ఆర్థిక లక్ష్యం అలవోకగా ఛేదిద్దాం
ద్రవ్య మార్కెట్లు ఇటీవలి సంవత్సరాల్లో తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. కొన్ని ద్రవ్య సంస్థలు పతనమయ్యాయి. ద్రవ్యోల్బణం పెరిగింది. రూపాయి మారకం విలువ క్షీణించింది. సవాళ్లూ, అవకాశాలూ ఉన్న ఇలాంటి పరిస్థితుల్లో వ్యక్తిగత ఆర్థిక లక్ష్యాల సాధనకు అప్రమత్తంగా వ్యవహరించాలి. స్వల్పకాలంలో డబ్బు సంపాదించే యోచనను పక్కనపెట్టి సంపద సృష్టికి దీర్ఘకాలిక వ్యూహాలు రూపొందించుకోవడం మేలు.
పూర్వకాలంలో మన తాత ముత్తాతలు ఒక్కో లక్ష్యానికి ఒక్కో హుండీని ఏర్పాటు చేసి వాటిలో డబ్బు దాచుకునేవారు. కిరాణా సరుకులకు ఒకటి, విలాసాలకు మరొకటి, ఏడాదికోసారి జరిపే యాత్ర ఖర్చులకు ఇంకొకటి, ఇంట్లో త్వరలో జరిగే పెళ్లికి మరొకటి... ఇలా ఒక్కో అవసరానికి ఒక్కో హుండీ ఉండేది. ఈ పద్ధతినే మనం లక్ష్యం ఆధారిత ఆర్థిక ప్రణాళిక అని అంటున్నాం. ఈ పద్ధతి చాలా సులువైనది. ఇప్పటి కాలానికి అన్వయిస్తే, పిల్లల చదువుకు, వివాహాలకు, ఇల్లు, వాహనం కొనుగోలుకు లక్ష్యాలు రూపొందించుకుని అందుకు అనువుగా పొదుపు, పెట్టుబడులు ప్రారంభించాలన్నమాట.
లక్ష్యం నిర్దేశించుకోవడం అత్యంత ప్రాముఖ్యమైనది. తొందరపాటుతోనో, పొరపాటుగానో నిర్దేశించుకునే లక్ష్యాలు మంచి కంటే చెడే ఎక్కువ చేయవచ్చు. లక్ష్యాలు మిమ్మల్ని తప్పుదోవ పట్టించినా, లక్ష్యాలు సునాయాసంగా సాధించేవి అయినా వాటివల్ల ప్రయోజనం పెద్దగా ఉండదు. ఒకవేళ లక్ష్యాలు అత్యంత కష్టసాధ్యమైనవైతే మీ వైఫల్యానికి మీరే ప్రణాళిక రూపొందించుకున్నట్లు అవుతుంది.
లక్ష్యాన్ని నిర్దేశించుకునే సమయంలో బాగా గుర్తుంచుకోవాల్సిన కొన్ని అంశాలివి...
విలువ: లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంత సొమ్ము దాచుకోవాలో నిర్దుష్టంగా అంచనా వేయాలి
కాలం: లక్ష్య సాధనకు మనకు ఎన్నేళ్ల తర్వాత డబ్బు అవసరమవుతుందో నిర్ణయించుకోవాలి.
రిస్కు: లక్ష్యాల సాధనలో భాగంగా రిస్కులను ఎదుర్కొనే సామర్థ్యం ఎంత ఉందో పరిశీలించుకోవాలి.
ప్రాధాన్యం: లక్ష్యాలన్నీ ముఖ్యమైనవే అయినప్పటికీ వాటి ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకోవాలి.
ఉదాహరణకు పిల్లల కాలేజీ ఫీజు చెల్లించడం లక్ష్యమైతే సంబంధిత పెట్టుబడిలో ఎలాంటి రిస్కుకూ తావుండదు. అంటే, రిస్కు అతి తక్కువగా ఉండే పెట్టుబడి ప్రణాళికను ఎంచుకోవాలి.
ఇల్లు, కారు కొనుగోలు, వివాహం వంటి పెద్ద అవసరాలకు దీర్ఘకాలిక లక్ష్యాలు రూపొందించుకోవాలి. ఇలాంటి వాటికి సొమ్ము అధికంగా కావాలి. కనుక, పొదుపులో క్రమశిక్షణ పాటించాలి, మూల ధనమూ వృద్ధి చెందుతుండాలి. ఇందుకోసం ప్రతి లక్ష్యానికీ ఓ సిప్ (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ - ఎస్‌ఐపీ)ను చేపట్టండి. ఎంపిక చేసిన ఈక్విటీల్లో సమయానుకూలంగా పెట్టుబడులు పెట్టడం కంటే క్రమబద్ధంగా సిప్ పద్ధతిలో ఇన్వెస్ట్ చేయడమే మరింత లాభదాయకమని సర్వేలు చెబుతున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్లో 5-10 శాతాన్ని బంగారంలో ఇన్వెస్ట్ చేయడం మంచిది. మార్కెట్ కుంగి పోతే నిరాశ చెందకండి. మీ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాను, రిస్క్ ప్రొఫైల్‌కు అనుగుణంగా మరిన్ని పెట్టుబడులు చేయండి. ప్రతి ఒక్కరికీ తగిన పథకాలు మ్యూచువల్ ఫండ్లలో ఉన్నాయి. కనుక వీటిపైనా దృష్టిసారించండి.