మొండిబాకీలు తగ్గాయ్‌.. | Asset quality outlook 'stable'; NPAs down: Yes Bank | Sakshi
Sakshi News home page

మొండిబాకీలు తగ్గాయ్‌..

Published Tue, Oct 2 2018 12:38 AM | Last Updated on Tue, Oct 2 2018 12:38 AM

Asset quality outlook 'stable'; NPAs down: Yes Bank - Sakshi

ముంబై: గడిచిన ఏడాది కాలంగా మొండిబాకీలు గణనీయంగా తగ్గాయని, అసెట్‌ క్వాలిటీ అంచనాలు స్థిర స్థాయిలోనే ఉన్నాయని ప్రైవేట్‌ రంగ యస్‌ బ్యాంక్‌ వెల్లడించింది. ‘గడిచిన కొద్ది రోజులుగా బ్యాంకు అసెట్‌ క్వాలిటీ గురించి కొన్ని నిరాధార ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చిన సంగతి మేనేజ్‌మెంట్‌ దృష్టికి వచ్చింది. అయితే, అలాంటి పరిస్థితేమీ లేదని అసెట్‌ క్వాలిటీ స్థిరంగానే ఉందని యాజమాన్యం స్పష్టం చేయదల్చుకుంది‘ అని స్టాక్‌ ఎక్సే్చంజీలకు బ్యాంకు తెలియజేసింది.

ఇక లిక్విడిటీ కూడా తగినంత స్థాయిలోనే ఉందని, ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 నాటికి లిక్విడిటీ కవరేజీ నిష్పత్తి 101 శాతంగా ఉందని పేర్కొంది. సెప్టెంబర్‌ 30 నాటికి స్థూల మొండిబాకీలు 1.82 శాతం నుంచి 1.35 శాతానికి తగ్గినట్లు వివరించింది. అదే సమయంలో రుణాలు 61.5 శాతం వృద్ధితో రూ. 2.40 లక్షల కోట్లకు చేరినట్లు, డిపాజిట్లు 41 శాతం పెరుగుదలతో రూ. 2.23 లక్షల కోట్లకు పెరిగినట్లు యస్‌ బ్యాంక్‌ పేర్కొంది. 

వరుసగా రెండేళ్ల పాటు దాదాపు రూ.10,000 కోట్ల మొండిబాకీలను (ఎన్‌పీఏ) వెల్లడించకుండా కప్పిపెట్టి ఉంచిందంటూ యస్‌ బ్యాంక్‌ను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆక్షేపించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు బ్యాంక్‌ ఎండీ, సీఈవో రాణా కపూర్‌ పదవీ కాలాన్ని 2019 జనవరికి మాత్రమే కుదించింది. ఈ పరిణామాల దరిమిలా బ్యాంకు షేరు దాదాపు 40 శాతం మేర పతనమైంది. అటు యస్‌ బ్యాంక్‌ డెట్‌ సాధనాలను ప్రత్యేక పరిశీలనలో ఉంచినట్లు కేర్‌ రేటింగ్స్‌ వెల్లడించింది.

త్వరలోనే సెర్చి కమిటీ...
రాణా కపూర్‌ స్థానంలో కొత్త సీఈవోను అన్వేషించేందుకు ఏర్పాటు చేస్తున్న సెర్చి(అన్వేషణ) కమిటీలో ఇద్దరు బయటి వ్యక్తులు సభ్యులుగా ఉంటారని, అక్టోబర్‌ 7 నాటికల్లా వీరిని ఖరారు చేయడం జరుగుతుందని యస్‌ బ్యాంక్‌ వెల్లడించింది. అంతర్జాతీయ లీడర్‌షిప్‌ అడ్వైజరీ సంస్థ ఈ కమిటీకి సహాయ సహకారాలు అందిస్తుందనికూడా పేర్కొంది. సంస్థలో ఉద్యోగులతో పాటు బయటి వారిని కూడా సీఈవో పదవి కోసం పరిశీలించనున్నట్లు బ్యాంకు తెలియజేసింది.

దీర్ఘకాలిక వారసత్వ ప్రణాళికను సిద్ధం చేసుకునే క్రమంలో బ్యాంక్‌ ఇప్పటికే ఇద్దరు సీనియర్‌ గ్రూప్‌ ప్రెసిడెంట్స్‌ రజత్‌ మోంగా, ప్రళయ్‌ మోండాల్‌ను ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లుగా ప్రమోట్‌ చేసింది. ఇందుకోసం ఆర్‌బీఐ అనుమతులు కోరినట్లు యస్‌ బ్యాంక్‌ పేర్కొంది. కాగా, సోమవారం యస్‌ బ్యాంక్‌ షేరు బీఎస్‌ఈలో దాదాపు 9.68 శాతం పెరిగి రూ.201.20 వద్ద ముగిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement