మూడో రోజూ నష్టాల్లోనే
- ఆచి, తూచి వ్యవహరిస్తున్న ఇన్వెస్టర్లు
- 51 పాయింట్ల నష్టంతో 28,649కు సెన్సెక్స్
- 8,700 పాయింట్లకు నిఫ్టీ
- మార్కెట్ అప్‌డేట్
స్టాక్ మార్కెట్ క్షీణత వరుసగా మూడో రోజూ కొనసాగింది. ఆసియా సంకేతాలు మందకొడిగా ఉండడం, పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), ద్రవ్యోల్బణ గణాంకాలు గురువారం వెలువడుతుండటంతో బుధవారం స్టాక్ మార్కెట్ ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగింది. కీలక షేర్లలో అమ్మకాలు చోటు చేసుకున్నాయి. దీంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 51పాయింట్లు క్షీణించి 28,649 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కీలకమైన 8,700 పాయింట్లకు దిగజారింది. లోహ, ఆయిల్, గ్యాస్, ఆరోగ్య సంరక్షణ, క్యాపిటల్ గూడ్స్, టెక్నాలజీ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సోమవారం నుంచి బుధవారం వరకు సెన్సెక్స్ మొత్తం 790 పాయింట్లు నష్టపోయింది.
ఆసియా మార్కెట్ల ప్రభావం
మంగళవారం నాటి ముగింపుతో (28, 710 పాయింట్లతో) పోలిస్తే సెన్సెక్స్ 16 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. కరంట్ అకౌంట్ లోటు అంచనాల కంటే తక్కువగా ఉందనే శుభవార్తతో కొనుగోళ్ల జోరు పెరిగింది. అయితే ఆసియా మార్కెట్లు బలహీనంగా ట్రేడవడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించడం ట్రేడింగ్‌పై ప్రభావం చూపాయని కోటక్ సెక్యూరిటీస్ టెక్నికల్ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ చెప్పారు. సెన్సెక్స్ 51 పాయింట్ల(0.18 శాతం) నష్టంతో 28,659 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 12 పాయింట్లు(0.14 శాతం) నష్టపోయి 8,700 పాయింట్ల వద్ద ముగిసింది. వచ్చే వారం జరగనున్న ఫెడరల్ రిజర్వ్ సమావేశం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి పరిస్థితులుండడం వల్ల ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారని నిపుణులంటున్నారు.
5.5 శాతం క్షీణించిన హిందాల్కో
బొగ్గు కుంభకోణంలో హిందాల్కో గ్రూప్‌నకు చెందిన కుమార మంగళం బిర్లాకు స్పెషల్ కోర్ట్ సమన్లు జారీ చేయడంతో హిందాల్కో కంపెనీ షేర్ 6 శాతం వరకూ పతనమైంది. సెన్సెక్స్, నిఫ్టీషేర్లలో అత్యధికంగా నష్టపోయిన షేర్ ఇదే. ఈ ఒక్కరోజే కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.1,568 కోట్లు ఆవిరైంది. సోమవారం నాటి ముగింపు(రూ.138)తో పోలిస్తే ఈ షేర్ బీఎస్‌ఈలో ఇంట్రాడేలో 8 శాతం వరకూ క్షీణించి రూ.127.3ను తాకింది. చివరకు 5.5 శాతం నష్టంతో రూ.130.45 వద్ద ముగిసింది.