ముంబై: డిజిటల్ సేవలను మరింత విస్తరించే దిశగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తాజాగా యోనో (యూ నీడ్ ఓన్లీ వన్) పేరిట కొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దీన్ని లాంఛనంగా ఆవిష్కరించారు. ఆన్‌లైన్‌లోనే బ్యాంకు ఖాతాను తెరవడం, లావాదేవీలు నిర్వహించడం, రుణాల కోసం దరఖాస్తులు చేసుకోవడం నుంచి ఆన్‌లైన్ షాపింగ్ దాకా ఈ యాప్ ద్వారా నిర్వహించే వెసులుబాటు ఉంటుంది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ ప్లాట్‌ఫామ్స్‌పై ఇది అందుబాటులో ఉంటుంది. ఎస్‌బీఐతో పాటు దాని అనుబంధ సంస్థలైన ఎస్‌బీఐ లైఫ్, ఎస్‌బీఐ జనరల్, ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్, ఎస్‌బీఐ క్యాప్స్, ఎస్‌బీఐ కార్డ్స్ ఆర్థిక పథకాలన్నింటిని ఈ యాప్‌కి అనుసంధానం చేస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ రజనీష్ కుమార్ తెలిపారు.
ఇది ఒక రకంగా డిజిటల్ బ్యాంకులాంటిదేనని పేర్కొన్నారు. ఆధార్ నంబరు, వన్ టైమ్ పాస్‌వర్డ్ ద్వారా ఇంటి నుంచి కదలకుండా ఆన్‌లైన్‌లోనే పూర్తి స్థాయి సేవింగ్స్ అకౌంటును తెరిచే వెసులుబాటు ఈ యాప్‌తో లభిస్తుందని ఆయన తెలిపారు. ఇక బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులతో పాటు యూజర్ల లైఫ్‌స్టయిల్‌కి అనుగుణంగా 14 కేటగిరీల్లో యోనో యాప్ ద్వారా షాపింగ్ కూడా చేయొచ్చని బ్యాంకు తెలిపింది. కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లు అందించేందుకు 60 పైగా ఈ–కామర్స్ సంస్థలతో చేతులు కలిపినట్లు వివరించింది. అమెజాన్, ఉబెర్, ఓలా, మింత్రా, జబాంగ్, స్విగీ, బైజూస్ వంటి సంస్థలు ఇందులో ఉన్నాయి.
డిజిటల్ ఎకానమీగా భారత్..
నగదు ఆధారిత ఎకానమీ స్థితి నుంచి సంఘటిత, డిజిటల్ ఎకానమీగా భారత్ ప్రస్తుతం రూపాంతరం చెందుతోందని ఎస్‌బీఐ యోనో యాప్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా జైట్లీ చెప్పారు. ఎకానమీ స్థిరీకరణ అత్యంత వేగంగా జరిగిన దశగా .. ప్రస్తుత పరిణామ క్రమాన్ని గురించి ఇరవై ఏళ్ల తర్వాత అంతా చెప్పుకుంటారని ఆయన పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటైజేషన్ ప్రక్రియ మరింత వేగవంతమైందని జైట్లీ తెలిపారు. గడిచిన ఏడాది కాలంగా బీమా, మ్యూచువల్ ఫండ్స్, ఐపీవోల్లోకి పెట్టుబడుల ప్రవాహం పెరిగిందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment