జీఎస్టీపై ఫెడ్ ఆసక్తికర అధ్యయనం
న్యూఢిల్లీ : దేశమంతటిన్నీ ఒకే పన్ను విధానంలోకి తీసుకొస్తూ ఎంతో ప్రతిష్టాత్మకమైన జీఎస్టీ అమలుకు ప్రభుత్వం శరవేగంగా ముందుకెళ్తోంది. ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లోనూ జీఎస్టీకి సంబంధించిన నాలుగు అనుబంధ బిల్లులను ప్రభుత్వం ఆమోదింపజేసింది. జూలై 1తో దేశమంతా ఏకీకృత విధానంలోకి వచ్చేస్తుంది. ఈ నేపథ్యంలో జీఎస్టీ అమలు ఆర్థికవ్యవస్థకు ఏ మేర లాభాలను చేకూర్చిపెడుతుందో వెల్లడిస్తూ అమెరికా సెంట్రల్ బ్యాంకు ఓ అధ్యయన నోట్ను విడుదల చేసింది. దీనిలో జీఎస్టీ అమలు భారత్ జీడీపీకి 4.2 శాతం బూస్ట్ ఇస్తుందని లేదా ఆరున్నర లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జించిపెడుతుందని తెలిసింది. ఈ మొత్తం కేంద్రప్రభుత్వం వార్షిక రుణాలకు ఎక్కువని వెల్లడైంది. అయితే జీఎస్టీ అమలుతో జీడీపీ 1-2 శాతం మాత్రమే పెరుగుతుందని కేంద్రప్రభుత్వానికి చెందిన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనామిక్ రీసెర్చ్( ఎన్సీఏఈఆర్) అంచనావేసింది. ఈ రీసెర్చ్ సంస్థకు ప్రస్తుత అధ్యక్షుడిగా నందన్ నిలేకని వ్యవహరిస్తున్నారు.
జీఎస్టీ మొత్తంగా భారత సంక్షేమాన్ని పెంచుతుందని, అన్ని రాష్ట్రాల వెల్ఫేర్ను మెరుగుపరుస్తుందని అంచనావేస్తున్నామని ఫెడ్ అధ్యయన పేపర్ పేర్కొంది. అదేవిధంగా జీఎస్టీ అంతర్గత వాణిజ్య ఆటుపోట్లను తొలగిస్తుందని, ఇంటర్నల్ ట్రేడ్ను 29 శాతం పెంచుతుందని ఫెడరల్ అనాలసిస్ పేర్కొంది. ఇది భారత కంపెనీల మధ్య అంతర్జాతీయ పోటీతత్వాన్ని పెంచి, కంపెనీ బయటి వాణిజ్య 32 శాతానికి విస్తరింపజేస్తుందని తెలిపింది. దీంతో తయారీ ఉత్పత్తి 14 శాతం పెరుగుతుందని ఫెడరల్ అనాలసిస్ అంచనావేస్తోంది. ఎవా వాన్ లీమ్పుట్, ఎల్లెన్ ఎ వైన్స్క్ రచయితలు ఈ అనాలసిస్ రిపోర్టును రూపొందించారు.