నియంత్రణలేని సంస్థలతోనే ముప్పు
చెన్నై: ఫైనాన్షియల్ మార్కెట్లో నియంత్రణ లేని సంస్థల వల్ల తీవ్రమైన ముప్పు పొంచి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం పేర్కొన్నారు. ఇది భారీ సంఖ్యలో వినియోగదార్ల(ఇన్వెస్టర్లు)ను దెబ్బతీస్తోందని చెప్పారు. సోమవారం ఇక్కడ జరిగిన ఒక సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఫైనాన్షియల్ రంగంలో నిలదొక్కుకోవాలంటే వేగం, డైనమిజమ్ అవసరమే. కొన్నిసార్లు నియంత్రణ లేని సంస్థలకు ఇవే అవకాశాలను సృష్టిస్తుంటాయి. ఇలాంటి కంపెనీలు నిర్వహించే కార్యకలాపాలు మార్కెట్ల క్రమశిక్షణకు ముప్పుగా పరిణమిస్తుంది. అంతేకాదు వ్యవస్థాగత అస్థిరత్వానికి కూడా దారితీస్తుంది. ఇది ఎక్కువమంది వినియోగదారులపై ప్రతికూల ప్రభావం చూపడమేకాకుండా, వ్యవస్థపై విశ్వాసాన్ని కూడా కోల్పోయేలా చేస్తుంది’ అని చిదంబరం పేర్కొన్నారు.
ఫైనాన్షియల్ సెక్టార్ లెజిస్లేటివ్ రిఫార్మ్స్ కమిషన్(ఎఫ్‌ఎస్‌ఎల్‌ఆర్‌సీ) సిఫార్సు చేసిన ఇండియన్ ఫైనాన్షియల్ కోడ్(ఐఎఫ్‌సీ)పై జాతీయ సదస్సునుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా(ఐసీఎస్‌ఐ) దీన్ని నిర్వహించింది. నియంత్రణలేని సంస్థలు, కార్యకలాపాలను వ్యవస్థనుంచి పారద్రోలేలా మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఫైనాన్షియల్ రంగంలో ఇన్వెస్టర్లకు తగిన రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృష్టికేంద్రీకరించిందని కూడా చిదంబరం పేర్కొన్నారు.
ముందుగానే మేల్కొనాలి...
ఫైనాన్షియల్ రంగానికి సంబంధించి దేశంలో ఏదైనా సంక్షోభం వచ్చిన తర్వాత మాత్రమే మనం స్పందిస్తున్నామని, అంతేకాని రానున్న ముప్పను ముందే పసిగట్టేలా మన వ్యవస్థలు పనిచేయడం లేదని ఆర్థిక మంత్రి ఒప్పుకున్నారు. కమోడిటీస్ ఫ్యూచర్స్ మార్కెట్‌పై నింయత్రణను ఆర్థిక శాఖకు బదలాయించడం అనేది సంక్షోభం తర్వాత తీసుకున్న ప్రతిస్పందన మాత్రమేనని, సంక్షోభాన్ని ముందుగానే అంచనావేయలేకపోయామన్నారు. నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్(ఎన్‌ఎస్‌ఈఎల్)లో రూ.5,600 కోట్ల చెల్లింపు సంక్షోభం తలెత్తడం, ఎక్స్ఛేంజ్ మూసివేతతో ఇన్వెస్టర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారిన నేపథ్యంలో చిదంబరం వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.