మీ పొదుపుపై ద్రవ్యోల్బణం ప్రభావం?
ద్రవ్యోల్బణం అంటే ధరలు పెరగడం. ఉదాహరణకు ఇప్పుడు 6 శాతం ద్రవ్యోల్బణం రేటు వుందనుకోండి...అంటే గత ఏడాది రూ. 100కు లభించే సరుకులు, వస్తువుల ధర ఇప్పుడు రూ. 106 అయ్యిందన్నమాట. మీరు రూ. 100కు ఆరు రూపాయలు చొప్పున ఎక్కువ చెల్లించాల్సివుంటుంది. ద్రవ్యోల్బణం కారణంగా మీ కొనుగోలు శక్తి సన్నగిల్లడమే కాదు...మీ పెట్టుబడులపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది.
అందుచేత మీ పొదుపు, పెట్టుబడులు ద్రవ్యోల్బణం రేటుకంటే ఎక్కువ రాబడులు ఇచ్చే సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాలి. అలా చేస్తేనే మీరు ధరల్ని తట్టుకొని భవిష్యత్ లక్ష్యాలను సాధించగలుగుతారు. మీ బ్యాంక్ డిపాజిట్ ద్వారా 8.5 శాతం వడ్డీ లభిస్తుందనుకుంటే...వాస్తవంగా ద్రవ్యోల్బణం పోను నికరంగా మీకు మిగిలేది 2.5 శాతమే. అందుకే ఎక్కువ వడ్డీ లభించే సాధనాల్ని ఎంచుకోవాలి.
అధిక వడ్డీ సాధనాల్ని ఎంచుకునేముందు, వాటిలో రిస్క్ ఏమైనా వుందేమో చూసుకోవాలి. వివిధ రకాల బ్యాంకులు వివిధ డిపాజిట్ పథకాల్ని అందిస్తుంటాయి. పోస్టాఫీసు పథకాలు, ప్రావిడెంట్ పథకాలు కూడా పరిశీలించవచ్చు. కాస్త రిస్క్ తీసుకునేవారైతే ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి డెట్ స్కీములు, మ్యూచువల్ ఫండ్ స్కీముల్ని ఎంచుకోవొచ్చు.