Financial markets
-
కొత్త ‘బంగారు’ లోకం
న్యూఢిల్లీ: బంగారం ధర నూతన గరిష్ట స్థాయిలకు రానున్న వారాల్లో చేరుకోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఔన్స్ ధర పూర్వపు గరిష్ట స్థాయి అయిన 2,075 డాలర్లను దాటిపోవచ్చని భావిస్తున్నారు. అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభం తలెత్తడంతో, ఇది అంతర్జాతీయ ఫైనాన్షియల్ మార్కెట్లో అనిశ్చితికి దారితీయడం చూస్తున్నాం. దీంతో అనిశ్చితుల్లో సురక్షిత సాధనంగా భావించే బంగారంలోకి మరిన్ని పెట్టుబడులు వెళ్లొచ్చని, ఫలితంగా ధరలకు రెక్కలు వస్తాయన్న విశ్లేషణ వినిపిస్తోంది. నెలలో 7.5 శాతం రాబడి ఇటీవల బంగారం ధర ఔన్స్‌కి (28.35 గ్రాములు) 2,000 డాలర్లను తాకింది. 2022 మార్చి తర్వాత ఇది గరిష్ట స్థాయి. తాజాగా లండన్ మార్కెట్లో ఔన్స్‌కి 1,952 డాలర్లకు పరిమితం అయింది. అంతర్జాతీయంగా చూస్తే గడిచిన నెల రోజుల్లో బంగారం ధరలు 7.75 శాతం మేర లాభపడ్డాయి. ఎంసీఎక్స్ మార్కెట్లో ఏప్రిల్ కాంట్రాక్టు గోల్డ్ 10 గ్రాములకు రూ.60,000ను తాకింది. ‘‘అంతర్జాతీయంగా పెరిగిపోతున్న ఆర్థిక అనిశ్చితులు బంగారం ధరని ఔన్స్‌కి 2,075 డాలర్ల గరిష్ట స్థాయికి మళ్లీ తీసుకెళతాయని భావిస్తున్నట్టు ఫిచ్ సొల్యూషన్స్ తెలిపింది. ఈ స్థాయిలో బలమైన నిరోధం ఉన్నట్టు పేర్కొంది. యూఎస్ డాలర్ బలంగా ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. సిగ్నేచర్ బ్యాంక్, సిలికాన్ వ్యాలీ బ్యాంక్ వైఫల్యాలు ఇతర బ్యాంకులకు విస్తరించేది చాలా తక్కువేనని ఫిచ్ సొల్యూషన్స్ అంచనా వేసింది. ఫెడ్ పెంపు ప్రభావం.. ఇవే ఆర్ధిక అనిశ్చిత పరిస్థితులు కొనసాగితే బంగారం ర్యాలీకి మద్దతుగా నిలుస్తాయని.. అతి త్వరలోనే ఔన్స్‌కి 2,075 డాలర్లను చూస్తామని బ్రిటన్ కేంద్రంగా పనిచేసే ఐజీ బ్యాంక్ పేర్కొంది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపుకు విరామం ఇస్తే కనుక అది బంగారం ధరలకు బూస్ట్‌నిస్తుందని ఐఎంజీ థింక్ అంచనా వేస్తోంది. 2023 సంవత్సరానికి ఫిచ్ సొల్యూషన్స్ తన అంచనాలను సవరించింది. ఔన్స్‌కి గతంలో వేసిన 1,850 డాలర్లను రూ.1,950 డాలర్లకు పెంచింది. బ్యాంకింగ్ సంక్షోభం మాంద్యానికి దారితీయవచ్చనే అభద్రతా భావం ఇన్వెస్టర్లలో ఏర్పడినట్టు ఫిచ్ సొల్యూషన్స్ తెలిపింది. ‘‘ఫెడ్ వడ్డీ రేట్లు అంచనాలకు తగ్గట్టు 0.25 శాతం లేదా అంతకంటే తక్కువ పెంచితే, హాకిష్ ప్రసంగం లేకపోతే అది బంగారానికి చాలా సానుకూలం అవుతుంది. 2,040–2,050 డాలర్లను చూడొచ్చు. కామెక్స్‌లో అయితే 10 గ్రాముల ధర రూ.61,500కు చేరొచ్చు’’అని ఎల్కేపీ సెక్యూరిటీస్ రీసెచ్చ్ అనలిస్ట్ జతీన్ త్రివేది తెలిపారు. మార్కెట్లలో అనిశ్చితులు ఉన్నప్పుడు బంగారం ధర సహజంగానే పెరుగుతుందని ఏజెంల్ వన్ నాన్ అగ్రి కమోడిటీస్ ఏవీపీ ప్రథమేష్ మాల్యా అన్నారు. బ్యాంకింగ్ సంక్షోభం శాంతిస్తే, ఫెడ్ అధిక పెంపు చేపట్టొచ్చని, అది బంగారం ధరల క్షీణతకు దారితీయవచ్చన్నారు. యూఎస్ ఫెడ్ దూకుడుగా రేట్లను పెంచుతుందన్న అంచనాలు ఇప్పుడు లేవని.. తాము అయితే బంగారంపై తటస్థం నుంచి బుల్లిష్‌గా ఉన్నామని, 2022 క్యూ4 నుంచి ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నట్టు ఫిచ్ సొల్యూషన్స్ తెలిపింది. రానున్న వారాల్లో బంగారం ధరలో ఎన్నో ఆటుపోట్లు చూడొచ్చని.. రానున్న సంవత్సరాల్లోనూ బంగారం ధర గరిష్ట స్థాయిల్లోనే కదలాడవొచ్చని, కరోనా ముందు నాటి స్థాయిలకు చేరుకోకపోవచ్చన్న అంచనాను వ్యక్తం చేసింది. -
మ్యూచువల్ ఫండ్స్‌లోనే తక్కువ ఫిర్యాదులు
ముంబై: భారతీయ మ్యచువల్ ఫండ్స్ పరిశ్రమ మొత్తం ఫైనాన్షియల్ మార్కెట్ వ్యవస్థలోనే అతి తక్కువ ఫిర్యాదులతో మెరుగైన స్థానంలో ఉందని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) ప్రకటించింది. పరిశమ్రపై ఉన్నవి నిరాధార దూషణలే తప్పించి, వాస్తవాలు వేరని పేర్కొంది. భారత మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ ఎంతో పారదర్శకతతో, సమగ్ర సమాచారాన్ని వెల్లడిస్తున్నట్టు తెలిపింది. నెలవారీ ఫండ్స్ పెట్టుబడుల సమాచారం వెల్లడించడం ఆధారంగా 26 దేశాల్లో భారత్‌కు మొదటిస్థానాన్ని మార్నింగ్‌స్టార్ ఇచ్చినట్టు యాంఫి సీఈవో ఎన్ఎస్ వెంకటేశ్ ప్రకటించారు. యాంఫి ఇన్వెస్టర్ల నుంచి, పంపిణీదారుల నుంచి నేరుగా, సెబీ ద్వారానూ ఫిర్యాదులు అందుకుంటుందని వివరించారు. ఇలా వచ్చే ఫిర్యాదులను సాధారణమైన, తీవ్రమైన అని రెండు రకాలుగా వర్గీకరిస్తామని చెప్పారు. ‘‘డివిడెండ్ రాకపోవడం, అకౌంట్ స్టేట్మెంట్, కమీషన్ రాకపోవడం, రికార్డ్ అప్డేట్ చేయకపోవం సాధారణ ఫిర్యాదులు. దరఖాస్తు ఫారాల్లో అక్రమాలకు పాల్పడడం, మార్కెట్ యూనిట్లు, ఫండ్స్‌లో అవకతవకలకు పాల్పడడం, పంపిణీదారుల సేవల్లో లోపాలను తీవ్రమైనవిగా పరిగణిస్తాం’’అని వివరించారు. 2017 ఏప్రిల్ నుంచి 2022 సెప్టెంబర్ మధ్య కేవలం 5,330 ఫిర్యాదులు వచ్చినట్టు వెల్లడించారు. ఇదే కాలంలో ఫండ్స్ నిర్వహణలోని ఆస్తులు రూ.40 లక్షల కోట్లకు చేరాయన్నారు. బ్యాంకింగ్, క్రెడిట్ కార్డులు, బీమా, స్టాక్స్‌లో ఫిర్యాదులు చాలా ఎక్కువగా ఉంటాయన్నారు. -
బ్యాంకింగ్ వ్యవస్థ పటిష్టం ఆర్బీఐ గవర్నర్
ముంబై: అంతర్జాతీయ ప్రతికూలతల వల్ల ఎదుదయ్యే ఎటువంటి సవాళ్లనైనా తట్టుకొనగలిగే శక్తి సామర్థ్యాలను భారత్ బ్యాంకింగ్ వ్యవస్థ, ఫైనాన్షియల్ మార్కెట్లు కలిగి ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ స్పష్టం చేశారు. ఫిక్స్డ్ ఇన్కమ్ మనీ మార్కెట్ అండ్ డెరివేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఫిమ్డా) వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తూ, అంతర్జాతీయ ఒత్తిడులను తట్టుకునేలా అధిక ఫారెక్స్ నిల్వల (26 ఆగస్టు నాటికి 561 బిలియన్ డాలర్లు) పరిస్థితిని పొందడానికి అలాగే భారత్ బ్యాంకింగ్ పటిష్టతకు కేంద్రం, సెంట్రల్ బ్యాంక్ తగిన అన్ని చర్యలూ తీసుకున్నట్లు తెలిపారు. ద్రవ్యోల్బణం దిగివస్తుంది... దేశంలో ద్రవ్యోల్బణం భయాలు క్రమంగా వచ్చే త్రైమాసికాల్లో తగ్గుతాయని అన్నారు. ఇక దేశీయ కరెన్సీ రూపాయి పతనంపై ప్రస్తుతం ఆందోళన చెందాల్సింది ఏమీ లేదని కూడా ఉద్ఘాటించారు. డాలర్ మారకంలో భారత్ కరెన్సీ పతనం విషయంలో పలు వర్థమాన దేశాల కరెన్సీలతో పోల్చితే భారత్ రూపాయి పరిస్థితి మెరుగ్గా ఉందని అన్నారు. అలాగే పలు దేశాల కరెన్సీలతో పోల్చితే రూపాయి విలువ బలపడిందనీ పేర్కొన్నారు. కరెన్సీ తీవ్ర ఒడిదుడుకుల నిరోధానికి తగిన అన్ని చర్యలూ సెంట్రల్ బ్యాంక్ తీసుకుంటుందని అన్నారు. ఇక దేశ పురోగతి, ద్రవ్యోల్బణం కట్టడికి తగిన ద్రవ్య పరపతి విధానాన్ని ఆర్బీఐ అనుసరిస్తుందని పేర్కొన్నారు. సావరిన్ గ్రీన్ బాండ్ల జారీపై ప్రభుత్వం– సెంట్రల్ బ్యాంక్ చర్చలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. రుణ మేళాలతో మొండి బాకీల భారం బ్యాంకు ఉద్యోగుల సంఘం ఆందోళన ప్రభుత్వ రంగ బ్యాంకులు నిర్వహించే ’రుణ మేళా’లను వ్యతిరేకిస్తున్నట్లు మహారాష్ట్ర స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఎంఎస్బీ ఈఎఫ్) ప్రకటించింది. ఇలాంటి కార్యక్రమాల్లో సరైన మదింపు లేకుండా ఇచ్చే రుణాలు.. మొండిపద్దులుగా పేరుకుపోయే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. రుణగ్రహీతలు ఈ తరహా లోన్లను తిరిగి చెల్లించడాన్ని మానేస్తున్న ట్లు గత అనుభవాలు చెబుతున్నాయని పేర్కొంది. రుణాల రికవరీ ప్రక్రియలో ఏ రాజకీయ పార్టీ కూడా సహకరించదని, ఎన్నికల సమయంలో మాత్రం ఓటర్లను ఆకట్టుకునేందుకు రుణాల మాఫీ డిమాండ్‌ను తెరపైకి తెస్తుంటాయని ఎంఎస్‌బీఈఎఫ్ వ్యాఖ్యానించింది. మొండిబాకీల ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకులను సంక్షోభంలోకి నెట్టి, దాన్ని సాకుగా చూపి ప్రైవేటీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించింది. -
మూడు నెలలైనా ఆగాల్సిందే : కేఎం బిర్లా
సాక్షి, న్యూఢిల్లీ: దూకుడు మీదున్న ఫైనాన్షియల్ మార్కెట్లలో పొంగు ఎంతమేరకు అన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నగా ఆదిత్య బిర్లా గ్రూపు చైర్మన్ కుమార మంగళం బిర్లా అన్నారు. ఇదే ఉత్సాహం కొనసాగుతుందా, లేదా అన్నది తెలియాలంటే కనీసం మరో త్రైమాసికం అయినా వేచి చూడాలన్నారు. గడిచిన ఏడాది గురించి మాట్లాడుతూ..కరోనా మహమ్మారి ఎంతో నష్టానికి కారణమైందన్నారు. వ్యక్తిగత జీవితంలో అయినా, వ్యాపారంలో అయినా కోమార్బిడిటీల (ఒకటికి మించిన సమస్యలు)ను నిర్లక్ష్యం చేయొద్దని హితవు పలికారు.సంక్షోభాల నుంచి బలంగా అవతరించేందుకు విజ్ఞాన నిల్వలు, ఆలోచనలు, సహకారం, మంచి పేరును సంపాదించుకోవాలని సూచించారు. వర్క్ ఫ్రమ్ హోమ్‌ను ఎక్కువ మంది సమర్థిస్తున్న తరుణంలో.. కార్యాలయ ప్రాధాన్యం గురించి బిర్లా మాట్లాడారు. కార్యాలయం అన్నది ఉద్యోగులు వచ్చి పనిచేసే కేవలం ఒక స్థలం మాత్రమే కాదని.. ప్రజలు, ఆలోచనలు, సంభాషణలన్నింటినీ కరిగించి, ఫలితాన్ని వెలికితీసే వేదికగా పేర్కొన్నారు. వివిధ రంగాల్లో పరుగు ఎంత కాలం పాటు కొనసాగుతుందీ చెప్పాలంటే, కనీసం మరో మూడు నెలలు చూస్తే కానీ చెప్పలేమన్నారు. అప్‌ట్రెండ్ పరిమితమే: బీఓఎఫ్ఐ అంచనా కాగా, భారత స్టాక్ మార్కెట్లలో నెలకొన్న అప్‌సైడ్ ట్రెండ్ కొంతకాలమే ఉంటుందని అమెరికన్ బ్రోకరేజ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ అమెరికా (బీఓఎఫ్ఏ) సెక్యూరిటీస్ అభిప్రాయపడింది. నిఫ్టీ 15వేల మార్కుని అందుకున్నప్పటికీ.., ఈ ఏడాది డిసెంబర్ వరకు ఈ స్థాయిలోపే ట్రేడ్ అవుతుందని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. ఆర్థిక, మెటల్, స్టీల్ రంగాలపై ‘‘ఓవర్‌వెయిట్’’ వైఖరిని కలిగి ఉన్నట్లు పేర్కొంది. -
సెన్సెక్స్ 41,164 స్థాయిని అధిగమిస్తే..
ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, ఫైనాన్షియల్ మార్కెట్లను నెలల తరబడి ఆందోళన పరుస్తున్న రెండు అంశాలు ఒక కొలిక్కి వచ్చాయి. అమెరికా–చైనాల మధ్య తొలిదశ వాణిజ్య ఒప్పందం కుదిరిందన్న ప్రకటన వెలువడటం, యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ సజావుగా వైదొలగడానికి (సాఫ్ట్ బ్రెగ్జిట్) అవసరమైన మెజారిటీని ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ, ప్రధాని బోరిస్ జాన్సన్ సాధించడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, మార్కెట్లకు పెద్ద ఊరటనిచ్చే అంశాలు. మన దేశ జీడీపి బాగా పడిపోవడం, పారిశ్రామికోత్పత్తి క్షీణించడం, ద్రవ్యోల్బణం పెరగడం వంటి ప్రతికూలాంశాల్ని సైతం తలదన్ని... ప్రపంచ సానుకూల పరిణామాల ప్రభావంతో స్టాక్ మార్కెట్ మరోదఫా రికార్డుస్థాయిని సమీపించింది. గత ఆరునెలల్లో ఎన్నోదఫాలు రికార్డుస్థాయి వద్ద జరిగిన బ్రేకవుట్లు విఫలమయ్యాయి. ట్రేడ్ డీల్, బ్రెగ్జిట్ సమస్యలకు పరిష్కారం లభించబోతున్నందున, ఈ వారం మన మార్కెట్ వ్యవహరించే శైలి... దీర్ఘ, మధ్యకాలిక ట్రెండ్‌కు కీలకం కానున్నది. ఇక సూచీల స్వల్పకాలిక సాంకేతికాలు ఇలా ఉన్నాయి... సెన్సెక్స్ సాంకేతికాంశాలు... డిసెంబర్ 13తో ముగిసినవారంలో మూడోరోజైన బుధవారం 40,135 పాయింట్ల కనిష్టస్థాయికి తగ్గిన బీఎస్ఈ సెన్సెక్స్... అదేరోజున రికవరీ ప్రారంభించి, చివరిరోజైన శుక్రవారం 41,056 పాయింట్ల గరిష్టస్థాయికి పెరిగింది. చివరకు అంతక్రితం వారం ముగింపుతో పోలిస్తే 565 పాయింట్ల లాభంతో 41,010 పాయింట్ల వద్ద ముగిసింది. నవంబర్ 28 నాటి 41,164 పాయింట్ల రికార్డుస్థాయి సెన్సెక్స్‌కు ఈ వారం కీలకం కానుంది. ఈ స్థాయిని బలంగా ఛేదిస్తే వేగంగా 41,400 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. అటుపైన ర్యాలీ కొనసాగితే 41,650 పాయింట్ల వరకూ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ వారంలో రికార్డుస్థాయిపైన స్థిరపడలేకపోయినా, బలహీనంగా ప్రారంభమైనా 40,850–40,710 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిని కోల్పోతే 40,590 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ లోపున 40,330 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు. నిఫ్టీకి 12,160 కీలకస్థాయి నిఫ్టీ గతవారం 11,832 పాయింట్ల కనిష్టస్థాయికి తగ్గిన తర్వాత వేగంగా 12,098 పాయింట్ల గరిష్టస్థాయిని చేరింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 165 పాయింట్ల లాభంతో 12,087 పాయిం ట్ల వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీకి నవంబర్ 28 నాటి 12,158 పాయింట్ల రికార్డుస్థాయే కీలకం. ఈ స్థాయిని అధిక ట్రేడింగ్ పరిమాణంతో అధిగమిస్తే 12,220 పాయింట్ల స్థాయిని అందు కోవొచ్చు. అటుపైన క్రమేపీ 12,250–1300 పాయింట్ల శ్రేణిని చేరవచ్చు. ఈ వారం పైన ప్రస్తావించిన కీలకస్థాయిని దాటలేకపోయినా, బలహీనంగా ప్రారంభమైనా 12,035–12,005 పాయింట్ల వద్ద తక్షణ మద్దతును పొందవచ్చు. ఈ లోపున ముగిస్తే 11,950 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ స్థాయిని సైతం వదులుకుంటే 11,880 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు. -
కీలక అవరోధశ్రేణి 36,285–36,560
ప్రపంచ ఈక్విటీ మార్కెట్లకు ఉత్సాహాన్నిచ్చే ప్రకటన గత శుక్రవారం వెలువడింది. ఆర్థిక ఉద్దీపన ఉపసంహరణ, వడ్డీ రేట్ల పెంపు అంశాల్లో మార్కెట్ల భయాందోళనలను పరిగణనలోకి తీసుకుంటామని, తమ పాలసీ ఫైనాన్షియల్ మార్కెట్లకు ఇబ్బందిగా పరిణమిస్తున్నదని భావిస్తే పాలసీని సమీక్షిస్తామంటూ అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పొవెల్ చేసిన ప్రకటనతో అమెరికా, యూరప్ మార్కెట్లు పెద్ద ర్యాలీ జరిపాయి. ఈ బాటలోనే ఆసియా ఇండెక్స్ ఫ్యూచర్లు భారీగా పెరిగాయి. సంవత్సరాంతపు సెలవుల తర్వాత సాధారణంగా జనవరి రెండోవారం నుంచి మన మార్కెట్లో చురుగ్గా కార్యకలాపాలు నిర్వహించే విదేశీ ఇన్వెస్టర్లు, ఫెడ్ తాజా ప్రకటనతో భారత్ మార్కెట్లో పెట్టుబడుల్ని పునర్ప్రారంభిస్తారా, అమ్మకాలకు తెరతీస్తారా అనే అంశం సమీప భవిష్యత్తులో మన మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశించగలదు. ఇక సూచీల సాంకేతిక అంశాల విషయానికొస్తే... సెన్సెక్స్ సాంకేతికాలు... జనవరి 4తో ముగిసిన నాలుగురోజుల ట్రేడింగ్వారం ప్రధమార్థంలో 36,285 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగిన బీఎస్ఈ సెన్సెక్స్ ద్వితీయార్థంలో వేగంగా 35,382 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 382 పాయింట్ల నష్టంతో 35,695 పాయింట్ల వద్ద ముగిసింది. గత శుక్రవారం అమెరికా మార్కెట్ భారీ ర్యాలీ ఫలితంగా ఈ వారం గ్యాప్‌అప్‌తో మార్కెట్ మొదలైతే సెన్సెక్స్‌కు 36,235 పాయింట్ల వద్ద తక్షణఅవరోధం కలగవచ్చు. ఈ స్థాయిపైన ముగిస్తే 36,285–36,560 పాయింట్ల నిరోధశ్రేణిని అధిగమించడం సెన్సెక్స్ భవిష్యత్ ట్రెండ్‌కు కీలకం. ఈ స్థాయిపైన ముగిస్తే క్రమేపీ 36,800–37,050 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చు. ఈ వారం పైన ప్రస్తావించిన కీలక నిరోధశ్రేణిని దాటలేకపోయినా, సోమవారం మార్కెట్ నిస్తేజంగా ప్రారంభమైనా 35,380 పాయింట్ల వద్ద సెన్సెక్స్‌కు తొలి మద్దతు లభిస్తున్నది. ఈ లోపున ముగిస్తే తిరిగి 35000 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. ఈ స్థాయిని సైతం కోల్పోతే క్రమేపీ 34,400 పాయింట్ల వరకూ పతనం కొనసాగవచ్చు. నిఫ్టీ కీలక నిరోధశ్రేణి 10925–10,985 గతవారం 10,924 పాయింట్ల గరిష్టస్థాయి నుంచి 10,629 పాయింట్ల కనిష్టస్థాయికి తగ్గిన ఎన్ఎస్ఈ నిఫ్టీ చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 133 పాయింట్ల నష్టంతో 10,727 వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీ గ్యాప్‌అప్‌తో మొదలైతే 10,895 పాయింట్ల వద్ద తక్షణ అవరోధం కలగవచ్చు. అటుపైన కీలక నిరోధ శ్రేణి 10925–10,985 పాయింట్లు. గత మూడువారాలుగా పలుదఫాలు ఈ శ్రేణి అవరోధాన్ని కల్గించినందున, ఈ శ్రేణిని దాటితేనే తదుపరి అప్‌ట్రెండ్ సాధ్యపడుతుంది. ఈ స్థాయిపైన స్థిరపడితే క్రమేపీ 11,035–11,150 శ్రేణి వరకూ ర్యాలీ కొనసాగవచ్చు. ఈ వారం పైన సూచించిన కీలక నిరోధశ్రేణిని దాటలేకపోయినా, ఈ సోమవారం నిఫ్టీ బలహీనంగా ప్రారంభమైనా 10,630 వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతు దిగువన ముగిస్తే 10,535 స్థాయిని తిరిగి పరీక్షించవచ్చు. అటుపై కొద్దిరోజుల్లో 10,330 పాయింట్ల వరకూ క్షీణత కొనసాగే ప్రమాదం ఉంటుంది. -
ఆర్థిక మార్కెట్ల నియంత్రణలో భారత్‌కు టాప్ రేటింగ్
జెనీవా: ఆర్థిక మార్కెట్లను సమర్ధంగా నియంత్రించే అంశంలో భారత్‌కు అత్యుత్తమ రేటింగ్ లభించింది. ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ).. చైనా, అమెరికా నియంత్రణ సంస్థల కన్నా మెరుగ్గా రేటింగ్స్ దక్కించుకున్నాయి. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ సెక్యూరిటీస్ కమిషన్స్ (ఐవోఎస్‌సీవో), బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (బీఐఎస్) కలిసి వీటిని నిర్ణయించాయి. ఇందులోని మొత్తం 8 ప్రమాణాల్లోను గరిష్ట స్కోరు అయిన 4ని భారత్ సహా ఆరు దేశాలు మాత్రమే దక్కించుకోగలిగాయి. ఈ జాబితాలో ఆస్ట్రేలియా, బ్రెజిల్ తదితర దేశాలు ఉన్నాయి. -
ఆర్థిక లక్ష్యం అలవోకగా ఛేదిద్దాం
ద్రవ్య మార్కెట్లు ఇటీవలి సంవత్సరాల్లో తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. కొన్ని ద్రవ్య సంస్థలు పతనమయ్యాయి. ద్రవ్యోల్బణం పెరిగింది. రూపాయి మారకం విలువ క్షీణించింది. సవాళ్లూ, అవకాశాలూ ఉన్న ఇలాంటి పరిస్థితుల్లో వ్యక్తిగత ఆర్థిక లక్ష్యాల సాధనకు అప్రమత్తంగా వ్యవహరించాలి. స్వల్పకాలంలో డబ్బు సంపాదించే యోచనను పక్కనపెట్టి సంపద సృష్టికి దీర్ఘకాలిక వ్యూహాలు రూపొందించుకోవడం మేలు. పూర్వకాలంలో మన తాత ముత్తాతలు ఒక్కో లక్ష్యానికి ఒక్కో హుండీని ఏర్పాటు చేసి వాటిలో డబ్బు దాచుకునేవారు. కిరాణా సరుకులకు ఒకటి, విలాసాలకు మరొకటి, ఏడాదికోసారి జరిపే యాత్ర ఖర్చులకు ఇంకొకటి, ఇంట్లో త్వరలో జరిగే పెళ్లికి మరొకటి... ఇలా ఒక్కో అవసరానికి ఒక్కో హుండీ ఉండేది. ఈ పద్ధతినే మనం లక్ష్యం ఆధారిత ఆర్థిక ప్రణాళిక అని అంటున్నాం. ఈ పద్ధతి చాలా సులువైనది. ఇప్పటి కాలానికి అన్వయిస్తే, పిల్లల చదువుకు, వివాహాలకు, ఇల్లు, వాహనం కొనుగోలుకు లక్ష్యాలు రూపొందించుకుని అందుకు అనువుగా పొదుపు, పెట్టుబడులు ప్రారంభించాలన్నమాట. లక్ష్యం నిర్దేశించుకోవడం అత్యంత ప్రాముఖ్యమైనది. తొందరపాటుతోనో, పొరపాటుగానో నిర్దేశించుకునే లక్ష్యాలు మంచి కంటే చెడే ఎక్కువ చేయవచ్చు. లక్ష్యాలు మిమ్మల్ని తప్పుదోవ పట్టించినా, లక్ష్యాలు సునాయాసంగా సాధించేవి అయినా వాటివల్ల ప్రయోజనం పెద్దగా ఉండదు. ఒకవేళ లక్ష్యాలు అత్యంత కష్టసాధ్యమైనవైతే మీ వైఫల్యానికి మీరే ప్రణాళిక రూపొందించుకున్నట్లు అవుతుంది. లక్ష్యాన్ని నిర్దేశించుకునే సమయంలో బాగా గుర్తుంచుకోవాల్సిన కొన్ని అంశాలివి... విలువ: లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంత సొమ్ము దాచుకోవాలో నిర్దుష్టంగా అంచనా వేయాలి కాలం: లక్ష్య సాధనకు మనకు ఎన్నేళ్ల తర్వాత డబ్బు అవసరమవుతుందో నిర్ణయించుకోవాలి. రిస్కు: లక్ష్యాల సాధనలో భాగంగా రిస్కులను ఎదుర్కొనే సామర్థ్యం ఎంత ఉందో పరిశీలించుకోవాలి. ప్రాధాన్యం: లక్ష్యాలన్నీ ముఖ్యమైనవే అయినప్పటికీ వాటి ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు పిల్లల కాలేజీ ఫీజు చెల్లించడం లక్ష్యమైతే సంబంధిత పెట్టుబడిలో ఎలాంటి రిస్కుకూ తావుండదు. అంటే, రిస్కు అతి తక్కువగా ఉండే పెట్టుబడి ప్రణాళికను ఎంచుకోవాలి. ఇల్లు, కారు కొనుగోలు, వివాహం వంటి పెద్ద అవసరాలకు దీర్ఘకాలిక లక్ష్యాలు రూపొందించుకోవాలి. ఇలాంటి వాటికి సొమ్ము అధికంగా కావాలి. కనుక, పొదుపులో క్రమశిక్షణ పాటించాలి, మూల ధనమూ వృద్ధి చెందుతుండాలి. ఇందుకోసం ప్రతి లక్ష్యానికీ ఓ సిప్ (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ - ఎస్ఐపీ)ను చేపట్టండి. ఎంపిక చేసిన ఈక్విటీల్లో సమయానుకూలంగా పెట్టుబడులు పెట్టడం కంటే క్రమబద్ధంగా సిప్ పద్ధతిలో ఇన్వెస్ట్ చేయడమే మరింత లాభదాయకమని సర్వేలు చెబుతున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్లో 5-10 శాతాన్ని బంగారంలో ఇన్వెస్ట్ చేయడం మంచిది. మార్కెట్ కుంగి పోతే నిరాశ చెందకండి. మీ ఇన్వెస్ట్మెంట్ ప్లాను, రిస్క్ ప్రొఫైల్‌కు అనుగుణంగా మరిన్ని పెట్టుబడులు చేయండి. ప్రతి ఒక్కరికీ తగిన పథకాలు మ్యూచువల్ ఫండ్లలో ఉన్నాయి. కనుక వీటిపైనా దృష్టిసారించండి. -
మా బిల్లులను చెల్లిస్తాం: బరాక్ ఒబామా
వాషింగ్టన్: అమెరికా తన బిల్లులను చెల్లిస్తుందని అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రపంచ దేశాలకు భరోసా ఇచ్చారు. రుణ పరిమితిని పెంచితే, ఆర్థిక మార్కెట్లు కుదేలవుతాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) హెచ్చరించినా, ఒబామా ఈ మేరకు భరోసా ఇవ్వడం గమనార్హం. అమెరికా ఇప్పటి వరకు తన బిల్లులను చెల్లిస్తూ వచ్చిందని, ఇకపై కూడా చెల్లిస్తుందని ఒబామా చెప్పారు. ప్రతి దేశంలోనూ, ముఖ్యంగా ప్రతి ప్రజాస్వామిక దేశంలోనూ బడ్జెట్‌కు సంబంధించిన ఇబ్బందులు ఉంటాయని అన్నారు. ప్రపంచ నేతల్లో పలువురు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని తాను భావిస్తున్నట్లు చెప్పారు. అమెరికన్ కాంగ్రెస్‌లోని ఒక పార్టీ తమ పంతం నెగ్గకుంటే పరిస్థితిని తలకిందులు చేస్తుందనే అపోహలో పలువురు ప్రపంచ నేతలు ఉన్నారని, ముఖ్యంగా 2011 నాటి పరిణామాల దృష్ట్యా వారు కలత చెందుతున్నారని అన్నారు. అయితే, దివాలా తీసే పరిస్థితి వాటిల్లుతుందని ఎవరూ తమను బెదిరించలేరని వ్యాఖ్యానించారు. బడ్జెట్ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు రిపబ్లికన్ పార్టీ సభ్యులతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నానని, అయితే, వారు బెదిరింపులకు దిగితే చర్చలు జరిపే ప్రసక్తే లేదని చెప్పారు. ఇదే విషయాన్ని ప్రతినిధుల సభ స్పీకర్ బోహ్నెర్కు ఫోన్ ద్వారా తెలిపారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు స్వల్పకాలానికి రుణ పరిమితిని పెంచేందుకు సైతం సిద్ధంగా ఉన్నట్లు ఒబామా చెప్పారు. వారం రోజులుగా కొనసాగుతున్న షట్డౌన్కు ముగింపు పలకాల్సిందిగా రిపబ్లికన్లకు పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా, ఉగ్రవాదం మరికొంతకాలం కొనసాగగలదని ఒబామా అభిప్రాయపడ్డారు. అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్‌లలోని కీలక ఉగ్రవాద నేతలు హతమైనప్పటికీ, ఉగ్రవాదం బెడద మరికొంత కాలం కొనసాగవచ్చని అన్నారు. లిబియాలో అమెరికన్ బలగాలపై జరిగిన దాడికి కుట్ర పన్నిన అల్‌కాయిదా నాయకుడు అబు అనస్ అల్ లిబీని చట్టం ముందుకు తెస్తామని అన్నారు. ఉగ్రవాద నిర్మూలనకు సైనిక వ్యూహాలే కాకుండా, దీర్ఘకాలిక వ్యూహాలు అవసరమని చెప్పారు. -
నియంత్రణలేని సంస్థలతోనే ముప్పు
చెన్నై: ఫైనాన్షియల్ మార్కెట్లో నియంత్రణ లేని సంస్థల వల్ల తీవ్రమైన ముప్పు పొంచి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం పేర్కొన్నారు. ఇది భారీ సంఖ్యలో వినియోగదార్ల(ఇన్వెస్టర్లు)ను దెబ్బతీస్తోందని చెప్పారు. సోమవారం ఇక్కడ జరిగిన ఒక సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఫైనాన్షియల్ రంగంలో నిలదొక్కుకోవాలంటే వేగం, డైనమిజమ్ అవసరమే. కొన్నిసార్లు నియంత్రణ లేని సంస్థలకు ఇవే అవకాశాలను సృష్టిస్తుంటాయి. ఇలాంటి కంపెనీలు నిర్వహించే కార్యకలాపాలు మార్కెట్ల క్రమశిక్షణకు ముప్పుగా పరిణమిస్తుంది. అంతేకాదు వ్యవస్థాగత అస్థిరత్వానికి కూడా దారితీస్తుంది. ఇది ఎక్కువమంది వినియోగదారులపై ప్రతికూల ప్రభావం చూపడమేకాకుండా, వ్యవస్థపై విశ్వాసాన్ని కూడా కోల్పోయేలా చేస్తుంది’ అని చిదంబరం పేర్కొన్నారు. ఫైనాన్షియల్ సెక్టార్ లెజిస్లేటివ్ రిఫార్మ్స్ కమిషన్(ఎఫ్ఎస్ఎల్ఆర్సీ) సిఫార్సు చేసిన ఇండియన్ ఫైనాన్షియల్ కోడ్(ఐఎఫ్‌సీ)పై జాతీయ సదస్సునుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా(ఐసీఎస్ఐ) దీన్ని నిర్వహించింది. నియంత్రణలేని సంస్థలు, కార్యకలాపాలను వ్యవస్థనుంచి పారద్రోలేలా మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఫైనాన్షియల్ రంగంలో ఇన్వెస్టర్లకు తగిన రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృష్టికేంద్రీకరించిందని కూడా చిదంబరం పేర్కొన్నారు. ముందుగానే మేల్కొనాలి... ఫైనాన్షియల్ రంగానికి సంబంధించి దేశంలో ఏదైనా సంక్షోభం వచ్చిన తర్వాత మాత్రమే మనం స్పందిస్తున్నామని, అంతేకాని రానున్న ముప్పను ముందే పసిగట్టేలా మన వ్యవస్థలు పనిచేయడం లేదని ఆర్థిక మంత్రి ఒప్పుకున్నారు. కమోడిటీస్ ఫ్యూచర్స్ మార్కెట్‌పై నింయత్రణను ఆర్థిక శాఖకు బదలాయించడం అనేది సంక్షోభం తర్వాత తీసుకున్న ప్రతిస్పందన మాత్రమేనని, సంక్షోభాన్ని ముందుగానే అంచనావేయలేకపోయామన్నారు. నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈఎల్)లో రూ.5,600 కోట్ల చెల్లింపు సంక్షోభం తలెత్తడం, ఎక్స్ఛేంజ్ మూసివేతతో ఇన్వెస్టర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారిన నేపథ్యంలో చిదంబరం వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.