ఈ షేర్లు నిజంగా చౌకేనా? | Less than the book value of shares trading weak | Sakshi
Sakshi News home page

ఈ షేర్లు నిజంగా చౌకేనా?

Published Mon, Feb 22 2016 1:15 AM | Last Updated on Sun, Sep 3 2017 6:07 PM

ఈ షేర్లు నిజంగా చౌకేనా?

ఈ షేర్లు నిజంగా చౌకేనా?

బుక్ వ్యాల్యూ కన్నా తక్కువకే ట్రేడవుతున్న షేర్లు
పీఎస్‌యూ బ్యాంకులన్నిటిదీ అదే తీరు
మెటల్స్, ఇన్‌ఫ్రా, హౌసింగ్ షేర్లదీ అదే బాట
పతనాన్ని తప్పించుకున్న కొన్ని ప్రైవేటు బ్యాంకులు
అన్నిటినీ బుక్ వ్యాల్యూతోనే అంచనా వేయొద్దు: నిపుణులు


సాక్షి, బిజినెస్ విభాగం: ఈ మధ్య స్టాక్ మార్కెట్ పతనం మామూలుగా లేదు. సెన్సెక్స్, నిఫ్టీలు వాటి గరిష్ట స్థాయిల నుంచి చూస్తే ఏకంగా 20 శాతానికిపైగా పతనమై బేర్ మార్కెట్లోకి జారిపోయాయి.

ప్రతి పతనం కొనుగోళ్లకు గొప్ప అవకాశమని చెబుతారు తెలివైన ఇన్వెస్టర్లు. ఇతర ఇన్వెస్టర్లకు భిన్నంగా వారు మార్కెట్లు తక్కువ స్థాయిలో ఉన్నపుడే షేర్లు కొంటారు. పెరుగుతున్నపుడు అమ్మేసి లాభాలు సంపాదిస్తారు. కానీ అందరూ ఇలా చేయలేరు. ఒకవేళ మార్కెట్లు తక్కువ స్థాయిలో ఉన్నా మనం కొన్న షేర్లు పెరగాలని లేదు కదా? అలాంటి పరిస్థితుల్లో ఏ షేర్లు కొంటే మంచిది?
మంచి షేర్లను కనిపెట్టడమెలా? ఇలా ఆలోచించేవారు ప్రధానంగా చూసే అంశాల్లో బుక్‌వ్యాల్యూ ఒకటి. ప్రస్తుతం బ్యాంకులు, లోహ షేర్లు, ఇన్‌ఫ్రా- రియల్టీ షేర్లు వాటి బుక్ వ్యాల్యూ కన్నా తక్కువకే ట్రేడవుతున్నాయి. అసలు బుక్ వ్యాల్యూ అంటే ఏంటి? ఈ రంగాల షేర్లు ఎందుకు బుక్‌వ్యాల్యూ కన్నా తక్కువకు ట్రేడవుతున్నాయి? మున్ముందు ఈ షేర్ల పరిస్థితేంటి? ఇపుడు వీటిని కొనొచ్చా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే ఈ వారం ప్రాఫిట్ ప్లస్ ప్రధాన కథనం...


ఏడాది కిందట రూ.300పైగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేరు ఇపుడు అందులో సగం ధరకే దొరుకుతోంది. పతనానికి ఇది జస్ట్ ఒక ఉదాహరణ మాత్రమే. ఇదే కాదు. స్టాక్ మార్కెట్లో మొత్తం 24 ప్రభుత్వ రంగ బ్యాంకులు లిస్టవగా... వాటిలో ఒక్కటి కూడా వాటి పుస్తక విలువకన్నా ఎక్కువకు ట్రేడ్ కావటం లేదు. ప్రైవేటు బ్యాంకుల్లో మాత్రం కొన్ని బుక్‌వ్యాల్యూ కన్నా ఎక్కువ ధరకే ట్రేడవుతున్నాయి. ఇక లోహ, రియల్టీ, ఇన్‌ఫ్రా, హౌసింగ్ రంగాలదీ అదే పరిస్థితి. నిజానికి ఐటీ, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ రంగాలు మినహా ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే చాలా రంగాల పనితీరు పేలవంగా ఉంది.
 
ఈ పతనానికి కారణాలేంటి?
షేరు ధర దాని పుస్తక విలువకంటే తక్కువకు ట్రేడవటానికి కారణాలు చాలా ఉంటాయి. కంపెనీ భవిష్యత్ పట్ల ఇన్వెస్టర్లకు విశ్వాసం లోపించడం ప్రధాన కారణం. కంపెనీ పనితీరు బాగోదన్న అంచనాలతో దాని షేరు పడిపోయి పుస్తక విలువకన్నా తక్కువకు ట్రేడవుతుంది. కం పెనీ తన పుస్తక విలువను పెంచుకోవడానికి ఖాతాల్లో కొన్ని విధానాల్ని అవలంబిస్తున్నదన్న ఇన్వెస్టర్ల అంచనాలూ షేరు ధర పుస్తక విలువకంటే తక్కువ ఉండటానికి మరో కారణం.

కొన్ని సందర్భాల్లో ఆ కంపెనీ తాలూకు రంగం బాగులేనట్లయితే... ఆ కంపెనీ పనితీరు బాగున్నా సరే షేరు విలువ తక్కువే ఉండొచ్చు. ఇప్పుడు ప్రభుత్వ బ్యాంకులు, మెటల్స్, ఇన్‌ఫ్రా, రియల్ట్లీ షేర్లు.. కంపెనీల పనితీరుతో సంబంధం లేకుండా పుస్తక విలువకంటే దిగువకు రావటానికి కారణమిదే.
 
అన్నింటిలో విలువ ఉన్నట్లేనా?....
సాధారణంగా బుక్ వ్యాల్యూ కన్నా తక్కువకు ట్రేడవుతున్న షేర్లను ఫండమెంటల్స్ ప్రకారం చౌకగా పరిగణి స్తారు. ఈ సూత్రాన్ని  రెండు, మూడు దశాబ్దాల క్రితం అన్ని షేర్లకూ వర్తింపచేసేవారు. విదేశీ ఇన్వెస్టర్లు  పెద్ద ఎత్తున ప్రవేశించకముందు చాలా షేర్ల విలువలు అవి ఉండాల్సిన మార్కెట్ విలువలకంటే తక్కువగా ట్రేడవుతుండేవి. లాభాలకు అప్పుడు కేవలం పుస్తక విలువ సూత్రాన్ని అనుసరించారు. ఇప్పుడలా కాదు.

ఎన్నో రకాల సంస్థలు, ఫండ్స్, ధనిక ఇన్వెస్టర్లు, రీసెర్చ్ సంస్థలు మార్కెట్లో పాలుపంచుకుంటూ అధిక షేర్లను జల్లెడ పట్టేశాయి. విలువ ఉందని తెలిస్తే అతివేగంగా దాన్ని అమాంతం పెంచేయటం, లేదని గ్రహిస్తే క్షణాల్లో దించేయడం జరిగిపోతోంది. దీంతో పుస్తక విలువకన్నా తక్కువకు ట్రేడవుతున్న షేర్లన్నిటిలోనూ విలువ ఉందని భావించలేం. కానీ మార్కెట్ పడినపుడు, పెరిగినపుడు ఆ హెచ్చుతగ్గులు అతిగా ఉంటాయి. దాంతో పుస్తక విలువ కిందకు జారిపోవడం సహజం. అందుకే బుక్ వేల్యూను చూసేటపుడు దాని భవిష్యత్ వ్యాపార విలువకంటే అది తక్కువకు ట్రేడవుతోందా? అన్నది గమనించాలి. అంటే.. బుక్ వ్యాల్యూనే కాకుండా కంపెనీ రాబడుల రికార్డు, భవిష్యత్ వ్యాపార అవకాశాలు కూడా పరిశీలించాలి.
 
కొన్ని ఆస్తుల విలువ తగ్గొచ్చు కూడా...
ఆయా రంగాల్లో వచ్చిన మార్పులకు అనుగుణంగా కంపెనీయే స్వయంగా దాని ఆస్తుల విలువను హఠాత్తుగా పుస్తకాల్లో తగ్గించడం, లేదా రద్దుపర్చడం చేయొచ్చు. అలాంటపుడు దాని పుస్తక విలువ పడిపోతుంది. ఉదాహరణకు టాటా స్టీల్...బ్రిటన్ ఉక్కు కంపెనీ కోరస్‌ను, వేదాంతా లిమిటెడ్, చమురు కంపెనీ కెయిర్న్ ఇండియాను గతంలో కొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉక్కు, చమురు ధరలు పతనం కావడంతో టాటా స్టీల్, వేదాంతాలు వాటి బుక్స్‌లో చూపిస్తున్న కోరస్, కెయిర్న్ ఆస్తి విలువల్ని భారీగా తగ్గించేశాయి.
 
పీఈ విలువ అనూహ్యంగా మారినపుడు...
ఫండమెంటల్స్ ప్రకారం కంపెనీ షేరు విలువను కొలవడానికి ఉపయోగించే మరో సాధనం పీఈ (ప్రైస్ టు ఎర్నింగ్స్). ఒక్కో షేరుకు కంపెనీ ఆర్జించే లాభం (ఈపీఎస్)తో పోలిస్తే ప్రస్తుత షేరు ధర ఎంతుందో తెలిపేదే పీఈ. కొన్ని సందర్భాల్లో మారిన పరిస్థితులవల్ల ఒక కంపెనీకి నష్టం రావొచ్చు. లాభాలు పడిపోవొచ్చు. అపుడు షేరు పీఈ పెరుగుతుంది.

అంటే పీఈ సూత్రం ప్రకారం అది ఖరీదైపోయిందని లెక్క. అపుడు పీఈని కాక పుస్తక విలువను పరిగణనలోకి తీసుకుని, షేరు కొనాలా... వద్దా అనేది నిర్ణయించుకోవచ్చు. ఎక్కువ మూలధనాన్ని ఉపయోగించి, వ్యాపారం చేసే కంపెనీల రాబడులు తొలుత తక్కువ ఉంటాయి. నెమ్మదిగా పెరుగుతాయి. అలాంటి కంపెనీల షేర్ల విలువను గుర్తించేందుకు పీఈకంటే పుస్తక విలువ బాగా ఉపకరిస్తుంది. టాటా స్టీల్, సెయిల్, ఎస్‌బీఐ వంటివి ఈ కోవలోకే వస్తాయి.
 
పుస్తక విలువ అంటే...
కంపెనీ ఆస్తుల్లోంచి, అప్పుల్ని, గుడ్‌విల్, పేటెంట్స్ వంటి కనిపించని ఆస్తుల్ని తీసివేయగా వచ్చే విలువనే కంపెనీ పుస్తక విలువగా పరిగణిస్తారు. అంటే...కంపెనీ ఖాతా పుస్తకాల్లో దానికి నికరంగా ఉన్న ఆస్తుల విలువన్న మాట. కంపెనీ పుస్తక విలువను ఆ కంపెనీ తాలూకు మొత్తం షేర్ల సంఖ్యతో భాగిస్తే వచ్చేదే కంపెనీ షేరు పుస్తక విలువ. దీనికంటే ట్రేడవుతున్న షేరు ధర తక్కువగా ఉంటే దాని ప్రైస్ టు బుక్ వ్యాల్యూ 1 కంటే దిగువనున్నట్లు. బీఎస్‌ఈ-500 ఇండెక్స్‌లో మూడోవంతు షేర్ల బుక్ వ్యాల్యూ ప్రస్తుతం 1 కంటే తక్కువే ఉంది మరి.  
 
పుస్తక విలువకంటే ఎక్కువ ఉన్నంత మాత్రాన..
కొన్ని కంపెనీల షేర్లు పుస్తక విలువకంటే బాగా ఎక్కువగా వుంటాయి. అంతమాత్రాన వాటిలో విలువ లేదని చెప్పలేం. ఐటీ, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ రంగాల్లోని కంపెనీలకు మూలధన అవసరాలు తక్కువ. అందుకని వాటి పుస్తక విలువలకన్నా చాలా ఎక్కువకు అవి ట్రేడవుతూ ఉంటాయి. ఐటీసీ వంటి కంపెనీ షేరు ధర దాని పుస్తక విలువతో పోలిస్తే 8 రెట్లుంది. వాటిని పుస్తక విలువతో కాకుండా భవిష్యత్ వ్యాపారం, భవిష్యత్ ఆర్జన, పీఈ వంటి సాధనాలతో అంచనా వేయాలి.
 
ఏదైనా పరిశ్రమకు చక్రగతిన ఏర్పడే వ్యాపార ఒడిదుడుకుల కారణంగా ఆ పరిశ్రమ మొత్తం కుదేలైపోతుంది. దాంతో ఆ పరిశ్రమకు చెందిన కంపెనీల షేర్లు వాటి పుస్తక విలువకంటే తక్కువకు ట్రేడ్‌కావొచ్చు. ప్రస్తుతం పీఎస్‌యూ బ్యాంకింగ్, రియల్టీ, క్యాపిటల్ గూడ్స్, ఇన్‌ఫ్రా, మెటల్ కంపెనీల పరిస్థితి అలానే వుంది. భవిష్యత్తులో ఆయా రంగాలు కోలుకుంటే ఆయా షేర్లు బాగా పెరుగుతాయి
 - మూర్తి గరిమెళ్ళ, స్టాక్ ఎనలిస్ట్
 
ఇతర ఫండమెంటల్స్ అన్నీ సక్రమంగా వుండి, షేరు దాని పుస్తక విలువకంటే తక్కువకు ట్రేడవుతుంటే..ఆ కంపెనీ షేరు విలువ వుండాల్సిన స్థాయిలో లేదని అర్థం. డిస్కౌంట్ ధరకు ఆ షేరును స్వంతం చేసుకోవడానికి మంచి చాన్స్.
- పంకజ్ పాండే, రీసెర్చ్ హెడ్ ఐసీఐసీఐ డెరైక్ట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement