ఎస్‌బీఐ, ఐటీసీ ఫలితాలపై దృష్టి | ITC, SBI earning numbers to guide market | Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐ, ఐటీసీ ఫలితాలపై దృష్టి

Published Mon, May 18 2015 1:51 AM | Last Updated on Sun, Sep 3 2017 2:14 AM

ఎస్‌బీఐ, ఐటీసీ ఫలితాలపై దృష్టి

ఎస్‌బీఐ, ఐటీసీ ఫలితాలపై దృష్టి

రూపాయి విలువ, క్రూడ్ ధరల ప్రభావం  
వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ నిర్ణయం కోసం చూపు

న్యూఢిల్లీ: ఎస్‌బీఐ, ఐటీసీతో సహా ఇతర బ్లూచిప్ కంపెనీల ఆర్థిక ఫలితాలు ఈ వారం స్టాక్ మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశిస్తాయని విశ్లేషకులు అంచనావేశారు. అలాగే రిజర్వుబ్యాంక్ వడ్డీ రేట్ల కోత అంశం, రూ పాయి మారకపు విలువ, ముడి చమురు ధర కూడా మార్కెట్ కదలికల్ని శాసిస్తాయని వారన్నారు.

ఈ వారం ఎస్‌బీఐ, ఐటీసీ, బజాజ్ ఆటో, టాటా స్టీల్, టాటా పవర్, డీఎల్‌ఎఫ్ తదితర ప్రధాన కంపెనీలు క్యూ4 కార్పొరేట్ ఫలితాల్ని వెల్లడించనున్నాయి. ఇప్పటివరకూ వెల్లడైన కార్పొరేట్ల నిరుత్సాహకర ఫలితాల్ని మార్కెట్ డిస్కౌంట్ చేసుకున్నదని, రాబోయే ఫలితాలు ప్రోత్సాహకరంగావుంటే ట్రెండ్ మెరుగుపడవచ్చని నిపుణులు పేర్కొన్నారు.
 
ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి రెండూ తగ్గడంతో వడ్డీ రేట్లపై రిజర్వుబ్యాంక్ తీసుకోబోయే నిర్ణయం కోసం ఇన్వెస్టర్లు వేచిచూస్తున్నారని విశ్లేషకులు చెప్పారు. ఏప్రిల్ నెలలో ద్రవ్యోల్బణం నాలుగు నెలల కనిష్టస్థాయికి తగ్గడంతో పాటు మార్చి నెలలో పారిశ్రామికోత్పత్తి ఐదునెలల కనిష్టస్థాయికి పడిపోయిన సంగతి తెలిసిందే. జూన్ 2 నాటి పరపతి విధాన సమీక్షలోగానీ, లేదా అంతకుముందుగానీ ఆర్‌బీఐ చర్యలు (వడ్డీ రేట్లు తగ్గించడం) తీసుకొనే అవకాశం వుందని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాకేశ్ గోయల్ చెప్పారు. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలవల్ల ఏర్పడిన లిక్విడిటీ కొరత మార్కెట్‌కు ఆందోళనకారకమని ఆమ్రపాలి ఆద్యా రీసెర్చ్ హెడ్ అబ్నీష్ కుమార్ అన్నారు.
 
గతవారం మార్కెట్...
ఆటో, బ్యాంకింగ్, కన్సూమర్ డ్యూరబుల్స్ షేర్లలో కొనుగోళ్లు జరగడంతో వరుసగా రెండోవారం దేశీ మార్కెట్ పెరిగింది. క్రితం వారం సెన్సెక్స్ 218 పాయింట్లు లాభపడి 27,324 పాయింట్ల వద్ద ముగిసింది. గత 2 వారాల్లో సెన్సెక్స్ 312 పాయిం ట్లు మెరుగుపడింది. గతవారం  నిఫ్టీ 71 పాయింట్లు ర్యాలీ జరిపి 8,262 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.
 
ఎఫ్‌ఐఐల అమ్మకాలు రూ. 17,000 కోట్లు
పన్నుల వివాదం కొనసాగుతుండటంతో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు మే నెల తొలి రెండు వారాల్లో దాదాపు రూ. 17,000 కోట్లు నికరంగా విక్రయించారు. రూ. 7,635 కోట్ల విలువైన షేర్లను, రూ. 9,088 కోట్ల విలువైన రుణపత్రాల్ని వారు విక్రయించడంతో, మొత్తం నికర అమ్మకాలు రూ. 16,723 కోట్లకు చేరినట్లు డిపాజిటరీల డేటా వెల్లడిస్తున్నది.
 
ఎందుకు పెరిగాయంటే...
ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం నాలుగు నెలల కనిష్టానికి చేరింది. మార్చిలో పారిశ్రామికోత్పత్తి ఐదు నెలల కనిష్టానికి క్షీణించింది. ఇక  టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం కొత్త కనిష్ట స్థాయిలకు చేరింది. గత వారంలో వెలువడిన ఈ గణాంకాల కారణంగా  ఆర్‌బీఐ  కీలక రేట్లలో కోత విధిస్తుందనే అంచనాలు పెరిగాయి. దీంతో వడ్డీరేట్లతో సంబంధమున్న  బ్యాంక్, వాహన, ఆర్థిక రంగ షేర్లు బాగా పెరిగాయి. ఇటీవల స్టాక్ మా ర్కెట్ పతనం కారణంగా పలు బ్లూ చిప్ షేర్లు ఆకర్షణీయ ధరల్లో లభిస్తుండడం, సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో కొనుగోళ్లు జోరుగా జరిగాయి.
 
ఎందుకు తగ్గాయంటే...
నికర లాభం 72 శాతం క్షీణించడంతో హెచ్‌డీఐఎల్, ఫ్లాట్ల విక్రయాల్లో డీఎల్‌ఎఫ్ కంపెనీ అనుచిత వ్యాపార విధానాలకు పాల్పడిందని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్ధారించడంతో డీఎల్‌ఎఫ్ షేర్లు పతనమయ్యాయి. బ్లూ చిప్ షేర్లలో లాభాల స్వీకరణ కూడా జరిగింది.  కనీస ప్రత్యామ్నాయ పన్ను(మ్యాట్)పై ఆందోళన, నిరాశజనకంగా ఉన్న కంపెనీల ఆర్థిక ఫలితాలు, డాలర్‌తో రూపాయి మారకం 64కు క్షీణించడం, జీఎస్‌టీ, భూ సేకరణ బిల్లుల ఆమోదంలో అనిశ్చతి, తదితర అంశాల  కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు తమ అమ్మకాలను కొనసాగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement