పడగొట్టిన ఫలితాలు
* సెన్సెక్స్ 109 పాయింట్లు పతనం
* 27,362 పాయింట్ల వద్ద ముగింపు
ముంబై: బ్లూ చిప్ కంపెనీల ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడంతో సోమవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. చైనా కేంద్ర బ్యాంక్ వడ్డీరేట్ల కోత కారణంగా ఆసియా మార్కెట్లు లాభపడినా, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీల ఆర్థిక ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండటంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ రెండు నెలల గరిష్ట స్థాయి నుంచి పతనమైంది.
మంగళవారం నుంచి అమెరికా ఫెడరల్ రిజర్వ్ రెండు రోజుల పాటు సమావేశం కానుండడం, అక్టోబర్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ఈ వారంలోనే ముగియనుండడం వంటి కారణాల వల్ల బీఎస్‌ఈ సెన్సెక్స్ 108 పాయింట్ల నష్టంతో 27,362 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 35 పాయింట్లు క్షీణించి 8,261పాయింట్ల వద్ద ముగిశాయి. ప్రభుత్వ రంగ, ఆయిల్, గ్యాస్, కన్సూమర్ డ్యూరబుల్స్, బ్యాంకింగ్ షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. అయితే వాహన, లోహ షేర్లలో కొనుగోళ్ల కారణంగా నష్టాలు పరిమితయ్యాయి.