మా బిల్లులను చెల్లిస్తాం: బరాక్ ఒబామా
వాషింగ్టన్: అమెరికా తన బిల్లులను చెల్లిస్తుందని అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రపంచ దేశాలకు భరోసా ఇచ్చారు. రుణ పరిమితిని పెంచితే, ఆర్థిక మార్కెట్లు కుదేలవుతాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) హెచ్చరించినా, ఒబామా ఈ మేరకు భరోసా ఇవ్వడం గమనార్హం. అమెరికా ఇప్పటి వరకు తన బిల్లులను చెల్లిస్తూ వచ్చిందని, ఇకపై కూడా చెల్లిస్తుందని ఒబామా చెప్పారు. ప్రతి దేశంలోనూ, ముఖ్యంగా ప్రతి ప్రజాస్వామిక దేశంలోనూ బడ్జెట్‌కు సంబంధించిన ఇబ్బందులు ఉంటాయని అన్నారు. ప్రపంచ నేతల్లో పలువురు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
అమెరికన్ కాంగ్రెస్‌లోని ఒక పార్టీ తమ పంతం నెగ్గకుంటే పరిస్థితిని తలకిందులు చేస్తుందనే అపోహలో పలువురు ప్రపంచ నేతలు ఉన్నారని, ముఖ్యంగా 2011 నాటి పరిణామాల దృష్ట్యా వారు కలత చెందుతున్నారని అన్నారు. అయితే, దివాలా తీసే పరిస్థితి వాటిల్లుతుందని ఎవరూ తమను బెదిరించలేరని వ్యాఖ్యానించారు. బడ్జెట్ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు రిపబ్లికన్ పార్టీ సభ్యులతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నానని, అయితే, వారు బెదిరింపులకు దిగితే చర్చలు జరిపే ప్రసక్తే లేదని చెప్పారు. ఇదే విషయాన్ని ప్రతినిధుల సభ స్పీకర్ బోహ్నెర్‌కు ఫోన్ ద్వారా తెలిపారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు స్వల్పకాలానికి రుణ పరిమితిని పెంచేందుకు సైతం సిద్ధంగా ఉన్నట్లు ఒబామా చెప్పారు.
వారం రోజులుగా కొనసాగుతున్న షట్‌డౌన్‌కు ముగింపు పలకాల్సిందిగా రిపబ్లికన్లకు పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా, ఉగ్రవాదం మరికొంతకాలం కొనసాగగలదని ఒబామా అభిప్రాయపడ్డారు. అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్‌లలోని కీలక ఉగ్రవాద నేతలు హతమైనప్పటికీ, ఉగ్రవాదం బెడద మరికొంత కాలం కొనసాగవచ్చని అన్నారు. లిబియాలో అమెరికన్ బలగాలపై జరిగిన దాడికి కుట్ర పన్నిన అల్‌కాయిదా నాయకుడు అబు అనస్ అల్ లిబీని చట్టం ముందుకు తెస్తామని అన్నారు. ఉగ్రవాద నిర్మూలనకు సైనిక వ్యూహాలే కాకుండా, దీర్ఘకాలిక వ్యూహాలు అవసరమని చెప్పారు.