న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ బ్యాలన్స్‌షీట్ అత్యంత పటిష్టంగా ఉన్నట్లు తాజాగా స్పష్టం చేసింది. గ్రూప్‌లోని వివిధ బిజినెస్‌లను వృద్ధి బాటలో కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించింది. తద్వారా బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూప్‌పట్ల ఇన్వెస్టర్లకు విశ్వాసాన్ని పెంపొందించేందుకు చూస్తోంది. ఇటీవల యూఎస్ షార్ట్‌సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ ఆరోపణల కారణంగా గ్రూప్‌లోని లిస్టెడ్ కంపెనీలలో అమ్మకాలు ఊపందుకున్న సంగతి తెలిసిందే.
దీంతో గత మూడు వారాల్లో గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)కు 125 బిలియన్ డాలర్లమేర కోత పడింది. అయితే గ్రూప్ లోని ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఈ ఏడాది మూడో త్రైమాసికం(అక్టోబర్–డిసెంబర్)లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో షేరు తిరిగి బలాన్ని పుంజుకోవడం గమనార్హం! అంతర్గత నియంత్రణలు, నిబంధనల అమలు, కార్పొరేట్ గవర్నెన్స్ వంటి అంశాలపై నమ్మకంగా ఉన్నట్లు కంపెనీ ఫలితాల విడుదల సందర్భంగా గ్రూప్ సీఎఫ్‌వో జుగెషిందర్ సింగ్ స్పష్టం చేశారు. ఈ బాటలో.. తగినన్ని నగదు నిల్వలు కలిగి ఉన్నట్లు, రుణాల రీఫైనాన్స్ సామర్థ్యాలను కలిగి ఉన్నట్లు గ్రూప్ విడిగా తెలియజేసింది.
తాత్కాలికమే..
అదానీ గ్రూప్ బ్యాలన్స్‌షీట్ అత్యంత పటిష్టంగా ఉన్నట్లు సింగ్ తాజాగా పేర్కొన్నారు. పరిశ్రమలోనే అత్యున్నత అభివృద్ధి సామర్థ్యాలను కలిగి ఉన్నట్లు తెలియజేశారు. మెరుగైన కార్పొరేట్ గవర్నెన్స్, పటిష్ట క్యాష్‌ఫ్లో, హామీగల ఆస్తులున్నట్లు వివరించారు. ప్రస్తుత మార్కెట్ ఒకసారి నిలకడను సాధిస్తే తిరిగి తమ క్యాపిటల్ మార్కెట్ వ్యూహాలను సమీక్షించనున్నట్లు వెల్లడించారు. వాటాదారులకు అత్యుత్తమ రిటర్నులు అందించగల బిజినెస్‌లను కొనసాగించడానికి కట్టుబడి ఉన్నట్లు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment