Indian banking system
-
దేశీ బ్యాంకింగ్‌పై ‘క్రెడిట్ సూసీ’ ప్రభావం ఉండదు..
న్యూఢిల్లీ: భారత బ్యాంకింగ్ వ్యవస్థపై స్విస్ బ్యాంకు క్రెడిట్ సూసీ సంక్షోభ ప్రభావాలేమీ ఉండకపోవచ్చని ఆర్థిక సేవల దిగ్గజం జెఫ్రీస్ ఇండియా అభిప్రాయపడింది. మూతబడ్డ అమెరికన్ బ్యాంకు ఎస్వీబీ (సిలికాన్ వ్యాలీ బ్యాంకు)తో పోలిస్తే క్రెడిట్ సూసీకి భారత్‌తో కొంత ఎక్కువ అనుబంధమే ఉన్నప్పటికీ .. దానికి ఇక్కడ కార్యకలాపాలు మాత్రం స్పల్పంగా ఉండటమే ఇందుకు కారణమని ఒక నివేదికలో పేర్కొంది. దీని ప్రకారం క్రెడిట్ సూసీకి భారత్‌లో ఒకే ఒక్క శాఖ, రూ. 20,000 కోట్ల కన్నా తక్కువ అసెట్స్ ఉన్నాయి. అంతర్జాతీయంగా కొన్ని బ్యాంకులు మూతబడటం, పలు బ్యాంకులు ఒత్తిడిలో ఉండటం వంటి అంశాల నేపథ్యంలో ఎప్పటికప్పుడు చోటు చేసుకుంటున్న కొత్త పరిణామాలను రిజర్వ్ బ్యాంక్ నిశితంగా పరిశీలిస్తోందని నివేదిక తెలిపింది. లిక్విడిటీపరమైన సమస్యలేమైనా వస్తే పరిస్థితిని చక్కదిద్దేందుకు అవసరమైతే ఆర్బీఐ సత్వరం జోక్యం చేసుకునే అవకాశం ఉందని పేర్కొంది. భారత్ విషయంలో స్థూల ఆర్థిక పరిస్థితులు సానుకూలంగా ఉన్నందున ప్రస్తుతం అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభాలేమైనా వచ్చినా తట్టుకుని నిలబడగలదని కొటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ ఉదయ్ కొటక్ ఇప్పటికే ధీమా వ్యక్తం చేశారు. క్రెడిట్ సూసీ ఇటీవలి కాలంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సౌదీ ఇన్వెస్టరు మరిన్ని పెట్టుబడులు పెట్టబోమంటూ ప్రకటించడంతో రెండు రోజుల క్రితం క్రెడిట్ సూసీ బ్యాంకు షేరు భారీగా పతనమైంది. అయితే, స్విస్ నేషనల్ బ్యాంక్ (ఎస్ఎన్బీ) 54 బిలియన్ డాలర్ల రుణాన్ని అందించడానికి ముందుకు రావడంతో మరుసటి రోజు మళ్లీ కోలుకుంది. భారత్‌లో విదేశీ బ్యాంకులకు కార్యకలాపాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. దేశీయంగా అసెట్స్‌లో వాటి వాటా 6 శాతంగా ఉంది. అయితే, డెరివేటివ్ మార్కెట్లలో (ఫారెక్స్, వడ్డీ రేట్లు) మాత్రం అవి చురుగ్గా ఉంటున్నాయి. ఆయా మార్కెట్లలో విదేశీ బ్యాంకులకు 50 శాతం దాకా వాటా ఉంటోంది. -
బ్యాంకుల మొండి బాకీలు తగ్గుతాయ్
ముంబై: బ్యాంకింగ్ రంగంలో స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏలు/వసూలు కానీ మొండి బాకీలు) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 0.90 శాతం మేర తగ్గి 5 శాతానికి పరిమితమవుతాయని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. అంతేకాదు 2024 మార్చి నాటికి 4 శాతానికి క్షీణిస్తాయని పేర్కొంది. అయినా కానీ, బ్యాంకింగ్ రంగం ముందు ఇతర విభాగాల నుంచి సవాళ్లు ఉన్నట్టు ప్రస్తావించింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈ)ల రుణ విభాగంపై ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా సమయంలో బ్యాంకులు ఎంఎస్ఎంఈ రంగానికి ఎక్కువగా రుణ వితరణ చేయడంతో, ఈ విభాగంలో స్థూల ఎన్పీఏలు 2024 మార్చి నాటికి 10-11 శాతానికి చేరుకుంటాయని అంచనా వేసింది. ఈ విభాగంలో స్థూల ఎన్పీఏలు 2022 మార్చి నాటికి 9.3 శాతంగా ఉన్నట్టు గుర్తు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ విభాగంలో రుణాల పునరుద్ధరణ 6 శాతంగా ఉంటే, మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థలో రుణాల పునరుద్ధరణ 2 శాతమే ఉన్నట్టు గుర్తు చేసింది. 6 శాతం పునరుద్ధరణ రుణాల్లో పావు వంతు ఎన్పీఏలుగా మారొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. రుణ విభాగాల పరంగా ఎంఎస్ఎంఈల కంటే పెద్ద కంపెనీల పనితీరు మెరుగ్గా ఉన్నట్టు తెలిపింది. (ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు..ఇక విదేశాల్లో రయ్..రయ్!) కార్పొరేట్ విభాగం మెరుగు పెద్ద కార్పొరేట్ విభాగంలో రుణాల పరంగా స్థూల ఎన్పీఏలు వచ్చే ఆర్థిక సంవత్సరం చివరికి 2 శాతానికి తగ్గుతాయని క్రిసిల్ పేర్కొంది. 2018 నాటికి ఈ విభాగంలో స్థూల ఎన్పీఏలు 16 శాతంగా ఉన్నట్టు గుర్తు చేసింది. ఇటీవలి సంవత్సరాల్లో బ్యాంకులు తమ పుస్తకాల్లో కార్పొరేట్ రుణాలకు సంబంధించి భారీ ప్రక్షాళన చేపట్టడమే మెరుగుదలకు కారణంగా పేర్కొంది. -
బ్యాంకింగ్ వ్యవస్థ పటిష్టం ఆర్బీఐ గవర్నర్
ముంబై: అంతర్జాతీయ ప్రతికూలతల వల్ల ఎదుదయ్యే ఎటువంటి సవాళ్లనైనా తట్టుకొనగలిగే శక్తి సామర్థ్యాలను భారత్ బ్యాంకింగ్ వ్యవస్థ, ఫైనాన్షియల్ మార్కెట్లు కలిగి ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ స్పష్టం చేశారు. ఫిక్స్డ్ ఇన్కమ్ మనీ మార్కెట్ అండ్ డెరివేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఫిమ్డా) వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తూ, అంతర్జాతీయ ఒత్తిడులను తట్టుకునేలా అధిక ఫారెక్స్ నిల్వల (26 ఆగస్టు నాటికి 561 బిలియన్ డాలర్లు) పరిస్థితిని పొందడానికి అలాగే భారత్ బ్యాంకింగ్ పటిష్టతకు కేంద్రం, సెంట్రల్ బ్యాంక్ తగిన అన్ని చర్యలూ తీసుకున్నట్లు తెలిపారు. ద్రవ్యోల్బణం దిగివస్తుంది... దేశంలో ద్రవ్యోల్బణం భయాలు క్రమంగా వచ్చే త్రైమాసికాల్లో తగ్గుతాయని అన్నారు. ఇక దేశీయ కరెన్సీ రూపాయి పతనంపై ప్రస్తుతం ఆందోళన చెందాల్సింది ఏమీ లేదని కూడా ఉద్ఘాటించారు. డాలర్ మారకంలో భారత్ కరెన్సీ పతనం విషయంలో పలు వర్థమాన దేశాల కరెన్సీలతో పోల్చితే భారత్ రూపాయి పరిస్థితి మెరుగ్గా ఉందని అన్నారు. అలాగే పలు దేశాల కరెన్సీలతో పోల్చితే రూపాయి విలువ బలపడిందనీ పేర్కొన్నారు. కరెన్సీ తీవ్ర ఒడిదుడుకుల నిరోధానికి తగిన అన్ని చర్యలూ సెంట్రల్ బ్యాంక్ తీసుకుంటుందని అన్నారు. ఇక దేశ పురోగతి, ద్రవ్యోల్బణం కట్టడికి తగిన ద్రవ్య పరపతి విధానాన్ని ఆర్బీఐ అనుసరిస్తుందని పేర్కొన్నారు. సావరిన్ గ్రీన్ బాండ్ల జారీపై ప్రభుత్వం– సెంట్రల్ బ్యాంక్ చర్చలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. రుణ మేళాలతో మొండి బాకీల భారం బ్యాంకు ఉద్యోగుల సంఘం ఆందోళన ప్రభుత్వ రంగ బ్యాంకులు నిర్వహించే ’రుణ మేళా’లను వ్యతిరేకిస్తున్నట్లు మహారాష్ట్ర స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఎంఎస్బీ ఈఎఫ్) ప్రకటించింది. ఇలాంటి కార్యక్రమాల్లో సరైన మదింపు లేకుండా ఇచ్చే రుణాలు.. మొండిపద్దులుగా పేరుకుపోయే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. రుణగ్రహీతలు ఈ తరహా లోన్లను తిరిగి చెల్లించడాన్ని మానేస్తున్న ట్లు గత అనుభవాలు చెబుతున్నాయని పేర్కొంది. రుణాల రికవరీ ప్రక్రియలో ఏ రాజకీయ పార్టీ కూడా సహకరించదని, ఎన్నికల సమయంలో మాత్రం ఓటర్లను ఆకట్టుకునేందుకు రుణాల మాఫీ డిమాండ్‌ను తెరపైకి తెస్తుంటాయని ఎంఎస్‌బీఈఎఫ్ వ్యాఖ్యానించింది. మొండిబాకీల ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకులను సంక్షోభంలోకి నెట్టి, దాన్ని సాకుగా చూపి ప్రైవేటీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించింది. -
ఇండియన్ బ్యాంక్ షేర్ల అమ్మకం,రూ.4వేల కోట్లు సమీకరణే లక్ష్యం
న్యూఢిల్లీ: పీఎస్‌యూ సంస్థ ఇండియన్ బ్యాంక్ అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్)ను చేపట్టింది. తద్వారా రూ. 4,000 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. షేరుకి రూ. 142.15 ధర(ఫ్లోర్ ప్రైస్)లో క్విప్‌ను సోమవారం చేపట్టింది. ఇందుకు పెట్టుబడుల సమీకరణ కమిటీ ఆమోదముద్ర వేసింది. ఈ నెల 24న(గురువారం) సమావేశంకానున్న పెట్టుబడుల కమిటీ క్విప్ ఇష్యూ ధర, డిస్కౌంట్, అర్హతగల సంస్థాగత కొనుగోలుదారులకు షేర్ల కేటాయింపు(క్విబ్) తదితరాలను పరిశీలించనున్నట్లు ఇండియన్ బ్యాంక్ వెల్లడించింది. కాగా.. ఫ్లోర్ ప్రైస్‌కంటే దిగువన షేర్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వీలుండదు. అయితే వాటాదారుల అనుమతితో బ్యాంక్ కమిటీ 5 శాతంవరకూ డిస్కౌంట్‌ను ఆఫర్ చేసేందుకు వీలుంటుంది. ఈ ఏడాది మార్చిలో ఒకేసారి లేదా దశలవారీగా రూ. 4,000 కోట్లు సమకూర్చుకునేందుకు డైరెక్టర్ల కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. క్విప్ నేపథ్యంలో ఇండియన్ బ్యాంక్ షేరు ఎన్ఎస్ఈలో 3.4 శాతం జంప్‌చేసి రూ. 150 ఎగువన ముగిసింది. చదవండి: ఐడీబీఐ వాటాల అమ్మకాల ప్రక్రియ షురూ -
రిటైల్ రుణాలు.. రయ్రయ్!
గతంలో ఎన్నడూ ఎరుగని విధంగా కొద్ది నెలలనుంచీ దేశీ బ్యాంకింగ్ వ్యవస్థలో సరికొత్త ట్రెండ్ కనిపిస్తోంది. ఇటీవల పలు బ్యాంకింగ్ దిగ్గజాలు కార్పొరేట్ విభాగానికి బదులుగా రిటైల్ రుణాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నాయి. దీంతో బ్యాంకింగ్ వ్యవస్థలో రిటైల్ రుణ విభాగం పైచేయి సాధించనున్నట్లు అంచనాలు నెలకొన్నాయి. వెరసి కార్పొరేట్ రుణాలను మించి అగ్రస్థానానికి చేరే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముంబై: దేశీ బ్యాంకింగ్ వ్యవస్థలో మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరం(2020–21).. కీలక మార్పులకు వేదిక కానుంది. కొన్ని నెలలుగా గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డులు తదితరాలపట్ల బ్యాంకులు అత్యంత ఆసక్తి చూపుతున్నాయి. దీంతో కార్పొరేట్ రంగ డెట్‌ను వ్యక్తిగత రుణ విభాగం అధిగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఏడాది తొలి 9 నెలల్లో(ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 18వరకూ) బ్యాంకింగ్ వ్యవస్థలో మొత్తం(అవుట్‌స్టాండింగ్) పారిశ్రామిక, కార్పొరేట్ రుణాలు 1.2 శాతం తగ్గి రూ. 27.6 లక్షల కోట్లకు చేరాయి. ఇదే సమయంలో వ్యక్తిగత రుణాలు 9.5 శాతం జంప్‌చేసి రూ. 26.6 లక్షల కోట్లను తాకాయి. ఇక సర్వీసుల రంగ రుణాలు 25.8 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. వెరసి దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో వ్యక్తిగత రుణ విభాగం సర్వీసుల రంగ రుణాలను మించి రెండో ర్యాంకుకు చేరింది. వెనకడుగులో..: పారిశ్రామిక, కార్పొరేట్ రుణ విభాగాలలో 2014–15 మొదలు రికవరీ కనిపించడంలేదని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకులు వ్యక్తిగత రుణ విభాగంపై ప్రత్యేక దృష్టిని సారించినట్లు తెలియజేశాయి. ఫలితంగా గృహ, ఆటో రుణాలు, క్రెడిట్ కార్డులు వృద్ధి బాటలో సాగుతున్నట్లు నార్నోలియా సెక్యూరిటీస్ సీఐవో శైలేంద్ర కుమార్ పేర్కొన్నారు. ఆర్బీఐ నివేదిక ప్రకారం పారిశ్రామిక, కార్పొరేట్ లోన్‌బుక్ నీరసిస్తూ వస్తోంది. తాజా రుణ మంజూరీకంటే చెల్లింపులు పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత 9 నెలల్లో పారిశ్రామిక రుణాలు 5 శాతం క్షీణించగా.. సర్వీసుల రంగ రుణాలు 0.6 శాతం మందగించాయి. అయితే వ్యక్తిగత రుణాలు 4.3 శాతం పుంజుకున్నాయి. వ్యవసాయ రుణాలైతే 7.6 శాతం ఎగశాయి. దీంతో సమీప కాలంలో రిటైల్ లోన్ పోర్ట్‌ఫోలియో దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో అతిపెద్ద విభాగంగా ఆవిర్భవించే వీలున్నట్లు పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. ఐఐపీ వీక్... కొంతకాలంగా తయారీ, పారిశ్రామిక రంగాలలో క్షీణత కొనసాగుతుండటంతో ఇండస్ట్రియల్ క్రెడిట్ వెనకడుగు వేస్తున్నట్లు బ్యాంకింగ్ రంగ విశ్లేషకులు పేర్కొన్నారు. కొన్నేళ్లుగా తయారీ రంగం నీరసిస్తుండటంతో కొత్త పెట్టుబడి ప్రణాళికలు కరువైనట్లు తెలియజేశారు. దీంతో కార్పొరేట్ క్రెడిట్‌కు డిమాండ్ తగ్గినట్లు ఈక్వినామిక్స్ రీసెర్చ్ వ్యవస్థాపక ఎండీ జి.చొక్కలింగం వివరించారు. సాధారణంగా సామర్థ్య విస్తరణ, కొత్త ప్రాజెక్టులు, ప్లాంట్ల ఏర్పాటు తదితరాల కారణంగా కార్పొరేట్ రుణాలకు డిమాండ్ పుట్టుకొస్తుందని తెలియజేశారు. కారణాలివీ... ఇటీవల వడ్డీ రేట్లు తగ్గడం, టెక్నాలజీ ఆధారిత (ఆన్లైన్) రుణ మంజూరీ పెరగడం వంటి అంశాలు రిటైల్ విభాగంలో రుణ వృద్ధికి దోహదపడుతున్నాయి. ఈ విభాగంలో క్రెడిట్ కార్డులు, ఇతర వ్యక్తిగత అన్సెక్యూర్డ్ రుణాలు అత్యంత వేగంగా విస్తరిస్తున్నాయి. అయితే మొత్తం వ్యక్తిగత పోర్ట్‌ఫోలియోలో చూస్తే సెక్యూర్డ్ విభాగంలోని గృహ రుణాలు, ఆటో రంగ రుణాలు నెమ్మదిస్తున్నాయి. వ్యక్తిగత పోర్ట్‌ఫోలియోలో ఆర్బీఐ గణాంకాల ప్రకారం గృహ, వాహన రుణాలు, క్రెడిట్ కార్డులు మూడు పెద్ద విభాగాలుగా ఆవిర్భవించాయి. హౌసింగ్ వాటా 52.3 శాతంకాగా.. గత ఐదేళ్లలో క్రెడిట్ కార్డులు తదితర రుణాలు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. ఫలితంగా క్రెడిట్ కార్డుల రుణాల వాటా 4.1 శాతానికి చేరడం గమనార్హం! -
బ్యాంకింగ్ రంగానికి ప్రాణం.. ప్రాధాన్యతలే!
భారత ఆర్థిక వ్యవస్థకు జీవనాడిగా నిలుస్తున్న దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థపై సామాన్య ప్రజలకు నమ్మకం సడలిపోతోందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. డిపాజిట్ల సేకరణ ప్రభుత్వరంగ బ్యాంకులకు అతిపెద్ద సవాల్‌గా మారింది. 2016లో జరిగిన పెద్దనోట్ల రద్దు తదనంతర పరిణామాలలో బ్యాంకులలో తాము దాచుకున్న డబ్బును సకాలంలో వెనక్కు తీసుకోలేకపోయిన రైతులు, మధ్యతరగతి వర్గాల వారు తమ పొదుపును బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి సంశయిస్తున్నారు. బ్యాంకుల వడ్డీరేట్లు గణనీయంగా తగ్గిపోవడం, కొన్ని జాతీయ బ్యాంకులు ఉదారంగా కొంతమంది పారిశ్రామిక వేత్తలకు ఇచ్చిన రూ. వేల కోట్ల మొండి బకాయిలుగా మారాయన్న సమాచారంతో ప్రభుత్వరంగ బ్యాంకుల విశ్వసనీయతపై అనుమానాలు కలుగుతున్నాయి. 1990వ దశకంలో దేశంలో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టే ముందువరకూ అటు ప్రభుత్వరంగ బ్యాంకులు, ఇటు గ్రామీణ బ్యాంకులు.. సామాన్య ప్రజలకు చేరువై ఆర్బీఐ నియంత్రణతో ఆర్థికంగా, పరిపుష్టిగానే ఉన్నాయి. బ్యాంకుల నిరర్థక ఆస్తులు సైతం నామమాత్రమే. అయితే, ప్రధాని పీవీ నరసింహారావు నేతృత్వంలో మొదలైన ఆర్థిక సంస్కరణలు దేశ బ్యాంకింగ్ రంగ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చివేశాయి. ప్రైవైటు రంగ బ్యాంకుల నుండి ఎదురయిన పోటీని తట్టుకోవడానికి ప్రభుత్వరంగ బ్యాంకులు సైతం వ్యవస్థాగతంగా అనేక మార్పులు చేసుకొన్నాయి. స్టాక్ మార్కెట్ నుండి నిధులు సమీకరించి పెద్ద ఎత్తున రుణ వితరణ కార్యకలాపాలు చేపట్టాయి. అయితే, ఆక్రమంలో కొన్ని ప్రభుత్వరంగ బ్యాంకులు అధిక వడ్డీకి ఆశపడి ఊరు పేరులేని కంపెనీలకు రుణాలందించాయి. బ్యాంకుల నుండి రుణాలు పొంది.. వాటిని ఎగ్గొట్టొచ్చనే భావన క్రమంగా బలపడటానికి కారణం.. మొండి బకాయిల పేరుతో.. కేంద్ర ప్రభుత్వం వాటిని రద్దు చేయడం. ఒక అంచనా ప్రకారం గత 70 సంవత్సరాలలో దాదాపు 10 లక్షల కోట్లకుపైగా బ్యాంకుల మొండి బకాయిలను కేంద్ర ప్రభుత్వాలు రద్దు చేశాయి. దీంతో.. దేశంలో నష్టాలు రాకున్నా రుణాలు పొంది ఎగవేసే వాళ్లు పుట్టుకొచ్చారు. గత ఏడాది పార్లమెంట్లో ప్రభుత్వం చేసిన ప్రకటన ప్రకారం.. విల్‌ఫుల్ డిఫాల్డర్లు దాదాపు 55 వేల కోట్లకు బ్యాంకులకు ఎగనామం పెట్టారు. విజయ్‌మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ మొదలైన కార్పొరేట్ దిగ్గజాల పేరును చూసి ప్రభుత్వ రంగ బ్యాంకులు రుణాలు అందించినట్లుగానే కనపడుతుంది గానీ.. వారి సంస్థల పనితీరును కనీస స్థాయిలో కూడా పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తుంది. ఇటీవల కేంద్రమంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ పేర్కొన్నట్లు ‘‘నాయకులు ఫోన్లు చేస్తే కొన్ని జాతీయ బ్యాంకులు రుణాలు అందించాయి’’. బ్యాంకు రుణాలను ఎగవేసిన డిఫాల్టర్లు దర్జాగా దేశం దాటిపోతుంటే.. ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించాయి. ఫలితంగానే, ప్రభుత్వరంగ బ్యాంకుల మొండి కాయిలు అంతకంతకూ పెరిగి జూన్ 30, 2014 నాటికి (యూపీఏ పరిపాలన ముగిసిన నాటికి) రూ. 2,24,542 కోట్లు చేరాయి. కాగా, ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక కూడా పరిస్థితిలో మార్పు రాలేదు సరికదా.. ప్రభుత్వరంగ బ్యాంకుల నిరర్థక ఆస్తుల మొత్తం ఆరేళ్లలో దాదాపు 4 రెట్లు పెరిగాయి. 2018 డిసెంబర్ నాటికి ప్రభుత్వరంగ బ్యాంకుల నిరర్థ్ధక ఆస్తులు రూ. 8,64,433 కోట్లకు చేరాయి. నరేంద్రమోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినాక.. దేశంలోని యువతకు స్వయం ఉపాధి కల్పించడానికి అవసరమైన పెట్టుబడిని అతితక్కువ వడ్డీతో అందించాలన్న గొప్ప లక్ష్యంతో ప్రారంభించబడిన పథకం.. ‘ప్రధానమంత్రి ముద్ర యోజన’. కారణం బ్యాంకుల ద్వారా లభించే ‘ముద్ర’ రుణాలతో కోట్లాది మందికి ఉపాధి అందించే సూక్ష్మ, కుటీర రంగ పరిశ్రమలు ఇబ్బడిముబ్బడిగా ఏర్పాటవుతాయని అంచనా వేయడం జరిగింది. పెరుగుతున్న నిరుద్యోగితకు ఇది పరమౌషధంగా పని చేస్తుందని ఆర్థిక వేత్తలు కూడా భావించారు. ‘ముద్ర’ పథకం ద్వారా రుణాలు పొందడానికి ష్యూరిటీలు, గ్యారెంటీలు, ప్రాసెసింగ్ రుసుములు వంటివి లేకుండా.. తక్కువ వడ్డీతో సాయం అందించే పథకం కావడంతో.. ‘ముద్ర’ పథకం దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకం కానున్నదని అందరూ ఆశిం చారు. అయితే, ఈ పథకంలో రాష్ట్ర ప్రభుత్వాలకు భాగస్వామ్యం లేదు. బ్యాంకులు రుణాలు అందించడానికి య«థావిధిగా పూచీకత్తులు, ఆస్తుల తనఖా వంటివి అడుగుతున్నాయి. బడా పారిశ్రామిక వేత్తలకు రెడ్ కార్పెట్ పరిచి.. ఎటువంటి పూచీకత్తులు లేకున్నా.. వందల వేల కోట్లు మేర రుణాలు అందిస్తున్న ప్రభుత్వరంగ బ్యాంకులు.. ‘ప్రధానమంత్రి ముద్ర యోజన’ పథకాన్ని కూడా చతికిలపడేట్లు చేశాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో వెలుగు చూస్తున్న మోసాలు, పెరిగిపోతున్న వాటి నిరర్థక ఆస్తుల నేపథ్యంలో.. అవి స్వేచ్ఛగా పని చేయలేకపోతున్నాయన్నది నిజం. ప్రభుత్వ రంగ బ్యాంకులపై రిజర్వ్ బ్యాంకు నియంత్రణతో పాటు వాటిని కేంద్ర విజిలెన్స్ కమిషన్ పరిధిలోకి తేవడంతో.. బ్యాంకర్లు రుణాల్ని నిర్భీతిగా ఇవ్వలేకపోతున్న పరిస్థితి కూడా దాపురించింది. ఏదైనా జరిగితే.. తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనని భయపడుతూ.. ప్రాధాన్యతా రంగాలకు సైతం రుణాలివ్వడానికి బ్యాంకర్లు సంశయిస్తున్నారు. సంస్థాగత రుణాలు పొందుతున్న గ్రామీణ కుటుంబాల సంఖ్య సగటున 20% దాటడం లేదని నాబార్డు జాతీయ ఆర్థిక సమ్మిళిత అధ్యయనం (2016–17) పేర్కొంది. పలు రాష్ట్రాల్లో రుణమాఫీ పథకాల వల్ల పంట రుణాల పంపిణీ పడిపోయింది. రుణమాఫీ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో నిధులు సమకూర్చడం లేదు. ప్రభుత్వం మాఫీ చేసిందనుకొని రైతులు బకాయిలు కట్టడం లేదు. దీంతో.. రైతులను బ్యాంకులు ‘ఎగవేతదారుల జాబితా’లో చేరుస్తున్నాయి. దేశ జనాభాలో అత్యధిక శాతంగా ఉన్న పేద, మధ్యతరగతి ప్రజల ఆర్థికావసరాలను తీర్చడానికి ప్రభుత్వ రంగ బ్యాంకులు నిస్వార్థంగా పనిచేసినప్పుడే ఆర్థిక వ్యవస్థ పటిష్టవంతం అవుతుంది. ఒకప్పుడు ఆర్థిక జీవనాడులుగా పనిచేసిన ప్రభుత్వ బ్యాంకులు నేడు కష్టాల ఊబిలో కూరుకుపోవడానికి కారణం స్వయంకృతమే. తగిన నియంత్రణ, పర్యవేక్షణలతోపాటు.. ప్రాధాన్యతలను పాటిస్తేనే ప్రభుత్వరంగ బ్యాంకుల పట్ల సామాన్య ప్రజలకు తిరిగి విశ్వాసం ఏర్పడుతుంది. దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ బలహీనపడితే దానిని మించిన ఆర్థిక సంక్షోభం మరొకటి ఉండబోదు. డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు (వ్యాసకర్త ఎమ్మెల్సీ, కేంద్ర మాజీ మంత్రి, చీఫ్ విప్, ఏపీ శాసనమండలి) -
యస్ బ్యాంక్ ఎండీగా రవ్నీత్ గిల్ బాధ్యతలు
ముంబై: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం యస్ బ్యాంక్ ఎండీ, సీఈవోగా రవ్నీత్ గిల్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. బ్యాంక్ సహ–వ్యవస్థాపకుడు రాణా కపూర్ స్థానంలో ఆయన నియమితులైన సంగతి తెలిసిందే. గిల్ పదవీకాలం మూడేళ్లు ఉంటుంది. ఇప్పటిదాకా జర్మనీ బ్యాంకింగ్ దిగ్గజం డాయిష్ బ్యాంక్ భారత విభాగానికి గిల్ సారథ్యం వహించారు. నిర్దిష్ట కారణాలు బహిరంగంగా వెల్లడించనప్పటికీ .. రాణా కపూర్ పదవీ కాలాన్ని పొడిగించడానికి రిజర్వ్ బ్యాంక్ అంగీకరించకపోవడంతో కొత్త ఎండీ నియామకం తప్పనిసరైన సంగతి తెలిసిందే. 2019 సెప్టెంబర్ దాకా కపూర్ పదవీకాలాన్ని పొడిగించాలంటూ యస్ బ్యాంక్ కోరినప్పటికీ ఆర్బీఐ నిరాకరించింది. యస్ బ్యాంక్‌లో గవర్నెన్స్, నిబంధనల అమలుపరమైన లోపాల ఆరోపణలే రాణా కపూర్ ఉద్వాసనకు కారణమై ఉంటాయన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇక, తాత్కాలిక ఎండీగా ఇప్పటిదాకా విధులు నిర్వర్తించిన నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అజయ్ కుమార్.. ఇకపై అదే హోదాలో కొనసాగుతారు. పార్ట్ టైమ్ చైర్మన్ బ్రహ్మదత్, స్వతంత్ర డైరెక్టరు ముకేష్ సబర్వాల్, నాన్ ఎగ్జిక్యూటివ్ నాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్ సుభాష్ చందర్ కాలియా, స్వతంత్ర డైరెక్టర్ ప్రతిమా షోరే.. బోర్డు సభ్యులుగా ఉంటారు. వీరితో పాటు అదనంగా నలుగురు స్వతంత్ర డైరెక్టర్లు బోర్డులో ఉంటారు. ఎండీ, సీఈవోగా గిల్ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో శుక్రవారం బీఎస్ఈలో యస్ బ్యాంక్ షేరు 2.68 శాతం పెరిగి రూ. 237.40 వద్ద క్లోజయ్యింది. -
దేశీ బ్యాంకుల లాభం.. అంతంతే!
న్యూఢిల్లీ: బ్రిక్స్ కూటమిలోని మిగతా దేశాలతో పోలిస్తే భారతీయ బ్యాంకుల లాభదాయకత తక్కువగా ఉందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ వెల్లడించింది. మూలధనంపరంగా చూసినా దేశీ బ్యాంకులు బలహీనంగా ఉన్నాయని తెలిపింది. అయితే, అసెట్ క్వాలిటీ స్థిరపడే కొద్దీ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పరిస్థితి మెరుగుపడొచ్చని ఒక నివేదికలో పేర్కొంది. ‘కీలకమైన ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒత్తిళ్ల కారణంగా భారత బ్యాంకింగ్ వ్యవస్థలో అసెట్ క్వాలిటీ బలహీనంగా ఉంది. అయితే, బలహీనంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రభుత్వమిచ్చే అదనపు మూలధనంతో వాటి క్యాపిటల్ నిష్పత్తులు మెరుగుపడగలవు‘ అని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ వివరించింది. మార్కెట్లో ఆధిపత్యం ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రుణ వ్యయాలు అధికంగా ఉండటం వల్ల మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ లాభదాయకత దెబ్బతింటోందని పేర్కొంది. మరోవైపు, బ్రెజిల్, దక్షిణాఫ్రికా బ్యాంకులు అసెట్స్‌పై అత్యధిక రాబడులు నమోదు చేస్తున్నాయని వివరించింది. బ్రిక్స్ కూటమిలో భారత్ సహా బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా ఉన్నాయి. ‘చైనా బ్యాంకుల కోవలోనే భారత బ్యాంకులు కూడా ప్రొవిజనింగ్‌కు ముందు లాభదాయకంగా ఉంటున్నప్పటికీ.. వ్యవస్థలో ఆధిపత్యం ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రుణ వ్యయాలు భారీగా ఉండటం వల్ల మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ అసెట్స్‌పై రాబడులు నెగటివ్‌గా ఉంటున్నాయి. మొండిబాకీలకు భారీ కేటాయింపులు జరపాల్సి వస్తుండటం వల్ల ఈ ఆర్థిక సంవత్సరం మిగతా కాలంలో కూడా లాభదాయకతపై ఒత్తిళ్లు కొనసాగుతాయి. ఆ తర్వాత అసెట్ క్వాలిటీ స్థిరపడ్డాక వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి భారతీయ బ్యాంకుల లాభదాయకత మెరుగుపడే అవకాశం ఉంది‘ అని మూడీస్ నివేదిక పేర్కొంది. మొండిబాకీల్లో రెండో స్థానం.. మొండిబాకీల విషయంలో బ్రిక్స్ కూటమిలో భారత్ రెండో స్థానంలో ఉన్నట్లు మూడీస్ వెల్లడించింది. 2017 ఆఖరు నాటికి నిరర్ధక రుణాల నిష్పత్తి (ఎన్పీఎల్) రష్యన్ బ్యాంకులు అగ్రస్థానంలో ఉండగా, భారత్ రెండో స్థానంలో ఉంది. బ్రెజిల్, దక్షిణాఫ్రికా, చైనా ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. భారతీయ బ్యాంకుల మొండిబాకీల నిష్పత్తి కూడా 2017 ఆఖరు దాకా రెండంకెల స్థాయిలోనే ఉన్నప్పటికీ, వాటిని గుర్తించే ప్రక్రియ దాదాపు పూర్తయిపోయిందని మూడీస్ వివరించింది. స్థూలఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండటం, కార్పొరేట్లు తమ ఖాతాలు మొండిబాకీలుగా మారకుండా ప్రయత్నాలు చేస్తుండటం తదితర అంశాల కారణంగా రాబోయే 12–18 నెలల్లో కొత్త ఎన్‌పీఎల్‌ల సంఖ్య ఒక మోస్తరు స్థాయికి పరిమితం కావొచ్చని పేర్కొంది. అలాగే మొండిపద్దుల పరిష్కార చర్యల ఫలితంగా ఎన్పీఎల్ నిష్పత్తి కూడా క్రమంగా తగ్గొచ్చని వివరించింది. 25,000 కోట్ల సమీకరణ! ♦ ఎస్బీఐ ప్రణాళిక ♦ ఇందులో బాండ్ల ద్వారా రూ.5,000 కోట్లు ముంబై: ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018–19) రూ.25,000 కోట్లు సమీకరించడానికి కసరత్తు చేస్తోంది. ఇందులో రూ.5,000 కోట్లు బాండ్ల (బాసెల్ 3 టైర్ టూ బాండ్స్) ద్వారా సమీకరించాలన్నది ప్రణాళిక. క్యాపిటల్ అడిక్వెసీ (మూలధన) నిబంధనల ప్రమాణాలకు దీటుగా ఈ నిధులను సమీకరించనున్నట్లు ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో బ్యాంక్ తెలిపింది. తమ ఈ రెండు ప్రతిపాదనలకు ఇప్పటికే బ్యాంక్ సెంట్రల్ బోర్డ్ ఆమోదముద్ర వేసినట్లు కూడా ఎస్బీఐ వెల్లడించింది. ఈ ప్రతిపాదనల ప్రకారం... ♦ పబ్లిక్ ఆఫర్ లేదా ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా దేశీయ లేదా విదేశీ ఇన్వెస్టర్ల నుంచి రూపాయిలు లేదా డాలర్లలో రూ.5,000 కోట్ల వరకూ బ్యాంక్ నిధులు సమీకరించనుంది. ♦ ఇక రూ.20,000 కోట్ల ఈక్విటీ క్యాపిటల్ సమీకరణ రెండవ అంశం. ఎఫ్‌పీఓ, క్యూఐపీ, ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్, రైట్స్ ఇష్యూ లేదా ఇతర విధానాలు లేదా పైన పేర్కొన్న అన్ని విధానాల ద్వారా తగిన సమయంలో రూ.20,000 కోట్లను మార్కెట్ ద్వారా ఎస్బీఐ సమీకరిస్తుంది. సిండికేట్ బ్యాంక్‌కు రూ.728 కోట్లు.... ప్రభుత్వ రంగంలోని సిండికేట్ బ్యాంక్ ప్రభుత్వం నుంచి రూ.728 కోట్ల తాజా మూలధనం పొందింది. ఈ మేరకు బ్యాంక్ సోమవారం ఒక ప్రకటన చేసింది. షేర్ల ప్రిఫరెన్షియల్ కేటాయింపుల ద్వారా ఈ నిధులు పొందినట్లు ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. త్వరలో సెంట్రల్బ్యాంక్కూ... సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ప్రభుత్వానికి ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ మార్గంలో షేర్లు కేటాయించి రూ.2,354 కోట్లు పొందనుంది. నవంబర్ 13న జరిగిన అసాధారణ వాటాదారుల సమావేశంలో ఈ ఆమోదం పొందనున్నట్లు బ్యాంక్ గతవారం పేర్కొంది. రూ.2.1 లక్షల కోట్లలో భాగమే! 2017–18, 2018–19లో ప్రభుత్వ రంగ బ్యాంకులకు తాజా మూలధనంగా రూ.2.1 లక్షల కోట్లను సమకూర్చనున్నట్లు కేంద్రం ప్రకటించింది. 20 ప్రభుత్వ బ్యాంకులు 2017–18లో రూ.88,139 కోట్లను పొందాయి. 2018–19లో రూ.65,000 కోట్లు పొందనున్నాయి. ప్రణాళికలో భాగంగా రూ. రూ.58,000 కోట్లను మార్కెట్ ద్వారా బ్యాంకులు సమీకరించుకోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది జూలైలో ఐదు బ్యాంకులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పొందనున్న మూలధనంలో భాగంగా రూ.11,336 కోట్లను పొందాయి. వీటిలో పంజాబ్ నేషనల్ బ్యాంక్(రూ.2,816కోట్లు), అలహాబాద్ బ్యాంక్ (రూ.1,790 కోట్లు), ఆంధ్రాబ్యాంక్(రూ.2,019 కోట్లు), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (రూ.2,157 కోట్లు), కార్పొరేషన్ బ్యాంక్ (రూ.2,555 కోట్లు) ఉన్నాయి. -
వాన్నా క్రై షాకింగ్: బ్యాంకింగ్ వ్యవస్థపై దాడి
న్యూఢిల్లీ: 'వానా క్రై రాన్సమ్వేర్' ప్రకంకపనలు త్వరలోనే భారత బ్యాంకింగ్ వ్యవస్థను తాకనున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాన్సమ్ వేర్ సైబర్ ఎటాక్ ప్రభావం తగ్గుముఖం పడుతున్నప్పటికీ దీని బారిన పడుతున్న సంఖ్య మరింత వేగంగా పెరిగే అవకాశం ఉందని ఐటీ నిపుణులు వినియోగదారులను హెచ్చరిస్తున్నారు. ఆ సంస్థల సంఖ్య వేగంగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. దీంతో వివిధ సంస్థలు, బ్యాంకులకు సైబర్ నిపుణులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. వానా క్రై ప్రభావం చాలా రాష్ట్రాలపై పడిందని వ్యాఖ్యానిస్తున్నారు. ఎక్కడ దాడి జరిగింది అనేది చెక్ చేయడంలేదని సైబర్ సెక్యూరిటీ నిపుణుడు శుభ మంగళ ఏఎన్ఐ కి చెప్పారు. దాడుల తరువాతి ప్రకంకపనలు బ్యాంకింగ్ రంగంలో ప్రారంభంకానున్నాయనే అనుమానాలు వ్యక్తం చేశారు. మరో కొన్నిగంటల్లోనే బ్యాంకులు ప్రభావితమవుతాయని చెబుతున్నారు. ఈ మేరకు బ్యాంకులకు సమాచారం అందించామన్నారు. ఎందుకంటే వానాక్రై బారిన పడుతున్న విండోస్ ఆపరేటింగ్ సిస్టంతోనే ఏటీఏం నిర్వహరణ జరుగుతోందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలోనే సంస్థలు, వ్యాపారాలు మరియు ఇతర రంగాల వారికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడానికి, వ్యవస్థలను నవీకరించడానికి హెచ్చరించినట్టు తెలిపారు. మరోవైపు ఆన్లైన్ బ్యాంకింగ్, ఏటీఏం ట్రాన్సాక్షన్స్ చేయొద్దంటూ ఇప్పటికే సోషల్‌మీడియాలో హెచ్చరికలు, వార్తలు విపరీతంగా షేర్ అవుతున్నాయి. రానున్న రెండు మూడు రోజుల్లో ఏటీఎంలు మూతపడే అవకాశం ఉందన్నఅంచనాలు భారీగా నెలకొన్నాయి. కాగా 'వానా క్రై రాన్సమ్వేర్' ద్వారా కంప్యూటర్లను హ్యాక్ చేసింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 150కిపైగా దేశాల్లో వేల సైబర్ దాడులు జరిగినట్లు కాస్పర్‌స్కై ల్యాబ్ తన బ్లాగ్‌లో పేర్కొంది. ముఖ్యంగా మన దేశంలో పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ లాంటి రాష్ట్రాలు ప్రభావితమయ్యాయి. అయితే ద్చరిత్రలోనే అతిపెద్దదిగా భావిస్తున్న ఈ సైబర్ దాడిలో నేరగాళ్లు ద్రవ్య ప్రయోజనాలను పొందలేదని ఐబీ నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే.