వేతనంలో భారీ అంతరం
న్యూఢిల్లీ: బ్లూచిప్ కంపెనీల్లో పనిచేసే సగటు ఉద్యోగికి, ఆ సంస్థ నిర్వహణ బాధ్యతలు చూసే సీఈవోలకు మధ్య వేతనంలో నక్కకీ, నాగలోకానికీ ఉన్నంత తేడా ఉంటోందని ఓ అధ్యయనంలో తేలింది. సెబీ ఆదేశాల మేరకు లిస్టెడ్ కంపెనీలు వేతన వివరాలను స్టాక్ మార్కెట్లకు వెల్లడించగా, బీఎస్‌ఈ సెన్సెక్స్ సూచీలోని కంపెనీల్లో 2016–17 సంవత్సరపు వేతన వివరాలను పరిశీలిస్తే ఈ వివరాలు వెల్లడయ్యాయి. అధిక శాతం ప్రైవేటు బ్లూచిప్ కంపెనీల్లో సీఈవో, ఎగ్జిక్యూటివ్ చైర్మన్లు సగటు ఉద్యోగులతో పోలిస్తే 1,200 రెట్ల వరకూ అధికంగా వేతనాలు అందుకుంటున్నారు.
అంతే కాకుండా గత ఆర్థిక సంవత్సరంలో వేతనంలో పెరుగుదల సైతం అధికంగానే ఉంది. అదే సమయంలో సగటు ఉద్యోగి వేతనం తగ్గడం లేదా అదే స్థాయిలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వరంగ కంపెనీల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. సగటు లేదా మధ్య స్థాయి ఉద్యోగి వేతనంతో పోలిస్తే సీఈవోల వేతనం మూడు, నాలుగు రెట్లు అధికంగానే ఉంది. సగటు ఉద్యోగుల కంటే టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు ఎంత అధికంగా చెల్లించాలన్న విషయంలో నియంత్రణలు లేవు.
బోర్డు, వాటాదారుల ఆమోదం ఉంటే చాలు. కాకపోతే ఎండీ లేదా హోల్‌టైమ్ డైరెక్టర్‌కు నికర లాభంలో వేతనం 5 శాతాన్ని మించరాదు. తగినంత లాభాలు లేని కంపెనీల్లో టాప్ బాస్‌లకు అధిక వేతనాలు చెల్లించాలంటే ప్రభుత్వ ఆమోదం పొందాల్సి ఉంటుంది. విప్రోలో 259 రెట్లు, ఇన్ఫోసిస్‌లో 283 రెట్లు, డాక్టర్ రెడ్డీస్‌లో 233 రెట్లు, హీరో మోటో కార్ప్‌లో 731 రెట్ల అంతరం ఉంది.