రెండు సార్లు కేంద్రంలో అధికారాన్ని స్థాపించి, ముచ్చటగా మూడోసారి ఢిల్లీ సింహాసనాన్ని కైవసం చేసుకోవాలని చూస్తున్న బీజేపీ వ్యూహ, ప్రతివ్యూహాలు..ఎత్తుకు, పైఎత్తులతో ముందుకెళ్లేందుకు సిద్ధమైనట్లు పలు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.
ఇందులో భాగంగా ఇప్పటికే ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే పెట్రోల్ పంపులు, ప్రభుత్వ రంగ చమురు సంస్థల హోర్డింగ్‌లను తొలగించి వాటి స్థానంలో ప్రధాని మోదీ సారధ్యంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల హోర్డింగ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తేలింది.
హోర్డింగుల్లో ‘మోదీ కి గ్యారెంటీ’ నినాదం పేరుతో హోర్డింగ్‌లు వెలుస్తున్నాయని, వాటిల్లో మోదీ కి గ్యారెంటీ అంటే ‘మెరుగైన జీవితం’ అని తెలిపేలా ప్రభుత్వ ప్రధాన పథకం ఉజ్వల యోజన లబ్ధిదారులకు ప్రధానమంత్రి సిలిండర్ ఇస్తున్న ఫోటోలు ఉన్నట్లు పలు మీడియా ఔట్‌లెట్లు చెబుతున్నాయి.
హోర్డింగ్‌లు ప్రత్యక్షం
పెట్రోలియం - సహజవాయువు మంత్రిత్వ శాఖ నుండి అనధికారిక సమాచారం అంటూ పలు జాతీయ మీడియా సంస్థలు.. ‘మోదీ కి గ్యారెంటీ’ హోర్డింగ్‌లను ఉంచాలనే నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం సంస్థల హోర్డింగ్‌లలో మోదీ కి గ్యారెంటీ హోర్డింగ్‌లను డిస్‌ప్లే చేయనుంది. అయితే, ఎన్నికల సంఘం (ECI) సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన తర్వాత ఎన్నికల నిబంధనలు అమల్లోకి వచ్చిన వెంటనే ఆ హోర్డింగ్‌లు తొలగించనుంది ప్రభుత్వం.
టీఎంసీ ఫిర్యాదు
2021 మార్చిలో, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు, తృణమూల్ కాంగ్రెస్ నుండి వచ్చిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం పెట్రోల్ బంకుల్లో మోదీ చిత్రం ఉన్న అన్నీ హోర్డింగ్‌లను తొలగించాలని పెట్రోల్ బంకుల నిర్వహకులను కోరింది.
మోదీ కి గ్యారెంటీ బంపర్ హిట్
ఇటీవల జరిగిన రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరాం సహా ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ‘మోదీ కి గ్యారెంటీ’ అనే ఎన్నికల నినాదంతో ముందుకు వచ్చింది. ఎన్నికల్లో విజయ ఢంకా మోగించింది.
Comments
Please login to add a commentAdd a comment