క్యూ4 ఫలితాలతో ట్రెండ్..
* ఈ వారం మార్కెట్‌పై అంచనాలు
* చమురు, రూపాయి కదలికలూ కీలకమే
* ఏప్రిల్ పీఎంఐ గణాంకాలు ఈ వారమే
న్యూఢిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ, టూ వీలర్ దిగ్గజం హీరో మోటొకార్ప్‌తో పాటు ఇతర బ్లూ చిప్ కంపెనీల ఆర్థిక పలితాలు, ఈ వారం స్టాక్ మార్కెట్ గమనంపై ప్రధానంగా ప్రభావం చూపుతాయని నిపుణులంటున్నారు. దీంతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడి పోకడలు కూడా కీలకమని వారంటున్నారు.
వీటితో పాటు అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్ల తీరు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం, రూపాయి కదలికలు ఇవన్నీ స్టాక్ మార్కెట్ తీరుపై ప్రభావం చూపుతాయని క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్ సీఈఓ రోహిత్ గాడియా చెప్పారు. ఏప్రిల్ నెల అమ్మకాల గణాంకాలను వాహన కంపెనీలు వెల్లడించనున్నందున వాహన షేర్లపై కూడా ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తారు.
ఈ వారంలో వెల్లడయ్యే సేవలు, తయారీ రంగానికి సంబంధించి పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) గణాంకాలు కూడా తగిన ప్రభావం చూపుతాయి. మార్కిట్ ఎకనామిక్స్ సంస్థ ఏప్రిల్ నెలకు సంబంధించి భారత తయారీ రంగ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ గణాంకాలను సోమవారం(మే 2న)న వెల్లడిస్తుంది. ఇక నికాయ్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ గణాంకాలు బుధవారం( మే 4న) వెల్లడవుతాయి.
పెరుగుదల అవకాశాలు స్వల్పమే...
మార్కెట్ కరెక్షన్ దిశలో ఉందని సామ్‌కో సీఈఓ జిమీత్ మోడి చెప్పారు. కంపెనీల ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగా లేవని, ఈ విషయం ఇప్పటికే డిస్కౌంట్ అయిందని, అందుకని మార్కెట్ పెరుగుదలకు స్వల్పంగా మాత్రమే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. అందరి కళ్లు రాజకీయ పరిస్థితులపైననే, ముఖ్యంగా పార్లమెంట్ సమావేశాల ఫలితాలపైనే ఉంటాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. ఇటీవల వచ్చిన ర్యాలీ అనంతరం మార్కెట్ కన్సాలిడేషన్ దశలో ఉందని వివరించారు. రానున్న కంపెనీల ఆర్థిక ఫలితాలను బట్టి మార్కెట్ గమనం ఆధారపడి ఉంటుందని వివరించారు.
విదేశీ పెట్టుబడుల జోరు...
భారత మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. వర్షాలు బాగా కురుస్తాయనే అంచనాలు, ప్రోత్సాహకరంగా ఉన్న ఆర్థిక గణాంకాలు, ఆర్‌బీఐ రేట్ల కోత కారణంగా ఏప్రిల్ నెలలో ఈక్విటీ, డెట్ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్లు 220కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం, ఎఫ్‌పీఐలు ఏప్రిల్‌లో ఈక్విటీ మార్కెట్లో రూ.8,416 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.6,418 కోట్లు... మొత్తం రూ.14,834 కోట్లు పెట్టుబడులు పెట్టారు.
విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టడం ఇది వరుసగా రెండో నెల. మార్చిలో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు రూ.19,967 కోట్లుగా ఉన్నాయి. అంతకు ముందటి నాలుగు నెలల్లో (గత ఏడాది నవంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ) విదేశీ ఇన్వెస్టర్లు రూ.41,661 కోట్లు నికర పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. ఇక ఈ ఏడాది ఇప్పటివరకూ విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) రూ.12,911 కోట్లు ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయగా, రూ.939 కోట్లు డెట్ మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నారు. నికరంగా భారత్‌లో రూ. 11,971 కోట్లకు పెట్టుబడులు పెట్టారు.