సెన్సెక్స్‌కు స్వల్ప నష్టాలు..
కొనసాగుతున్న రేట్ల కోత ఆశలు
- మైనస్ 246 నుంచి మైనస్ 26కు తగ్గిన సెన్సెక్స్ నష్టం
- 26,193 పాయింట్ల వద్ద ముగింపు
- 5 పాయింట్ల నష్టంతో 7,977కు నిఫ్టీ
అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉన్నప్పటికీ, విద్యుత్తు, బ్యాంక్, కన్సూమర్ గూడ్స్ షేర్ల లాభపడ్డ కారణంగా సోమవారం స్టాక్ మార్కెట్ స్వల్పంగా నష్టపోయింది. రేట్ల కోత అంచనాలతో విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు జరపడంతో ప్రారంభ నష్టాల నుంచి స్టాక్ మార్కెట్ సూచీలు కోలుకున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 26 పాయింట్లు నష్టపోయి 26,193 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 5 పాయింట్ల నష్టంతో 7,977 పాయింట్ల వద్ద ముగిశాయి. గత శుక్రవారం అమెరికా స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసిన ప్రభావంతో ఆసియా మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఈ ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్ కూడా నష్టాల్లోనే మొదలైంది.
ఇటీవల పెరిగిన షేర్లలో లాభాల స్వీకరణ కారణంగా మరింతగా నష్టపోయింది. ఒక దశలో 246 పాయింట్ల వరకూ నష్టపోయింది. మధ్యాహ్నం తర్వాత కొనుగోళ్ల జోరుతో స్వల్పంగా లాభపడింది. కానీ చివరకు 26 పాయింట్ల నష్టంతో 26,193 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ మొత్తం 260 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. రూపాయి బలపడడం,రేట్ల కోత ఆశలు సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చాయని హెమ్ సెక్యూరిటీస్ డెరైక్టర్ గౌరవ్ జైన్ చెప్పారు. 30 సెన్సెక్స్ షేర్లలో 17 షేర్లు నష్టాల్లో ముగిశాయి. 1,604 షేర్లు లాభాల్లో, 1,032 షేర్లు నష్టాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.2,358 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ నగదు విభాగంలో రూ.14,732 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.2,90,242 కోట్లుగా నమోదైంది.