మూడు రోజుల నష్టాలకు బ్రేక్
* కలసివచ్చిన అంతర్జాతీయ సంకేతాలు
* బ్లూచిప్‌ల ల్లో పెరిగిన కొనుగోళ్లు
* 366 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
* నిఫ్టీ లాభం 133 పాయింట్లు
మార్కెట్ అప్‌డేట్
ముంబై: స్టాక్ మార్కెట్లు మూడు వారాల కనిష్టం నుంచి గురువారం కోలుకున్నాయి. గత మూడు రోజుల్లో దాదాపు 1,000 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 366 పాయింట్లు లాభపడింది. సానుకూలమైన అంతర్జాతీయ సంకేతాల ఫలితంగా బీఎస్‌ఈ సెన్సెక్స్ 366 పాయింట్ల లాభంతో 27,275 పాయింట్ల వద్ద, నిఫ్టీ 133 పాయింట్ల లాభంతో 8,235 పాయింట్ల వద్ద ముగిశాయి.
అమెరికాలో ప్రైవేట్ రంగ ఉద్యోగ గణాంకాలు ప్రోత్సాహాకరంగా ఉండడం, ద్రవ్యోల్బణం ప్రతికూలంగా నమోదు కావడంతో యూరోజోన్ తాజా ప్యాకేజీ ప్రకటిస్తుందన్న అంచనాలు, ముడి చమురు ధరలు స్వల్పంగా పెరగడం...ఇవన్నీ అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి అవకాశాలపై ఇన్వెస్టర్ల ఆందోళనలను తగ్గించాయి. ఏప్రిల్‌కు ముందు వడ్డీరేట్లు పెంచే అవకాశాల్లేవని అమెరికా ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్ సమావేశ మినట్స్ ద్వారా వెల్లడి కావడంతో ఆసియా మార్కెట్లు కూడా లాభాల బాట పట్టాయి.
రియల్టీ, బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ, విద్యుత్తు, వాహన, లోహ, ఆరోగ్య సంరక్షణ, క్యాపిటల్ గూడ్స్ షేర్లు పెరిగాయి. బ్లూ చిప్ షేర్లలో భారీ కొనుగోళ్లు జరిగాయి. రిటైల్ ఇన్వెస్టర్ల డిమాండ్ కారణంగా స్మాల్, మిడ్ క్యాప్ షేర్లు కూడా జోరందుకున్నాయి. కొనుగోళ్లు జోరుగా ఉండడంతో ఒక దశలో సెన్సెక్స్ 407 పాయింట్లు పెరిగింది. రిలయన్స్ మినహా సెన్సెక్స్‌లోని మిగిలిన 29 షేర్లు లాభాల్లోనే ముగిశాయి.
సమ్మె ఆగిపోవడంతో కోల్ ఇండియా 1.2 శాతం పెరగ్గా, జాగ్వార్ ల్యాండ్ రోవర్ అమ్మకాలు డిసెంబర్‌లో 25 శాతం పెరగడంతో టాటా మోటార్స్ 3.6 శాతం వృద్ది చెందింది. శుక్రవారం ఫలితాలు ప్రకటించనున్న ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ 0.5 శాతం పెరిగింది. ఇటీవల కుదేలైన రియల్టీ రంగ షేర్లు పెరిగాయి. ముడి చమురు ధరలు బాగా తగ్గుతుండటంతో వాటిని ముడి పదార్ధాలుగా వినియోగించుకునే ఐదు పెయింట్ కంపెనీల షేర్లు ఏషియన్, బెర్జర్, కన్సాయ్ నెరోలాక్, షాలిమార్ పెయింట్స్, ఆక్జో నోబెల్ ఇండియా షేర్లు పెరిగాయి.
50 షేర్ల నిఫ్టీలో 48 షేర్లు లాభాల్లో ఉన్నాయంటే, అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు జరిగినట్లేనని విశ్లేషకులంటున్నారు. టాటా మోటార్స్ 3.6 శాతం, ఐటీసీ 2.5 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 2.5 శాతం, హిందాల్కో 2.4 శాతం, గెయిల్ ఇండియా 2.2 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 2.1 శాతం,హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 2 శాతం, టాటా పవర్ 1.9 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 1.6 శాతం, హిందూస్తాన్ యూనిలివర్ 1.6 శాతం పెరిగాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.4 శాతం తగ్గింది. టర్నోవర్ రూ.3,231 కోట్లుగా నమోదైంది. ఎన్‌ఎస్‌ఈలో మొత్తం టర్నోవర్ నగదు రూ.17,626 కోట్లు, డెరివేటివ్స్‌లో 71,10,726 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.467 కోట్ల నికర విక్రయాలు జరపగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.288 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు.