స్వల్ప లాభాల్లో మార్కెట్ ముగింపు
- కొనసాగుతున్న లాభాల స్వీకరణ
- 68 పాయింట్ల లాభంతో 29,449కు సెన్సెక్స్
- 15 పాయింట్ల లాభంతో 8,938కు నిఫ్టీ
మార్కెట్ అప్‌డేట్
రోజంతా తీవ్రమైన ఒడిదుడుకులమయంగా సాగిన ట్రేడింగ్‌లో గురువారం నాడు స్టాక్ సూచీలు స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ట్రేడింగ్ చివరిలో రక్షణాత్మక షేర్లలో రికవరీ, హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం పెరగడం వంటి కారణాల వల్ల స్టాక్ మార్కెట్ కోలుకుంది.
బీఎస్‌ఈ సెన్సెక్స్ 68 పాయింట్లు (0.23 శాతం)లాభపడి 29,449 పాయింట్ల వద్ద, నిప్టీ 15 పాయింట్లు లాభపడి 8,938 పాయింట్ల వద్ద ముగిశాయి. ఆరోగ్య సంరక్షణ, బ్యాంక్, వాహన, ఎఫ్‌ఎంసీజీ, విద్యుత్ షేర్లలో రికవరీ కనిపించింది. లోహ, క్యాపిటల్ గూడ్స్, ఐటీ, కన్సూమర్ డ్యూరబుల్స్‌లో లాభాల స్వీకరణ కొనసాగింది.
రోజంతా నష్టాల్లోనే...
బుధవారం నాటి ముగింపు(29,381 పాయింట్లు)తో పోల్చితే బీఎస్‌ఈ సెన్సెక్స్ లాభాల్లో ప్రారంభమైంది. 29,437 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ 29,518-29,162 పాయింట్ల గరిష్ట-కనిష్ట స్థాయిల మధ్య కదలాడి చివరకు 68 పాయింట్లు (0.23 శాతం)లాభంతో 29,449కు చేరింది. రోజంతా స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లోనే ఉన్నాయి. హోలీ సెలవుతో పాటు వీకెండ్‌కావడంతో వరుసగా మూడు రోజులు సెలవు అయినందున ట్రేడర్లు లాంగ్ పొజిషన్లను తగ్గించుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఒక దిశ, దశ లేకుండా సూచీలు కదలాడాయి. అయితే దీర్ఘకాలం పెండింగ్‌లో ఉన్న బీమా బిల్లు లోక్‌సభ ఆమోదం పొందడం, కోల్ బిల్లుకు లోక్‌సభ పచ్చజెండా ఊపడం ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని నింపడంతో చివరకు సూచీలు లాభాలతో ముగియగలిగాయి.
లాభనష్టాల్లో...
30 సెన్సెక్స్ షేర్లలో 13 లాభాల్లో, 17 నష్టాలో ముగిశాయి. సన్ ఫార్మా, సన్‌ఫార్మా అడ్వాన్స్‌డ్ రీసెర్చ్, ర్యాన్‌బాక్సీల జోరు నేడు కూడా కొనసాగింది. సన్ ఫార్మా 3.2 శాతం పెరిగింది. 1,461 షేర్లు నష్టాల్లో, 1,401 షేర్లు లాభాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.3,648 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ నగదు విభాగంలో రూ.19,542 కోట్లుగా, డెరివేటివ్స్ విభాగంలో రూ.2,36,434 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ. 80 కోట్ల నికర కొనుగోళ్లు జరపగా, దేశీ ఇన్వెస్టర్లు రూ.194 కోట్ల నికర అమ్మకాలు జరిపారు.చైనా తన జీడీపీ లక్ష్యాన్ని 7 శాతానికి తగ్గించడంతో(11 ఏళ్లలో ఇదే కనిష్ట స్థాయి) జపాన్ నికాయ్ మినహా మిగిలిన అన్ని ఆసియా దేశాల స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.