సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని వివిధ రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు భారతీయ స్టేట్ బ్యాంకు సోమవారం అంటే, 2–4–2018 నుంచి ఎన్నికల బాండులను జారీ చేసే మలి ప్రక్రియను ప్రారంభించింది. ఈ ప్రక్రియ ఈ నెల పదవ తేదీ వరకు కొనసాగుతుంది. వివిధ కంపెనీలు, కార్పొరేట్ సంస్థలు నగదు కాకుండా చెక్కులు, ఇతర ఆన్‌లైన్ చెల్లింపుల ద్వారా ఏ మేరకైనా ఈ ఎన్నికల బాండులను తీసుకొని తమకు ఇష్టమైన రాజకీయ పార్టీకి విరాళంగా ఇవ్వవచ్చు. ఏ రాజకీయ పార్టీకి ఇస్తున్నది కంపెనీలు తమ ఫైళ్లలో రాసుకోవచ్చుగానీ బయటకు అంటే, ప్రభుత్వానికిగానీ ప్రజలకుగానీ వెల్లడించాల్సిన అవసరం లేదు. ఒక్క భారతీయ స్టేట్ బ్యాంకుకు మాత్రమే ఏ కంపెనీ, ఏ పార్టీకి ఎన్నికల బాండులను విరాళంగా ఇచ్చింది తెలుస్తుంది. అదీ బాండులు రియలైజ్ చేసుకున్నాకే. కావాలనుకుంటే ప్రభుత్వం బ్యాంకు నుంచి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది.
ఈ కారణంగా గత మార్చి ఒకటవ తేదీ నుంచి పదవ తేదీదాకా ఎన్నికల బాండుల జారీ తొలి ప్రక్రియను భారతీయ స్టేట్ బ్యాంకు చేపట్టగా ఏకంగా 222 కోట్ల రూపాయల మేరకు బాండులు జారీ అయ్యాయి. 2014, 2015, 2016 సంవత్సరాల్లో ఎన్నికల ట్రస్టులకు వచ్చిన విరాళాలకన్నా ఇది ఎంతో ఎక్కువ. ఒక్క 2017లో మాత్రం ఎన్నికల ట్రస్టీకి 325 కోట్ల రూపాయలు వెళ్లాయి. ఈ నెలతోపాటు జూలై, అక్టోబర్ నెలల్లో కూడా బాండులు జారీ చేస్తారు కనుక ఈ 325 కోట్ల విరాళాలను కూడా అధిగమించి ఎంతో ఎక్కువకు వెళ్లే అవకాశం ఉంది.
రాజకీయ విరాళాల్లో మరింత పారదర్శకతను తీసుకరావాలనే ఉద్దేశంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ ఎన్నికల బాండుల విధానాన్ని తీసుకొచ్చింది. ప్రతి ఏడాది జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ నెలల్లో ఒకటవ తేదీ నుంచి పదవ తేదీ వరకు ఎన్నికల బాండులను జారీ చేయాలని నిర్ణయించింది. అయితే అనివార్య కారణాల వల్ల ఈసారి జనవరి జారీ చేయాల్సిన బాండులను మార్చి నెలలో జారీ చేశారు. మరింత పారదర్శకత కోసం ఈ స్కీమ్‌ను తీసుకొస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2017 ఆర్థిక వార్శిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా చాలా గొప్పగా చెప్పుకున్నారు. వాస్తవానికి ఉన్న పారదర్శకత కూడా కొత్త విధానంలో లేకుండా పోయింది.
ఇదివరకు రాజకీయ పార్టీలకు విరాళాలను వసూలుచేసి పెట్టడానికీ ఎన్నికల ట్రస్టీలు ఉన్నాయి. ఆ ట్రస్టులు వివిధ కంపెనీలు, కార్పొరేట్ సంస్థల నుంచి విరాళాలు వసూలు చేసి పార్టీలకు అందజేసేవి. పార్టీలకు సొంతంగా ఎన్నికల ట్రస్టీలు ఉన్నా అవి బినామీ పేర్ల మీద ఉండేవి. అందుకని కొన్ని సందర్భాల్లో కార్పొరేట్ సంస్థలు తాము ఏ రాజకీయ పార్టీకి విరాళాలు ఇచ్చింది తెలిసేకాదు. కొన్ని స్వతంత్య్ర ట్రస్టులు ఒక్క పార్టీకి కాకుండా రెండు, మూడు పార్టీలకు కూడా విరాళాలు ఇచ్చేవి.
ఇప్పుడు ఏ రాజకీయ పార్టీకి విరాళాలు ఇవ్వాలో కార్పొరేట్ కంపెనీల ఇష్టం. పన్ను మిన హాయింపు ఉంటుంది. ఆ విరాళాల సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందో ఆదాయం పన్ను శాఖకు సూచిస్తే చాలు. ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం లేదు. ఈ కారణంగా కార్పొరేట్ సంస్థ తమకు పనులు చేసి పెట్టే రాజకీయ పార్టీకే విరాళాలు ఇస్తుంది. అంటే, అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకే విరాళాలు ఇచ్చే అవకాశం ఉంది. పారదర్శకత అంటే ఏ కంపెనీ, ఏ పార్టీకి, ఎంత విరాళం ఇస్తుందో ప్రజలకు తెలియాలి. అది తెలియనప్పుడు పారదర్శకత ఎక్కడ?
Comments
Please login to add a commentAdd a comment