కొనసాగుతున్న నష్టాలు..
ఆరో రోజూ క్షీణ పథంలో స్టాక్ మార్కెట్
అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉండడం, కంపెనీల ఆర్థిక ఫలితాలు అంతంత మాత్రంగా ఉండటంతో వరుసగా ఆరో ట్రేడింగ్ సెషన్‌లోనూ స్టాక్‌మార్కెట్ నష్టాల్లో ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 98 పాయింట్లు నష్టపోయి 26,559 పాయింట్ల వద్ద, నిఫ్టీ 15 పాయింట్ల నష్టంతో 8,051 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో నిఫ్టీ 8,000 పాయింట్ల దిగువకు జారిపోయింది.
జూన్ తర్వాత స్టాక్ మార్కెట్ వరుసగా ఇన్ని రోజులు నష్టాలపాలవడం ఇదే మొదటిసారి. గత ఆరు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ మొత్తం 912 పాయింట్లు నష్టపోయింది. దిగ్గజ వాహన కంపెనీల అక్టోబర్ అమ్మకాలు బాగా ఉన్నప్పటికీ, సెంటిమెంట్‌కు ఊపునివ్వడంలో విఫలమయ్యాయి.
మరోవైపు అక్టోబర్‌లో భారత తయారీ రంగ వృద్ధి రెండేళ్ల కనిష్టానికి పతనమైందని ఒక ప్రైవేట్ సర్వే వెల్లడించడం, చైనా ఫ్యాక్టరీ, సేవల గణాంకాలు అంతంతమాత్రంగానే ఉండడం.. ఈ అంశాలన్నీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పట్ల ఇన్వెస్టర్లలో ఆందోళనను మరింత పెంచాయి.
ఈ అంశాలతో పాటు డాలర్‌తో రూపాయి మారకం తగ్గడం, బిహార్ ఎన్నికల్లో ఎన్‌డీఏ ఎదురుదెబ్బ తగిలే అవకాశాలున్నాయన్న ఊహాగానాలు..ప్రతికూల ప్రభావం చూపించాయి. ఐటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లలో కొనుగోళ్లు, ఇన్ఫోసిస్ రికవరీ కారణంగా చివరి గంట ట్రేడింగ్‌లో స్టాక్ సూచీలు కోలుకున్నాయి. అక్టోబర్‌లో అమ్మకాలు 9 శాతం తగ్గడంతో బజాజ్ ఆటో షేర్ 5 శాతం క్షీణించి రూ.2,432 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో అధికంగా నష్టపోయిన షేర్ ఇదే.