ఫలితాలు, విదేశీ అంశాలే కీలకం
ఇవే మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయ్
ఈ వారం మార్కెట్‌పై విశ్లేషకుల మాట
ఫలితాల షేర్లలో ఒడిదుడుకులు
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, విప్రో... వంటి బ్లూచిప్ కంపెనీల మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, అంతర్జాతీయ సంకేతాలు ఈ వారం స్టాక్ మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులంటున్నారు. చైనా జీడీపీ గణాంకాలు, రూపాయి కదలికలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు కూడా ప్రభావం చూపుతాయని వారంటున్నారు. ఈ వారంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఐటీసీ వంటి దిగ్గజ కంపెనీలు తమ మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వెల్లడిస్తున్నాయి. వీటితో పాటు కోటక్ మహీంద్రా బ్యాంక్, విప్రో, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఐడియా, సెల్యులర్, కెయిర్న్ ఇండియాలు కూడా తమ ఫలితాలను ప్రకటించనున్నాయి. క్యూ3 ఫలితాలే కాకుండా రానున్న క్వార్టర్‌లో వృద్ధి గురించి ఈ కంపెనీల యాజమాన్యాలు వెల్లడించే విషయాలు కీలకం కానున్నాయని మార్కెట్ విశ్లేషకులంటున్నారు.
అందరి కళ్లూ.. చైనా జీడీపీపైననే
ఇన్వెస్టర్ల నమ్మకాన్ని పెంచే దిశగా ఇప్పటిదాకా వెలువడిన కంపెనీల క్యూ3 ఆర్థిక ఫలితాలు లేవని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ వ్యవస్థాపక డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. గత వారం ప్రతికూల సెంటిమెంట్ ఈ వారమూ కూడా కొనసాగవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అందరి కళ్లూ చైనా జీడీపీపైననే ఉన్నాయని చెప్పారు. జీడీిపీకి సంబంధించి గత ఏడాది, గత ఏడాది నాలుగో క్వార్టర్ గణాంకాలను చైనా వెల్లడించనున్నది. స్వల్పకాలంలో అంతర్జాతీయ సంకేతాలే భారత స్టాక్‌మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని కొందరు విశ్లేషకులంటున్నారు. ఫలితాల సీజన్ కారణంగా సంబంధిత షేర్ల ఒడిదుడుకులే అధికంగా ఉంటాయని వారంటున్నారు. ఇలాంటి సందర్భాల్లో నాణ్యమైన కంపెనీల షేర్లను కొనుగోలు చేయాలని రిలయన్స్ సెక్యూరిటీస్ సూచిస్తోంది. ఆర్థికంగా సమస్యాత్మక పరిస్థితులున్నప్పుడు ఈ షేర్లు తట్టుకుని రాణిస్తాయని పేర్కొంది. గత వారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 479 పాయింట్లు (1.92%) క్షీణించి 24,455 పాయింట్లకు, ఎన్‌ఎన్‌ఈ నిఫ్టీ 164 పాయింట్లు(2.15%) క్షీణించి 7,438కు పడిపోయాయి.
15 రోజుల్లో రూ. 3,500కోట్లు వెనక్కి..
విదేశీ ఇన్వెస్టర్లు భారత స్టాక్ మార్కెట్ నుంచి కొత్త ఏడాదిలో మొదటి పదిహేను రోజుల్లో రూ.3,500 కోట్లు ఉపసంహరించుకున్నారు. చైనా ఆర్థిక వ్యవస్థపై తాజాగా ఆందోళనలు చెలరేగడం, ముడి చమురు ధరలు మరింత పతనం కావడం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు బలహీనంగా ఉండడం దీనికి ప్రధాన కారణాలు. అయితే భారత డెట్ మార్కెట్‌లో మాత్రం విదేశీ ఇన్వెస్టర్లు నికరంగా రూ.3,239 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేశారు. డిపాజిటరీలు వెల్లడించిన గణాంకాల ప్రకారం... విదేశీ ఇన్వెస్టర్లు ఈ ఏడాదిలో ఈ నెల 15 వరకూ ఈక్విటీ మార్కెట్లో రూ.36,368 కోట్ల కొనుగోళ్లు, రూ.39,852 కోట్ల అమ్మకాలు జరిపారు. నికరంగా రూ.3,483 కోట్లు ఉపసంహరించుకున్నారు. గత ఏడాది విదేశీ ఇన్వెస్టర్లు నికర పెట్టుబడులు ఈక్విటీ మార్కెట్లో రూ.17,806 కోట్లుగా, డెట్ మార్కెట్లో రూ.45,856 కోట్లుగా ఉన్నాయి.