బ్యాంకింగ్‌ వ్యవస్థ పటిష్టం ఆర్‌బీఐ గవర్నర్‌ | Banking system healthy enough to withstand external headwinds | Sakshi
Sakshi News home page

బ్యాంకింగ్‌ వ్యవస్థ పటిష్టం ఆర్‌బీఐ గవర్నర్‌

Published Tue, Sep 6 2022 6:05 AM | Last Updated on Tue, Sep 6 2022 11:02 AM

Banking system healthy enough to withstand external headwinds - Sakshi

ముంబై: అంతర్జాతీయ ప్రతికూలతల వల్ల ఎదుదయ్యే ఎటువంటి సవాళ్లనైనా తట్టుకొనగలిగే శక్తి సామర్థ్యాలను భారత్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థ, ఫైనాన్షియల్‌ మార్కెట్లు కలిగి ఉన్నట్లు  రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంతదాస్‌ స్పష్టం చేశారు.  ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ మనీ మార్కెట్‌ అండ్‌ డెరివేటివ్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఫిమ్డా) వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తూ, అంతర్జాతీయ ఒత్తిడులను తట్టుకునేలా అధిక ఫారెక్స్‌ నిల్వల (26 ఆగస్టు నాటికి 561 బిలియన్‌ డాలర్లు) పరిస్థితిని పొందడానికి అలాగే భారత్‌ బ్యాంకింగ్‌ పటిష్టతకు కేంద్రం, సెంట్రల్‌ బ్యాంక్‌ తగిన అన్ని చర్యలూ తీసుకున్నట్లు తెలిపారు.

ద్రవ్యోల్బణం దిగివస్తుంది...
దేశంలో ద్రవ్యోల్బణం భయాలు క్రమంగా వచ్చే త్రైమాసికాల్లో తగ్గుతాయని అన్నారు. ఇక దేశీయ కరెన్సీ రూపాయి పతనంపై ప్రస్తుతం ఆందోళన చెందాల్సింది ఏమీ లేదని కూడా ఉద్ఘాటించారు. డాలర్‌ మారకంలో భారత్‌ కరెన్సీ పతనం విషయంలో పలు వర్థమాన దేశాల కరెన్సీలతో పోల్చితే భారత్‌ రూపాయి పరిస్థితి మెరుగ్గా ఉందని అన్నారు. అలాగే పలు దేశాల కరెన్సీలతో పోల్చితే రూపాయి విలువ బలపడిందనీ పేర్కొన్నారు. కరెన్సీ తీవ్ర ఒడిదుడుకుల నిరోధానికి తగిన అన్ని చర్యలూ సెంట్రల్‌ బ్యాంక్‌ తీసుకుంటుందని అన్నారు. ఇక దేశ పురోగతి, ద్రవ్యోల్బణం కట్టడికి తగిన ద్రవ్య పరపతి విధానాన్ని ఆర్‌బీఐ అనుసరిస్తుందని పేర్కొన్నారు. సావరిన్‌ గ్రీన్‌ బాండ్ల జారీపై ప్రభుత్వం– సెంట్రల్‌ బ్యాంక్‌ చర్చలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు.

రుణ మేళాలతో మొండి బాకీల భారం
బ్యాంకు ఉద్యోగుల సంఘం ఆందోళన
ప్రభుత్వ రంగ బ్యాంకులు నిర్వహించే ’రుణ మేళా’లను వ్యతిరేకిస్తున్నట్లు మహారాష్ట్ర స్టేట్‌ బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (ఎంఎస్‌బీ ఈఎఫ్‌) ప్రకటించింది. ఇలాంటి కార్యక్రమాల్లో సరైన మదింపు లేకుండా ఇచ్చే రుణాలు.. మొండిపద్దులుగా పేరుకుపోయే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. రుణగ్రహీతలు ఈ తరహా లోన్‌లను తిరిగి చెల్లించడాన్ని మానేస్తున్న ట్లు గత అనుభవాలు చెబుతున్నాయని పేర్కొంది. రుణాల రికవరీ ప్రక్రియలో ఏ రాజకీయ పార్టీ కూడా సహకరించదని, ఎన్నికల సమయంలో మాత్రం ఓటర్లను ఆకట్టుకునేందుకు రుణాల మాఫీ డిమాండ్‌ను తెరపైకి తెస్తుంటాయని ఎంఎస్‌బీఈఎఫ్‌ వ్యాఖ్యానించింది. మొండిబాకీల ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకులను సంక్షోభంలోకి నెట్టి, దాన్ని సాకుగా చూపి ప్రైవేటీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించింది.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement