ఫెడ్ రేట్ల పెంపు భయాలు..
- కరువు, రూపాయి పతనం ప్రభావం
- నష్టాల్లో సెన్సెక్స్-30, నిఫ్టీ-50
ముంబై: అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉండడం, ప్రత్యేకించి అమెరికా ఫెడ్ వడ్డీరేట్లు పెంచుతుందన్న భయాలు జీడీపీ గణాంకాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్ సోమవారం ఆద్యంతమూ తీవ్రమైన ఒడిదుడుకులకు గురై నష్టాల్లో ముగిసింది. వీటికి వర్షాభావ కష్టాలు, రూపాయి పతనం, లాభాల స్వీకరణ కూడా తోడవడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 109 పాయింట్లు నష్టపోయి 26,283 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 31 పాయింట్లు నష్టపోయి 7,971 పాయింట్ల వద్ద ముగిశాయి. విద్యుత్, రియల్టీ, ఇన్‌ఫ్రా, క్యాపిటల్ గూడ్స్, వాహన షేర్లు నష్టపోయాయి. ఫార్మా షేర్లు లాభపడ్డాయి.
అధ్వాన ఆగస్టు: నెలవారీగా చూస్తే ఆగస్టు నెలలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 1,831 పాయింట్లు(6.51 శాతం), ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 562 పాయింట్లు(6.58 శాతం) చొప్పున పతనమయ్యాయి. 2011 నవంబర్ తర్వాత ఒక నెలలో ఈ స్థాయిలో సెన్సెక్స్ నష్టపోవడం ఇదే మొదటిసారి. ఇక విదేశీ ఇన్వెస్టర్ల నికర అమ్మకాల విషయంలో కూడా గత నెల రికార్డ్ సృష్టించింది. గత నెలలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.17,000 కోట్ల నికర అమ్మకాలు జరిపారు. ఒక నెలలో విదేశీ ఇన్వెస్టర్లు ఈ స్థాయిలో నికర అమ్మకాలు జరపడం ఇది రికార్డ్ స్థాయి.
మ్యాట్రిక్స్ ఐపీఓకు సెబీ ఓకే
న్యూఢిల్లీ: అంతర్జాతీయ సిమ్ కార్డ్‌నందించే మ్యాట్రిక్స్ సెల్యులర్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత్ నుంచి విదేశాలకు వెళ్లే పర్యాటకులకు మ్యాట్రిక్స్ సెల్యులర్ కంపెనీ వివిధ దేశాల సిమ్‌కార్డ్‌లను , వాయిస్, డేటా, ఎస్‌ఎంఎస్ సర్వీసులను మ్యాట్రిక్స్ బ్రాండ్ కింద అందజేస్తోంది. కాగా ఈ ఏడాది ఇప్పటిరవకూ సెబీ 26 కంపెనీల ఐపీఓలకు అనుమతులిచ్చింది.వీటిల్లో 13 కంపెనీలు ఐపీఓకు వచ్చాయి.