అనుబంధ బ్యాంకుల విలీనంతో..త్వరలోమెగాఎస్బీఐ!
♦ ప్రతిపాదనను ఆమోదిస్తామని చెప్పిన ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ
♦ ఎన్‌పీఏల పరిష్కారమే తొలి ప్రాధాన్యమని స్పష్టీకరణ
♦ ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థల అధిపతులతో సమావేశం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో ఐదు అనుబంధ బ్యాంకులు సహా భారతీయ మహిళా బ్యాంక్ (బీఎంఐ) విలీన ప్రక్రియ ఖాయమని కేంద్రం స్పష్టం చేసింది. దీన్ని త్వరలో ఆమోదించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టంచేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని పటిష్ఠపరచటం, వాటి మొండి బకాయిల సమస్యల్ని పరిష్కరించటం, వాటికి సాధికారత కల్పించటం లక్ష్యాలుగా కేంద్రం పనిచేస్తున్నట్లు చెప్పారాయన.
సోమవారమిక్కడ ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల సీఎండీలతో బ్యాంకింగ్ రంగ త్రైమాసిక పనితీరును ఆయన సమీక్షించారు. ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హాతో సహా పలువురు సీనియర్ అధికారులతో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ఎప్పటిలోగా ఎస్‌బీఐ విలీన ప్రక్రియకు ఆమోద ముద్ర వేస్తారు?’’ అని అడిగిన ప్రశ్నకు జైట్లీ సమాధానమిస్తూ... ‘త్వరలో ఈ నిర్ణయం తీసుకుంటామని భావిస్తున్నాం’ అన్నారు.
విలీనమైతే... అంతర్జాతీయ బ్యాంకుగా!!
విలీన ప్రతిపాదనలో ఉన్న బ్యాంకుల్లో భారతీయ మహిళా బ్యాంకుతో పాటు ఎస్‌బీఐకి చెందిన 5 అనుబంధ బ్యాంకులు- స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్‌లు ఉన్నాయి. వీటిల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్‌లు స్టాక్‌మార్కెట్‌లో లిస్టయ్యాయి. 2008లో ఎస్‌బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్రను తొలిసారిగా విలీనం చేసుకుంది. రెండేళ్ల తరువాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్ విలీనమైంది.
ప్రస్తుతం ఎస్‌బీఐ బ్యాంక్ బ్యాలెన్స్‌షీట్ పరిమాణం రూ.28 లక్షల కోట్లు. ఈ విలీనాలు పూర్తయితే 50 కోట్ల కస్టమర్లతో ఎస్‌బీఐ బ్యాంకు పరిమాణం రూ.37 లక్షల కోట్లకు చేరుతుంది. రుణ సమీకరణ వ్యయం బాగా తగ్గుతుందని ఇప్పటికే ఎస్‌బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య తెలిపారు. మొత్తంమీద ఈ విలీనం జరిగితే 22,500 బ్రాంచీలు, 58,000 ఏటీఎంల నెట్‌వర్క్‌తో ఎస్‌బీఐ అంతర్జాతీయ స్థాయి బ్యాంకుగా మారుతుంది. ప్రస్తుతం ఎస్‌బీఐకి 36 దేశాల్లో 191 విదేశీ కార్యాలయాలున్నాయి. దేశంలో 16,500 బ్రాంచీలున్నాయి. విలీన ప్రక్రియకు రూ.3,000 కోట్లు ఖర్చవుతుందని భట్టాచార్య తెలిపారు. అయితే ఉద్యోగ సంఘాలు ఈ ప్రతిపాదనకు తీవ్ర అభ్యంతరం చెబుతున్నాయి.
బ్యాంకుల విలీనాలే ప్రభుత్వం విధానం: సమావేశం సందర్భంగా విలేకరులతో మాట్లాడిన జైట్లీ... బ్యాంకింగ్‌లో విలీనమే ప్రభుత్వ విధానమన్నారు. బడ్జెట్‌లోనూ ఇదే విషయాన్ని చెప్పామని గుర్తుచేశారు. ‘‘తొలి ప్రాధాన్యత మొండిబకాయిల సమస్య పరిష్కారమే. ఆ తర్వాతే విలీనాలను పరిశీలిస్తాం. మొండిబకాయిలకు భారీ ప్రొవిజనింగ్ కేటాయించాల్సి రావడం వల్ల దాదాపు 12 బ్యాంకులకు రూ.18,000 కోట్ల నష్టాలొచ్చాయి. కాబట్టి బడ్జెట్‌లో కేటాయించిన రూ.25,000 కోట్ల మూలధనానికి అదనంగా మరింత ఇవ్వటానికి మేం సిద్ధంగా ఉన్నాం. మొత్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.1.40 లక్షల కోట్ల నిర్వహణా లాభాలను ఆర్జించాయి. ఇది బ్యాంకింగ్ సత్తాకు నిదర్శనం. మొండిబకాయిల సమస్యపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చేసే సిఫారసులను కేంద్రం పరిశీలిస్తుంది’’ అని జైట్లీ వివరించారు. త్వరలో అమల్లోకి రానున్న దివాలా చట్టం మొండి బకాయిల సమస్య పరిష్కారంలో కీలకపాత్ర పోషిస్తుందని ఆయన తెలియజేశారు.
కేబినెట్ నోట్ సిద్ధం!
ఉన్నతస్థాయి వర్గాల సమాచారం ప్రకారం- ఎస్‌బీఐ విలీన ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే కేబినెట్ నోట్ సిద్ధమైంది. ఈ నెల చివర్లో కేబినెట్ చర్చించి సానుకూల నిర్ణయం తీసుకునే వీలుంది. లిస్టయిన ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల విలీన ప్రతిపాదన కూడా కొన్నాళ్లుగా అధికార వర్గాల పరిశీలనలో ఉంది. న్యూ ఇండియా అస్యూరెన్స్, నేషనల్ ఇన్సూరెన్స్, ఓరియెంటల్ ఇన్సూరెన్స్, యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్‌లు ఇందులో ఉన్నాయి.