నిఫ్టీ రికార్డ్ ముగింపు
⇒ కొనసాగుతున్న బడ్జెట్ జోష్
⇒ జోరుగా విదేశీ నిధులు
⇒ 98 పాయింట్ల లాభంతో 29,459కు సెన్సెక్స్
⇒ 55 పాయింట్ల లాభంతో 8,957కు నిఫ్టీ
⇒ మార్కెట్ అప్‌డేట్
ముంబై: బడ్జెట్లో వృద్ధికి ఊతమిచ్చే ప్రతిపాదనలు ఉన్నాయంటూ ఇన్వెస్టర్లు భావిస్తుండటంతో స్టాక్ మార్కెట్ సోమవారం లాభాల్లో ముగిసింది.
నిఫ్టీ కొత్త గరిష్ట స్థాయిలో(8,957 పాయింట్లు) ముగిసి రికార్డ్ సృష్టించింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 98 పాయింట్లు. నిఫ్టీ 55 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. క్యాపిటల్ గూడ్స్, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక, విద్యుత్ షేర్లలో భారీగా కొనుగోళ్లు జరిగాయి. ఆర్థిక పరిస్థితులు సానుకూలంగా ఉండడం, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడంతో విదేశీ ఇన్వెస్టర్ల నిధులు వెల్లువెత్తుతున్నాయని నిపుణులంటున్నారు. గార్ వాయిదా, కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు, మౌలిక రంగానికి ఊతమిచ్చేలా తీసుకున్న బడ్జెట్ చర్యలపై ఇన్వెస్టర్లు దృష్టిపెడుతున్నారని వారంటున్నారు.
3 రోజుల్లో సెన్సెక్స్ లాభం 700 పాయింట్లు...
శనివారం నాటి ముగింపు(29,361 పాయింట్లు)తో పోల్చితే 172 పాయింట్ల లాభంతో 29,533 వద్ద సెన్సెక్స్ ప్రారంభమైంది. 29,576(215 పాయింట్ల లాభం)-29,260(101 పాయింట్ల నష్టం) పాయింట్ల గరిష్ట, కనిష్ట స్థాయిల మధ్య కదలాడి చివరకు 98 పాయింట్ల లాభం(0.33 శాతం)తో 29,459 వద్ద ముగిసింది. మూడు వరుస ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 700 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 55 పాయింట్ల లాభంతో 8,957 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది నిఫ్టీకి కొత్త గరిష్ట స్థాయి ముగింపు. ఇంతకు ముందు ఈ రికార్డు జనవరి 29న 8,952 పాయింట్లుగా నమోదైంది. అప్పట్లో 8,996 పాయింట్ల నూతన గరిష్టస్థాయి వరకూ నిఫ్టీ పెరిగింది.
క్షీణతలోనే ఐటీసీ
ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రతిపాదనలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడిందని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్(రిటైల్ డిస్ట్రిబ్యూషన్) జయంత్ మాంగ్లిక్ చెప్పారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్ల జోరు పెరిగింది.ఐటీసీతో సహా కొన్ని ఎఫ్‌ఎంసీజీ షేర్లలో అమ్మకాలు కనిపించాయని స్టాక్ బ్రోకర్లు చెప్పారు. ఫిబ్రవరి నెల విక్రయాల వెల్లడి నేపథ్యంలో కొన్ని వాహన కంపెనీలు బలహీనంగా ట్రేడయ్యాయి. ఐటీ, లోహ షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. ఫిబ్రవరిలో తయారీ వృద్ధి 5 నెలల కనిష్టానికి పడిపోయిందన్న హెచ్‌ఎస్‌బీసీ సర్వే కొంత ప్రతికూల ప్రభావం చూపించింది.
లాభ నష్టాల్లో....
30 సెన్సెక్స్ షేర్లలో 13 షేర్లు నష్టాల్లో, 17 షేర్లు లాభాల్లో ముగిశాయి. 1,510 షేర్లు లాభాల్లో, 1,328 షేర్లు నష్టాల్లో ముగిశాయి. మొత్తం టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.4,648 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈలో రూ.23,942 కోట్లుగా, డెరివేటివ్స్ విభాగంలో రూ.2,25,409 కోట్లుగా నమోదైంది.
20 శాతం పెరిగిన ఫైనాన్షియల్ టెక్నాలజీస్ షేర్
ఫైనాన్షియల్ టెక్నాలజీస్ షేర్ ధర సోమవారం 20 శాతం వృద్ధితో రూ.214కు దూసుకుపోయింది. ఫైనాన్షియల్ టెక్నాలజీస్ డెరైక్టర్ల బోర్డ్‌ను రద్దు చేయాలంటూ కంపెనీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కంపెనీ లా బోర్డ్‌కు పిటిషన్ దాఖలు చేయడాన్ని ఫైనాన్షియల్ టెక్నాలజీ బోర్డ్ ఏకగ్రీవంగా వ్యతిరేకించింది. దీంతో ఈ షేర్ ధర 20 శాతం అప్పర్ సర్క్యూట్‌తో రూ.214 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో 56 లక్షల షేర్లు చేతులు మారాయి.