న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగంలోని యాక్సిస్ బ్యాంక్ ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 38 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.319 కోట్లుగా ఉన్న బ్యాంక్ నికర లాభం ఈ క్యూ2లో రూ.432 కోట్లకు ఎగసిందని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది.
మొండి బకాయిలు బాగా పెరగడం, లెక్కలో చూపని మొత్తాలను ఆర్‌బీఐ కనిపెట్టడం వంటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ, లో బేస్ ఎఫెక్ట్ వల్ల ఈ బ్యాంక్ నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని నిపుణులంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో ఈ బ్యాంక్ రూ.1,305 కోట్ల నికర లాభం సాధించింది. ఈ క్యూ2లో మొత్తం ఆదాయం రూ.13,699 కోట్ల నుంచి రూ.13,821 కోట్లకు పెరిగిందని బ్యాంక్ తెలిపింది.
మరింత అధ్వానంగా రుణ నాణ్యత...
అగ్రశ్రేణి మూడు ప్రైవేట్ బ్యాంక్‌ల్లో ఈ బ్యాంక్‌కే అధికంగా మొండి బకాయిలు ఉన్నాయి. స్థూల మొండి బకాయిలు రూ.16,379 కోట్ల నుంచి రూ.27,402 కోట్లకు, అలాగే నికర మొండి బకాయిలు రూ.8,926 కోట్లకు ఎగిశాయని బ్యాంక్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జైరామ్ శ్రీధరన్ చెప్పారు. శాతాల పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు 4.17% నుంచి 5.90%కి, అలాగే నికర మొండి బకాయిలు 2.02% నుంచి 3.12%కి ఎగిశాయని పేర్కొన్నారు.
రానున్న రెండు క్వార్టర్లలో రుణ నాణ్యతపై మరింత ఒత్తిడి తప్పదని, వచ్చే ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగం నుంచి పరిస్థితులు మెరుగుపడే అవకాశాలున్నాయని తెలిపారు. నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) రూ.4,514 కోట్ల నుంచి స్వల్పంగా పెరిగి రూ.4,540 కోట్లకు చేరిందని, నికర వడ్డీ మార్జిన్ 3.45%గా నమోదైందని వివరించారు. ఆర్‌బీఐ ఇటీవల విడుదల చేసిన రెండు మొండి బకాయిల జాబితాల్లో తమ బ్యాంక్‌కు చెందిన రూ.7,041 కోట్ల ఖాతాలున్నాయని వివరించింది.
మరోవైపు తొమ్మిది ఖాతాల్లో రూ.4,800 కోట్ల అక్రమ మళ్లింపును ఆర్‌బీఐ గుర్తించిందని, వీటిని మొండి బకాయిలుగా పరిగణించాలని ఆదేశించిందని వివరించారు. ఈ ఖాతాల కోసం ఈ క్యూ2లో రూ.505 కోట్ల కేటాయింపులు జరిపామని, దీంతో ఈ మొండి పద్దుల కోసం మొత్తం కేటాయింపులు రూ.3,886 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. మార్కెట్ ముగిసిన తర్వాత ఆర్థిక ఫలితాలు వచ్చాయి. అయినప్పటికీ, బీఎస్‌ఈలో యాక్సిస్ బ్యాంక్ షేర్ 1.4 శాతం నష్టపోయి రూ.513కు పడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment