్యుత్తు, వాహన, లోహ, ఆరోగ్య సంరక్షణ, క్యాపిటల్ గూడ్స్ షేర్లు పెరిగాయి. బ్లూ చిప్ షేర్లలో భారీ కొనుగోళ్లు జరిగాయి. రిటైల్ ఇన్వెస్టర్ల డిమాండ్ కారణంగా స్మాల్, మిడ్ క్యాప్ షేర్లు కూడా జోరందుకున్నాయి. కొనుగోళ్లు జోరుగా ఉండడంతో ఒక దశలో సెన్సెక్స్ 407 పాయింట్లు పెరిగింది. రిలయన్స్ మినహా సెన్సెక్స్‌లోని మిగిలిన 29 షేర్లు లాభాల్లోనే ముగిశాయి. సమ్మె ఆగిపోవడంతో కోల్ ఇండియా 1.2 శాతం పెరగ్గా, జాగ్వార్ ల్యాండ్ రోవర్ అమ్మకాలు డిసెంబర్లో 25 శాతం పెరగడంతో టాటా మోటార్స్ 3.6 శాతం వృద్ది చెందింది. శుక్రవారం ఫలితాలు ప్రకటించనున్న ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ 0.5 శాతం పెరిగింది. ఇటీవల కుదేలైన రియల్టీ రంగ షేర్లు పెరిగాయి. ముడి చమురు ధరలు బాగా తగ్గుతుండటంతో వాటిని ముడి పదార్ధాలుగా వినియోగించుకునే ఐదు పెయింట్ కంపెనీల షేర్లు ఏషియన్, బెర్జర్, కన్సాయ్ నెరోలాక్, షాలిమార్ పెయింట్స్, ఆక్జో నోబెల్ ఇండియా షేర్లు పెరిగాయి. 50 షేర్ల నిఫ్టీలో 48 షేర్లు లాభాల్లో ఉన్నాయంటే, అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు జరిగినట్లేనని విశ్లేషకులంటున్నారు. టాటా మోటార్స్ 3.6 శాతం, ఐటీసీ 2.5 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 2.5 శాతం, హిందాల్కో 2.4 శాతం, గెయిల్ ఇండియా 2.2 శాతం, హెచ్డీఎఫ్సీ 2.1 శాతం,హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2 శాతం, టాటా పవర్ 1.9 శాతం, భారతీ ఎయిర్టెల్ 1.6 శాతం, హిందూస్తాన్ యూనిలివర్ 1.6 శాతం పెరిగాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.4 శాతం తగ్గింది. టర్నోవర్ రూ.3,231 కోట్లుగా నమోదైంది. ఎన్ఎస్ఈలో మొత్తం టర్నోవర్ నగదు రూ.17,626 కోట్లు, డెరివేటివ్స్‌లో 71,10,726 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.467 కోట్ల నికర విక్రయాలు జరపగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.288 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు.