ఎలక్టోరల్ బాండ్ స్కీమ్‌కి చెందిన తాజా వివరాల ప్రకటనతో, రాజకీయ విరాళాలను ప్రక్షాళన చేయడానికి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ చేపట్టిన చర్యలు తీవ్రమైన, విరుద్ధ స్పందనలను చూరగొన్నాయి. ఇది దీర్ఘకాలిక ప్రయోజనం కల్గించే పథకంలో తొలి చర్య అని జైట్లీ అభిమానులు పేర్కొనగా, జైట్లీ అసలు సమస్యను ఏమార్చుతున్నారని విమర్శకులు ఆరోపించారు.
కాబట్టి నిజం ఎక్కడ దాగినట్లు? జైట్లీ చర్యలను రెండు విధాలుగా పరీక్షించినట్లయితే, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం సులభం. మొదటిది, ఆ చర్యలు రాజకీయ విరాళాలను ప్రక్షాళన చేస్తాయా? మరోలా చెప్పాలంటే, చట్టబద్ధమైన, పన్ను చెల్లించిన విరాళాలే అధిక నిష్పత్తిలో ఉంటాయా? ఇక రెండోది. రాజకీయ విరాళాలను ఇవి మరింత పారదర్శకంగా చేస్తాయా? అంటే వాటి గురించిన వివరాలు మనందరికీ సమగ్రంగా తెలుపుతారా?
ఎక్కడినుంచైనా, ఎవరినుంచైనా సరే రాజకీయ పార్టీ నగదు రూపంలో తీసుకునే విరాళాలను రూ. 20,000ల నుంచి రూ. 2,000కు తగ్గించాలని తీసుకున్న నిర్ణయం ఏరకంగా చూసినా రాజకీయ విరాళాలను ప్రక్షాళన చేసే కీలక చర్యే అవుతుంది. సరిగ్గా ఎన్నికల కమిషన్ కూడా అడిగింది ఇదే. అయితే జాగ్రత్తగా ఆలోచించండి. అప్పుడు మీకు తట్టే సమాధానం కాస్త భిన్నంగా ఉండవచ్చు. రాజకీయ పార్టీలు ఇప్పటికీ రూ. 2,000ల వరకు విరాళాలను తీసుకోవచ్చు, పైగా అవి గుప్తంగానే ఉంటాయి. విరాళాలు ఇచ్చిన వారి పేర్లు ప్రకటించరు. కాబట్టి ఇకపై రాజకీయ పార్టీలకు నగదు రూపంలో పెద్ద మొత్తాల్లో విరాళాలు వచ్చినట్లయితే, అవి రూ. 2,000లకంటే తక్కువ మొత్తంలోనే వచ్చాయని ప్రకటించవలసిన అవసరముంది.
ఎందుకంటే నగదురూపంలోని విరాళాలను చట్టవిరుద్ధంగా ప్రకటించలేదు. పైగా విరాళాలు ఇచ్చిన వారి పేర్లు బయటపెట్టరు కాబట్టి నగదురూపంలో స్వీకరించిన మొత్తం మారకుండా అలాగే ఉంటుంది. ఆ విరాళాలు రూ. 2,000ల కంటే తక్కువ మొత్తం లోనే వచ్చాయని ఇకనుంచి రాజకీయ పార్టీలు ప్రకటించవచ్చు. ఇందులో రాజకీయ విరాళాలను ప్రక్షాళన చేయడమూ లేదు. దీనిలో ఎలాంటి పారదర్శకతా లేదు. జైట్లీ ప్రకటించిన రెండో అతిపెద్ద చర్య, ఎలక్టోరల్ బాండ్‌ల రూపకల్పన. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలు జారీ చేసే ఈ బాండ్‌లు చెక్ లేదా డిజిటల్ పేమెంట్ రూపంలో ఉంటాయి. వీటిని గుర్తింపు పొందిన రాజ కీయ పార్టీల ఖాతాలకు చెల్లించడానికి వీలుంటుంది. దీంట్లో కూడా విరాళాలు ఇచ్చిన వారి పేర్లు వెల్లడించరు. మొదట చూడగానే ఇది గొప్ప ఆలోచన అనిపిస్తుంది. కాని ఇది నిజమేనా?
మొదట, నిజాయితీగా చెప్పాలంటే, రాజకీయ విరాళాలను నూటికి నూరుపాళ్లు ప్రక్షాళన చేయవచ్చని జైట్లీ హామీ ఇచ్చారు. ఎందుకంటే బాండ్లను చెక్ లేదా డిజిటల్ చెల్లింపు ద్వారా తీసుకుంటారు. అయితే ఇవి నల్లధనంతో కాకుండా పన్ను చెల్లించిన రూపంలోనే ఉంటాయి. అయ్యో, ఈ కథనం రెండో సగం మరీ భిన్నమైనది. ఎందుకంటే విరాళాలు ఇచ్చేవారి పేర్లు గుప్తంగా ఉంచేటట్టు హామీ ఇచ్చారు. దీంట్లో పారదర్శకతే ఉండదు. పైగా, ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు విరాళాలు ఎవరిస్తున్నారు, ఎంతమొత్తం ఇస్తున్నారు అని తెలుసుకునే హక్కును ఇది సూత్రబద్ధంగానే ఉల్లంఘిస్తోంది.
విషాదకరమైన సత్యం ఏమిటంటే, ఇలాంటి చర్య చేపట్టడం ద్వారా అరుణ్ జైట్లీ వాస్తవానికి ఇప్పటివరకు ఉన్న పారదర్శకతను కూడా తొలగించేశారు. ఇంతవరకు రూ. 20,000లకు పైబ డిన విరాళాలు అన్నింటినీ పార్టీలు బహిరంగపర్చాల్సి ఉంటుంది. అంటే ఈ విరాళాలు ఇచ్చిన వారి పేర్లను వెల్లడించాల్సి ఉంటుంది. ఇప్పుడు వ్యక్తులు లేక కంపెనీలు ఇచ్చే విరాళాలను (రూ.2,000 లేక 20 లక్షలు, రూ. 20 లక్షలు లేక 200 కోట్లు అయినా సరే) బయటకు వెల్లడించరు. ఇది నిస్సందేహంగా ప్రమాదకరమైన తిరోగమన ఫలితమే అవుతుంది.
ఇక్కడ మరొక ఘోరమైన అంశం ఉంది. అరుణ్ జైట్లీ కార్పొరేట్ విరాళాలు, పారిశ్రామిక వేత్తల విరాళాలపై పన్నును ఎత్తివేయడంతో భారీ మొత్తాలను గుప్తంగానే ఇవి రాజకీయ పార్టీలకు చెల్లించే అవకాశం ఉంది. దీనికి ప్రతిగా ఇక్కడే క్విడ్ ప్రొ కో (నీకిది నాకిది) దాగి ఉంది. ఒక విషయం గుర్తుంచుకోండి. భారత దేశంలో రాజకీయ పార్టీలకు విరాళాల వంటివి ఇచ్చి ప్రతిఫలం పొందుతున్న ఘటనల్లో ఏ ఒక్కదాన్నీ ఎవరూ రుజువు చేయలేరు. అంటే వాస్తవానికి జైట్లీ ప్రకటించిన చర్యలు మరింత అవినీతిని పెంచి పోషిస్తాయి తప్పితే తగ్గించలేవు.
అత్యంత సందేహాస్పదమైన విషయం ఏమిటంటే, ఇవి జైట్లీ అనుకోకుండా విస్మరించి, ఉపేక్షించిన విషయాలు కావు. జైట్లీ వాస్తవ ఉద్దేశం ఇదేనని నమ్మడానికి విశ్వసనీయ ఆధారాలు కూడా ఉన్నాయి. 2017 బడ్జెట్ సమావేశంలో జైట్లీ చెప్పారు. ‘‘తమ ఉని కిని బయటపెడతాయి కాబట్టి చెక్ లేదా ఇతర పారదర్శక విధానాల ద్వారా విరాళాలు ఇవ్వడానికి విరాళకర్తలు విముఖత వ్యక్తం చేశారు’’ అంటే పారదర్శకతను పణంగా పెట్టి విరాళకర్తల ఉనికిని కాపాడటానికే జైట్లీ ఈ విధానాన్ని ఎంచుకున్నట్లు కనబడుతోంది.
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
కరణ్ థాపర్
ఈ–మెయిల్ : karanthapar@itvindia.net
Comments
Please login to add a commentAdd a comment