Blue chip company
-
వేతనంలో భారీ అంతరం
న్యూఢిల్లీ: బ్లూచిప్ కంపెనీల్లో పనిచేసే సగటు ఉద్యోగికి, ఆ సంస్థ నిర్వహణ బాధ్యతలు చూసే సీఈవోలకు మధ్య వేతనంలో నక్కకీ, నాగలోకానికీ ఉన్నంత తేడా ఉంటోందని ఓ అధ్యయనంలో తేలింది. సెబీ ఆదేశాల మేరకు లిస్టెడ్ కంపెనీలు వేతన వివరాలను స్టాక్ మార్కెట్లకు వెల్లడించగా, బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలోని కంపెనీల్లో 2016–17 సంవత్సరపు వేతన వివరాలను పరిశీలిస్తే ఈ వివరాలు వెల్లడయ్యాయి. అధిక శాతం ప్రైవేటు బ్లూచిప్ కంపెనీల్లో సీఈవో, ఎగ్జిక్యూటివ్ చైర్మన్లు సగటు ఉద్యోగులతో పోలిస్తే 1,200 రెట్ల వరకూ అధికంగా వేతనాలు అందుకుంటున్నారు. అంతే కాకుండా గత ఆర్థిక సంవత్సరంలో వేతనంలో పెరుగుదల సైతం అధికంగానే ఉంది. అదే సమయంలో సగటు ఉద్యోగి వేతనం తగ్గడం లేదా అదే స్థాయిలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వరంగ కంపెనీల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. సగటు లేదా మధ్య స్థాయి ఉద్యోగి వేతనంతో పోలిస్తే సీఈవోల వేతనం మూడు, నాలుగు రెట్లు అధికంగానే ఉంది. సగటు ఉద్యోగుల కంటే టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు ఎంత అధికంగా చెల్లించాలన్న విషయంలో నియంత్రణలు లేవు. బోర్డు, వాటాదారుల ఆమోదం ఉంటే చాలు. కాకపోతే ఎండీ లేదా హోల్‌టైమ్ డైరెక్టర్‌కు నికర లాభంలో వేతనం 5 శాతాన్ని మించరాదు. తగినంత లాభాలు లేని కంపెనీల్లో టాప్ బాస్‌లకు అధిక వేతనాలు చెల్లించాలంటే ప్రభుత్వ ఆమోదం పొందాల్సి ఉంటుంది. విప్రోలో 259 రెట్లు, ఇన్ఫోసిస్‌లో 283 రెట్లు, డాక్టర్ రెడ్డీస్‌లో 233 రెట్లు, హీరో మోటో కార్ప్‌లో 731 రెట్ల అంతరం ఉంది. -
క్యూ4 ఫలితాలతో ట్రెండ్..
* ఈ వారం మార్కెట్‌పై అంచనాలు * చమురు, రూపాయి కదలికలూ కీలకమే * ఏప్రిల్ పీఎంఐ గణాంకాలు ఈ వారమే న్యూఢిల్లీ: హెచ్డీఎఫ్సీ, టూ వీలర్ దిగ్గజం హీరో మోటొకార్ప్తో పాటు ఇతర బ్లూ చిప్ కంపెనీల ఆర్థిక పలితాలు, ఈ వారం స్టాక్ మార్కెట్ గమనంపై ప్రధానంగా ప్రభావం చూపుతాయని నిపుణులంటున్నారు. దీంతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడి పోకడలు కూడా కీలకమని వారంటున్నారు. వీటితో పాటు అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్ల తీరు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం, రూపాయి కదలికలు ఇవన్నీ స్టాక్ మార్కెట్ తీరుపై ప్రభావం చూపుతాయని క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్ సీఈఓ రోహిత్ గాడియా చెప్పారు. ఏప్రిల్ నెల అమ్మకాల గణాంకాలను వాహన కంపెనీలు వెల్లడించనున్నందున వాహన షేర్లపై కూడా ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తారు. ఈ వారంలో వెల్లడయ్యే సేవలు, తయారీ రంగానికి సంబంధించి పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) గణాంకాలు కూడా తగిన ప్రభావం చూపుతాయి. మార్కిట్ ఎకనామిక్స్ సంస్థ ఏప్రిల్ నెలకు సంబంధించి భారత తయారీ రంగ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ గణాంకాలను సోమవారం(మే 2న)న వెల్లడిస్తుంది. ఇక నికాయ్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ గణాంకాలు బుధవారం( మే 4న) వెల్లడవుతాయి. పెరుగుదల అవకాశాలు స్వల్పమే... మార్కెట్ కరెక్షన్ దిశలో ఉందని సామ్కో సీఈఓ జిమీత్ మోడి చెప్పారు. కంపెనీల ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగా లేవని, ఈ విషయం ఇప్పటికే డిస్కౌంట్ అయిందని, అందుకని మార్కెట్ పెరుగుదలకు స్వల్పంగా మాత్రమే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. అందరి కళ్లు రాజకీయ పరిస్థితులపైననే, ముఖ్యంగా పార్లమెంట్ సమావేశాల ఫలితాలపైనే ఉంటాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. ఇటీవల వచ్చిన ర్యాలీ అనంతరం మార్కెట్ కన్సాలిడేషన్ దశలో ఉందని వివరించారు. రానున్న కంపెనీల ఆర్థిక ఫలితాలను బట్టి మార్కెట్ గమనం ఆధారపడి ఉంటుందని వివరించారు. విదేశీ పెట్టుబడుల జోరు... భారత మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. వర్షాలు బాగా కురుస్తాయనే అంచనాలు, ప్రోత్సాహకరంగా ఉన్న ఆర్థిక గణాంకాలు, ఆర్బీఐ రేట్ల కోత కారణంగా ఏప్రిల్ నెలలో ఈక్విటీ, డెట్ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్లు 220కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం, ఎఫ్‌పీఐలు ఏప్రిల్‌లో ఈక్విటీ మార్కెట్లో రూ.8,416 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.6,418 కోట్లు... మొత్తం రూ.14,834 కోట్లు పెట్టుబడులు పెట్టారు. విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టడం ఇది వరుసగా రెండో నెల. మార్చిలో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు రూ.19,967 కోట్లుగా ఉన్నాయి. అంతకు ముందటి నాలుగు నెలల్లో (గత ఏడాది నవంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ) విదేశీ ఇన్వెస్టర్లు రూ.41,661 కోట్లు నికర పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. ఇక ఈ ఏడాది ఇప్పటివరకూ విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) రూ.12,911 కోట్లు ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయగా, రూ.939 కోట్లు డెట్ మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నారు. నికరంగా భారత్‌లో రూ. 11,971 కోట్లకు పెట్టుబడులు పెట్టారు. -
ఫలితాలు, విదేశీ అంశాలే కీలకం
ఇవే మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయ్ ఈ వారం మార్కెట్‌పై విశ్లేషకుల మాట ఫలితాల షేర్లలో ఒడిదుడుకులు న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, విప్రో... వంటి బ్లూచిప్ కంపెనీల మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, అంతర్జాతీయ సంకేతాలు ఈ వారం స్టాక్ మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులంటున్నారు. చైనా జీడీపీ గణాంకాలు, రూపాయి కదలికలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు కూడా ప్రభావం చూపుతాయని వారంటున్నారు. ఈ వారంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఐటీసీ వంటి దిగ్గజ కంపెనీలు తమ మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వెల్లడిస్తున్నాయి. వీటితో పాటు కోటక్ మహీంద్రా బ్యాంక్, విప్రో, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఐడియా, సెల్యులర్, కెయిర్న్ ఇండియాలు కూడా తమ ఫలితాలను ప్రకటించనున్నాయి. క్యూ3 ఫలితాలే కాకుండా రానున్న క్వార్టర్లో వృద్ధి గురించి ఈ కంపెనీల యాజమాన్యాలు వెల్లడించే విషయాలు కీలకం కానున్నాయని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. అందరి కళ్లూ.. చైనా జీడీపీపైననే ఇన్వెస్టర్ల నమ్మకాన్ని పెంచే దిశగా ఇప్పటిదాకా వెలువడిన కంపెనీల క్యూ3 ఆర్థిక ఫలితాలు లేవని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ వ్యవస్థాపక డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. గత వారం ప్రతికూల సెంటిమెంట్ ఈ వారమూ కూడా కొనసాగవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అందరి కళ్లూ చైనా జీడీపీపైననే ఉన్నాయని చెప్పారు. జీడీిపీకి సంబంధించి గత ఏడాది, గత ఏడాది నాలుగో క్వార్టర్ గణాంకాలను చైనా వెల్లడించనున్నది. స్వల్పకాలంలో అంతర్జాతీయ సంకేతాలే భారత స్టాక్‌మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని కొందరు విశ్లేషకులంటున్నారు. ఫలితాల సీజన్ కారణంగా సంబంధిత షేర్ల ఒడిదుడుకులే అధికంగా ఉంటాయని వారంటున్నారు. ఇలాంటి సందర్భాల్లో నాణ్యమైన కంపెనీల షేర్లను కొనుగోలు చేయాలని రిలయన్స్ సెక్యూరిటీస్ సూచిస్తోంది. ఆర్థికంగా సమస్యాత్మక పరిస్థితులున్నప్పుడు ఈ షేర్లు తట్టుకుని రాణిస్తాయని పేర్కొంది. గత వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 479 పాయింట్లు (1.92%) క్షీణించి 24,455 పాయింట్లకు, ఎన్ఎన్ఈ నిఫ్టీ 164 పాయింట్లు(2.15%) క్షీణించి 7,438కు పడిపోయాయి. 15 రోజుల్లో రూ. 3,500కోట్లు వెనక్కి.. విదేశీ ఇన్వెస్టర్లు భారత స్టాక్ మార్కెట్ నుంచి కొత్త ఏడాదిలో మొదటి పదిహేను రోజుల్లో రూ.3,500 కోట్లు ఉపసంహరించుకున్నారు. చైనా ఆర్థిక వ్యవస్థపై తాజాగా ఆందోళనలు చెలరేగడం, ముడి చమురు ధరలు మరింత పతనం కావడం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు బలహీనంగా ఉండడం దీనికి ప్రధాన కారణాలు. అయితే భారత డెట్ మార్కెట్లో మాత్రం విదేశీ ఇన్వెస్టర్లు నికరంగా రూ.3,239 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేశారు. డిపాజిటరీలు వెల్లడించిన గణాంకాల ప్రకారం... విదేశీ ఇన్వెస్టర్లు ఈ ఏడాదిలో ఈ నెల 15 వరకూ ఈక్విటీ మార్కెట్లో రూ.36,368 కోట్ల కొనుగోళ్లు, రూ.39,852 కోట్ల అమ్మకాలు జరిపారు. నికరంగా రూ.3,483 కోట్లు ఉపసంహరించుకున్నారు. గత ఏడాది విదేశీ ఇన్వెస్టర్లు నికర పెట్టుబడులు ఈక్విటీ మార్కెట్లో రూ.17,806 కోట్లుగా, డెట్ మార్కెట్లో రూ.45,856 కోట్లుగా ఉన్నాయి. -
పడగొట్టిన ఫలితాలు
* సెన్సెక్స్ 109 పాయింట్లు పతనం * 27,362 పాయింట్ల వద్ద ముగింపు ముంబై: బ్లూ చిప్ కంపెనీల ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడంతో సోమవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. చైనా కేంద్ర బ్యాంక్ వడ్డీరేట్ల కోత కారణంగా ఆసియా మార్కెట్లు లాభపడినా, భారతీ ఎయిర్టెల్, హెచ్‌డీఎఫ్‌సీల ఆర్థిక ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండటంతో బీఎస్ఈ సెన్సెక్స్ రెండు నెలల గరిష్ట స్థాయి నుంచి పతనమైంది. మంగళవారం నుంచి అమెరికా ఫెడరల్ రిజర్వ్ రెండు రోజుల పాటు సమావేశం కానుండడం, అక్టోబర్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ఈ వారంలోనే ముగియనుండడం వంటి కారణాల వల్ల బీఎస్ఈ సెన్సెక్స్ 108 పాయింట్ల నష్టంతో 27,362 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 35 పాయింట్లు క్షీణించి 8,261పాయింట్ల వద్ద ముగిశాయి. ప్రభుత్వ రంగ, ఆయిల్, గ్యాస్, కన్సూమర్ డ్యూరబుల్స్, బ్యాంకింగ్ షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. అయితే వాహన, లోహ షేర్లలో కొనుగోళ్ల కారణంగా నష్టాలు పరిమితయ్యాయి. -
ఎస్బీఐ, ఐటీసీ ఫలితాలపై దృష్టి
⇒ రూపాయి విలువ, క్రూడ్ ధరల ప్రభావం ⇒ వడ్డీ రేట్లపై ఆర్బీఐ నిర్ణయం కోసం చూపు న్యూఢిల్లీ: ఎస్బీఐ, ఐటీసీతో సహా ఇతర బ్లూచిప్ కంపెనీల ఆర్థిక ఫలితాలు ఈ వారం స్టాక్ మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశిస్తాయని విశ్లేషకులు అంచనావేశారు. అలాగే రిజర్వుబ్యాంక్ వడ్డీ రేట్ల కోత అంశం, రూ పాయి మారకపు విలువ, ముడి చమురు ధర కూడా మార్కెట్ కదలికల్ని శాసిస్తాయని వారన్నారు. ఈ వారం ఎస్బీఐ, ఐటీసీ, బజాజ్ ఆటో, టాటా స్టీల్, టాటా పవర్, డీఎల్ఎఫ్ తదితర ప్రధాన కంపెనీలు క్యూ4 కార్పొరేట్ ఫలితాల్ని వెల్లడించనున్నాయి. ఇప్పటివరకూ వెల్లడైన కార్పొరేట్ల నిరుత్సాహకర ఫలితాల్ని మార్కెట్ డిస్కౌంట్ చేసుకున్నదని, రాబోయే ఫలితాలు ప్రోత్సాహకరంగావుంటే ట్రెండ్ మెరుగుపడవచ్చని నిపుణులు పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి రెండూ తగ్గడంతో వడ్డీ రేట్లపై రిజర్వుబ్యాంక్ తీసుకోబోయే నిర్ణయం కోసం ఇన్వెస్టర్లు వేచిచూస్తున్నారని విశ్లేషకులు చెప్పారు. ఏప్రిల్ నెలలో ద్రవ్యోల్బణం నాలుగు నెలల కనిష్టస్థాయికి తగ్గడంతో పాటు మార్చి నెలలో పారిశ్రామికోత్పత్తి ఐదునెలల కనిష్టస్థాయికి పడిపోయిన సంగతి తెలిసిందే. జూన్ 2 నాటి పరపతి విధాన సమీక్షలోగానీ, లేదా అంతకుముందుగానీ ఆర్బీఐ చర్యలు (వడ్డీ రేట్లు తగ్గించడం) తీసుకొనే అవకాశం వుందని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాకేశ్ గోయల్ చెప్పారు. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలవల్ల ఏర్పడిన లిక్విడిటీ కొరత మార్కెట్‌కు ఆందోళనకారకమని ఆమ్రపాలి ఆద్యా రీసెర్చ్ హెడ్ అబ్నీష్ కుమార్ అన్నారు. గతవారం మార్కెట్... ఆటో, బ్యాంకింగ్, కన్సూమర్ డ్యూరబుల్స్ షేర్లలో కొనుగోళ్లు జరగడంతో వరుసగా రెండోవారం దేశీ మార్కెట్ పెరిగింది. క్రితం వారం సెన్సెక్స్ 218 పాయింట్లు లాభపడి 27,324 పాయింట్ల వద్ద ముగిసింది. గత 2 వారాల్లో సెన్సెక్స్ 312 పాయిం ట్లు మెరుగుపడింది. గతవారం నిఫ్టీ 71 పాయింట్లు ర్యాలీ జరిపి 8,262 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఎఫ్ఐఐల అమ్మకాలు రూ. 17,000 కోట్లు పన్నుల వివాదం కొనసాగుతుండటంతో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు మే నెల తొలి రెండు వారాల్లో దాదాపు రూ. 17,000 కోట్లు నికరంగా విక్రయించారు. రూ. 7,635 కోట్ల విలువైన షేర్లను, రూ. 9,088 కోట్ల విలువైన రుణపత్రాల్ని వారు విక్రయించడంతో, మొత్తం నికర అమ్మకాలు రూ. 16,723 కోట్లకు చేరినట్లు డిపాజిటరీల డేటా వెల్లడిస్తున్నది. ఎందుకు పెరిగాయంటే... ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం నాలుగు నెలల కనిష్టానికి చేరింది. మార్చిలో పారిశ్రామికోత్పత్తి ఐదు నెలల కనిష్టానికి క్షీణించింది. ఇక టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం కొత్త కనిష్ట స్థాయిలకు చేరింది. గత వారంలో వెలువడిన ఈ గణాంకాల కారణంగా ఆర్బీఐ కీలక రేట్లలో కోత విధిస్తుందనే అంచనాలు పెరిగాయి. దీంతో వడ్డీరేట్లతో సంబంధమున్న బ్యాంక్, వాహన, ఆర్థిక రంగ షేర్లు బాగా పెరిగాయి. ఇటీవల స్టాక్ మా ర్కెట్ పతనం కారణంగా పలు బ్లూ చిప్ షేర్లు ఆకర్షణీయ ధరల్లో లభిస్తుండడం, సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో కొనుగోళ్లు జోరుగా జరిగాయి. ఎందుకు తగ్గాయంటే... నికర లాభం 72 శాతం క్షీణించడంతో హెచ్‌డీఐఎల్, ఫ్లాట్ల విక్రయాల్లో డీఎల్ఎఫ్ కంపెనీ అనుచిత వ్యాపార విధానాలకు పాల్పడిందని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్ధారించడంతో డీఎల్ఎఫ్ షేర్లు పతనమయ్యాయి. బ్లూ చిప్ షేర్లలో లాభాల స్వీకరణ కూడా జరిగింది. కనీస ప్రత్యామ్నాయ పన్ను(మ్యాట్)పై ఆందోళన, నిరాశజనకంగా ఉన్న కంపెనీల ఆర్థిక ఫలితాలు, డాలర్‌తో రూపాయి మారకం 64కు క్షీణించడం, జీఎస్టీ, భూ సేకరణ బిల్లుల ఆమోదంలో అనిశ్చతి, తదితర అంశాల కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు తమ అమ్మకాలను కొనసాగించారు. -
హెలో కర్రీ చేతికి పరాటా పోస్ట్
రూ.50 కోట్లు పెట్టుబడులు పెట్టనున్న బ్లూచిప్ కంపెనీ... ⇒ డిసెంబర్‌కల్లా దేశంలో 90 ఔట్లెట్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నాణ్యమైన పరాటాలు ఇప్పుడు హెలో కర్రీ మెనూలోకి వచ్చి చేరాయి. హోమ్ డెలివరీ రంగంలో ఉన్న హైదరాబాద్‌కు చెందిన పరాటా పోస్ట్‌ను ,ఈ నగరం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న హెలో కర్రీ కొనుగోలు చేసింది. ఎంత మొత్తానికి కొనుగోలుచేసిందీ కంపెనీ వెల్లడించలేదు. పరాటా పోస్ట్‌ను కొనుగోలు చేసిన సందర్భంగా హలో కర్రీ సీఈఓ రాజు భూపతి ‘సాక్షి బిజినెస్ బ్యూరో’తో ప్రత్యేకంగా మాట్లాడారు. పలు విశేషాలు వెల్లడించారు. అవి.... ఎంత తింటే.. అంతే డబ్బులు సింగిల్, ఫ్యామిలీ, జంబో ప్యాక్స్.. ఇదీ స్థూలంగా బిర్యానీ ప్యాక్‌ల రకాలు. హలో కర్రీ అనే స్టార్టప్ ఒక అడుగు ముందుకేసి హైటెక్‌సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ పేరుతో వినూత్న రెస్టారెంట్‌ను ప్రారంభించింది. దీని ప్రత్యేకత ఏంటంటే మనకు ఎంత బిర్యానీ రైస్ కావాలంటే అంత.. ఎన్ని ముక్కలు కావాలంటే అన్ని వేసుకోవచ్చు ఇక్కడ. గ్రాముకు 50 పైసల చొప్పున చెల్లించాలి అంతే. ఇలా ఎందుకంటే బిర్యానీ బాగా లేదనో, ముక్కలు తినేసి ఆహారం వదలటమో, అనుకున్న దానికంటే ఎక్కువుందనో.. ఇలా కారణాలేమైనా నగరంలో రోజుకు 24.8 శాతం ఆహారం దుర్వినియోగం అవుతోంది. వేస్ట్ కాకుండా ఉండాలంటే ఎంత బిర్యానీ కావాలో ఎంచుకునే అవకాశం కస్టమర్లకే ఇస్తే సరిపోతుందంటారాయన. దేశంలో 80-90 ఔట్లెట్లు.. ప్రస్తుతం హలో కర్రీకి హైదరాబాద్‌లో గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, హైటెక్‌సిటీ, కూకట్‌పల్లిలో ఔట్‌లెట్లున్నాయి. వీటి నుంచి నెలకు 10 వేల ఆర్డర్లొస్తున్నాయి. మరో 15 రోజుల్లో పంజగుట్ట, హిమాయత్‌నగర్‌లోనూ ప్రారంభించనున్నాం. బెంగళూరులో లోనూ సెంటర్లు ఉన్నాయి. డిసెంబర్‌కల్లా దేశంలో 80-90 ఔట్లెట్లు ప్రారంభించానేది లక్ష్యం. 30 నిమిషాల్లో డెలివరీ..: ప్రస్తుతం ఒక్క రోజులో హైదరాబాద్‌లోని మొత్తం హోమ్ డెలివరీ మార్కెట్లో హలో క ర్రీ వాటా 25%. వాట్సాప్, యాప్, ఎస్ఎంఎస్ల ద్వారా కూడా ఆర్డర్లివ్వొచ్చు. ధరలు రూ.79-149 వరకున్నాయి. ఆర్డరిచ్చిన 30 నిమిషాల్లో సరఫరా చేస్తాం. ప్రస్తుతం హలో కర్రీకి 5 లక్షల మంది కస్టమర్లున్నారు. పరాటా పోస్ట్ గురించి.. ఐఐఎం గ్రాడ్యుయేట్లు ముకేష్ లాంబ, రితురాజ్లు 2013లో పరాటా పోస్ట్‌ను ప్రారంభించారు. 55 రకాల పరాటాలు, కూరలను ఈ కంపెనీ సరఫరా చేస్తోంది. గతేడాది 3 లక్షలకుపైగా పరాటాలతో 60 వేల ఆర్డర్లను విజయవంతంగా పూర్తి చేసింది. పరాటాపోస్ట్ కొనుగోలుచేయడంతో పాటు దేశీయ ఫుడ్ డెలివరీ రంగ కంపెనీల కొనుగోలుపై దృష్టిపెట్టాం. ముంబై కంపెనీని త్వరలో కొనుగోలు చేయనున్నాం. రూ.50 కోట్ల పెట్టుబడులు.. 2014లో కంపెనీ ప్రారంభించే రోజుల్లో రూ.3.5 కోట్ల పెట్టుబడులు పెట్టాం. తర్వాతి నెల రోజుల్లోనే వెంచర్ క్యాపిటలిస్ట్ శశిరెడ్డి రూ.3 కోట్లు సీడ్ ఫండ్ అందించారు. తాజాగా రూ.50 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఒక బ్లూ చిప్ కంపెనీ ముందుకొచ్చింది. నెల రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తాం.