మార్కెట్ ఇంకా పెరుగుతుందా!
దేశీ స్టాక్‌మార్కెట్ల వేల్యుయేషన్ అధికంగా ఉందా లేక తక్కువగా ఉందా అన్నది పక్కనపెడితే గత కొన్నాళ్లుగా చోటు చేసుకుంటున్న పరిణామాలను బట్టి చూస్తుంటే మార్కెట్లు మరింత పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలతో భారీ సంస్కరణలపై ఆశలు మొలకెత్తాయి.
ద్రవ్యోల్బణం, రుతుపవనాలు, ప్రాజెక్టుల అమలు వంటి కొంత మేర ప్రతికూలాంశాలతో ఇన్వెస్టర్లలో ఊగిసలాట ధోరణి ఉన్నప్పటికీ మొత్తం మీద సానుకూల పరిస్థితే ఉన్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ బుల్ మార్కెట్ ప్రారంభ దశలో ఉండే సంకేతాలే. ఇన్వెస్ట్‌మెంట్‌కి అవకాశాలే. పరిశీలించి చూడగా కొన్ని అంశాలు దీనికి ఊతమిస్తున్నాయి.
మొదటి అంశం విషయానికొస్తే.. మార్కెట్లు చక్రీయ నమూనా రికవరీ ప్రక్రియ ప్రారంభ దశలో ఉన్నాయి. ఇలాంటప్పుడు ఒత్తిడిలో ఉన్న రంగాల కంపెనీల ఆదాయార్జనా సామర్ధ్యాలను విశ్లేషకులు పూర్తి స్థాయిలో అంచనా వేయలేని పరిస్థితి ఉంటుంది. అయితే, అంచనాలకు భిన్నంగా క్రమక్రమంగా ఈ తరహా సంస్థలు మెరుగైన ఆదాయాలను ఆర్జించడం మొదలవుతుంది.
రుణభారం తగ్గించుకుంటూ మెల్లగా ఈక్విటీ విలువను గణనీయంగా పెంచుకునే ప్రయత్నం చేస్తాయి. సాధారణంగా ఇలాంటి పరిణామాలను మార్కెట్లు పూర్తి స్థాయిలో అంచనా వేయలేవు. మరోవైపు, ద్రవ్యోల్బణ కట్టడిపరంగా ఆర్‌బీఐ తీసుకుంటున్న చర్యల ఫలితాలు ఇప్పటికే కనిపించడం మొదలైంది. రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం మరింత తగ్గగలదు. ఫలితంగా మార్కెట్లు ఊహిస్తున్న దానికంటే వేగంగా వడ్డీ రేట్లు తగ్గొచ్చు.
సాధారణంగా మార్కెట్ విశ్లేషకులు ఇటువంటి పరిణామాలను దీర్ఘకాలిక దృష్టితో కాకుండా తాత్కాలిక కోణంలో మాత్రమే చూస్తుంటారు. అలా కాకుండా కాస్త మెలకువగా వ్యవహరిస్తే ఈక్విటీ ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేసేందుకు అవకాశాలు లభించగలవు. ఇవే కాకుండా టెక్నాలజీ రాకతో భారత్‌లో కొంగొత్త వ్యాపారాలు పుట్టుకురానున్నాయి. ఇవి ప్రారంభ దశలో ఉన్నప్పుడే సరైన వ్యాపారాన్ని గుర్తిస్తే మెరుగైన లాభాలను కూడా గడించవచ్చు.
ఇటు సంపన్న, అటు వర్ధమాన దేశాలన్నీ చూసినా కూడా పెట్టుబడులను పెట్టేందుకు అనువైన దేశాల్లో ప్రస్తుతం భారత్‌ను మించి మరొకటి కనిపించడం లేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే డాలరు మారకం విలువ బలపడి, రూపాయి క్షీణించినా.. ఇప్పటికిప్పుడు ఒక్కసారిగా భారత మార్కెట్ల నుంచి విదేశీ నిధులు తరలి వెళ్లిపోకపోవచ్చు. ఇలాంటి నేపథ్యంలో పెట్టుబడులు పెట్టేందుకు, దేశీ మార్కెట్లు మరింత ఎగసేందుకు పుష్కలంగా అవకాశాలున్నట్లు కనిపిస్తోంది.