న్యూఢిల్లీ: బ్రిక్స్ కూటమిలోని మిగతా దేశాలతో పోలిస్తే భారతీయ బ్యాంకుల లాభదాయకత తక్కువగా ఉందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ వెల్లడించింది. మూలధనంపరంగా చూసినా దేశీ బ్యాంకులు బలహీనంగా ఉన్నాయని తెలిపింది. అయితే, అసెట్ క్వాలిటీ స్థిరపడే కొద్దీ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పరిస్థితి మెరుగుపడొచ్చని ఒక నివేదికలో పేర్కొంది. ‘కీలకమైన ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒత్తిళ్ల కారణంగా భారత బ్యాంకింగ్ వ్యవస్థలో అసెట్ క్వాలిటీ బలహీనంగా ఉంది.
అయితే, బలహీనంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రభుత్వమిచ్చే అదనపు మూలధనంతో వాటి క్యాపిటల్ నిష్పత్తులు మెరుగుపడగలవు‘ అని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ వివరించింది. మార్కెట్లో ఆధిపత్యం ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రుణ వ్యయాలు అధికంగా ఉండటం వల్ల మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ లాభదాయకత దెబ్బతింటోందని పేర్కొంది. మరోవైపు, బ్రెజిల్, దక్షిణాఫ్రికా బ్యాంకులు అసెట్స్‌పై అత్యధిక రాబడులు నమోదు చేస్తున్నాయని వివరించింది. బ్రిక్స్ కూటమిలో భారత్ సహా బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా ఉన్నాయి.
‘చైనా బ్యాంకుల కోవలోనే భారత బ్యాంకులు కూడా ప్రొవిజనింగ్‌కు ముందు లాభదాయకంగా ఉంటున్నప్పటికీ.. వ్యవస్థలో ఆధిపత్యం ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రుణ వ్యయాలు భారీగా ఉండటం వల్ల మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ అసెట్స్‌పై రాబడులు నెగటివ్‌గా ఉంటున్నాయి. మొండిబాకీలకు భారీ కేటాయింపులు జరపాల్సి వస్తుండటం వల్ల ఈ ఆర్థిక సంవత్సరం మిగతా కాలంలో కూడా లాభదాయకతపై ఒత్తిళ్లు కొనసాగుతాయి. ఆ తర్వాత అసెట్ క్వాలిటీ స్థిరపడ్డాక వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి భారతీయ బ్యాంకుల లాభదాయకత మెరుగుపడే అవకాశం ఉంది‘ అని మూడీస్ నివేదిక పేర్కొంది.
మొండిబాకీల్లో రెండో స్థానం..
మొండిబాకీల విషయంలో బ్రిక్స్ కూటమిలో భారత్ రెండో స్థానంలో ఉన్నట్లు మూడీస్ వెల్లడించింది. 2017 ఆఖరు నాటికి నిరర్ధక రుణాల నిష్పత్తి (ఎన్‌పీఎల్) రష్యన్ బ్యాంకులు అగ్రస్థానంలో ఉండగా, భారత్ రెండో స్థానంలో ఉంది. బ్రెజిల్, దక్షిణాఫ్రికా, చైనా ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. భారతీయ బ్యాంకుల మొండిబాకీల నిష్పత్తి కూడా 2017 ఆఖరు దాకా రెండంకెల స్థాయిలోనే ఉన్నప్పటికీ, వాటిని గుర్తించే ప్రక్రియ దాదాపు పూర్తయిపోయిందని మూడీస్ వివరించింది.
స్థూలఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండటం, కార్పొరేట్లు తమ ఖాతాలు మొండిబాకీలుగా మారకుండా ప్రయత్నాలు చేస్తుండటం తదితర అంశాల కారణంగా రాబోయే 12–18 నెలల్లో కొత్త ఎన్‌పీఎల్‌ల సంఖ్య ఒక మోస్తరు స్థాయికి పరిమితం కావొచ్చని పేర్కొంది. అలాగే మొండిపద్దుల పరిష్కార చర్యల ఫలితంగా ఎన్‌పీఎల్ నిష్పత్తి కూడా క్రమంగా తగ్గొచ్చని వివరించింది.
25,000 కోట్ల సమీకరణ!
♦ ఎస్‌బీఐ ప్రణాళిక
♦ ఇందులో బాండ్ల ద్వారా రూ.5,000 కోట్లు
ముంబై: ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018–19) రూ.25,000 కోట్లు సమీకరించడానికి కసరత్తు చేస్తోంది. ఇందులో రూ.5,000 కోట్లు బాండ్ల (బాసెల్ 3 టైర్ టూ బాండ్స్) ద్వారా సమీకరించాలన్నది ప్రణాళిక. క్యాపిటల్ అడిక్వెసీ (మూలధన) నిబంధనల ప్రమాణాలకు దీటుగా ఈ నిధులను సమీకరించనున్నట్లు ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో బ్యాంక్ తెలిపింది. తమ ఈ రెండు ప్రతిపాదనలకు ఇప్పటికే బ్యాంక్ సెంట్రల్ బోర్డ్ ఆమోదముద్ర వేసినట్లు కూడా ఎస్‌బీఐ వెల్లడించింది. ఈ ప్రతిపాదనల ప్రకారం...
♦ పబ్లిక్ ఆఫర్ లేదా ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ద్వారా దేశీయ లేదా విదేశీ ఇన్వెస్టర్ల నుంచి రూపాయిలు లేదా డాలర్లలో రూ.5,000 కోట్ల వరకూ బ్యాంక్ నిధులు సమీకరించనుంది.
♦ ఇక రూ.20,000 కోట్ల ఈక్విటీ క్యాపిటల్ సమీకరణ రెండవ అంశం. ఎఫ్‌పీఓ, క్యూఐపీ, ప్రిఫరెన్షియల్ అలాట్‌మెంట్, రైట్స్ ఇష్యూ లేదా ఇతర విధానాలు లేదా పైన పేర్కొన్న అన్ని విధానాల ద్వారా తగిన సమయంలో రూ.20,000 కోట్లను మార్కెట్ ద్వారా ఎస్‌బీఐ సమీకరిస్తుంది.
సిండికేట్ బ్యాంక్‌కు రూ.728 కోట్లు....
ప్రభుత్వ రంగంలోని సిండికేట్ బ్యాంక్ ప్రభుత్వం నుంచి రూ.728 కోట్ల తాజా మూలధనం పొందింది. ఈ మేరకు బ్యాంక్ సోమవారం ఒక ప్రకటన చేసింది. షేర్ల ప్రిఫరెన్షియల్ కేటాయింపుల ద్వారా ఈ నిధులు పొందినట్లు ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.
త్వరలో సెంట్రల్‌బ్యాంక్‌కూ...
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ప్రభుత్వానికి ప్రిఫరెన్షియల్ అలాట్‌మెంట్ మార్గంలో షేర్లు కేటాయించి రూ.2,354 కోట్లు పొందనుంది. నవంబర్ 13న జరిగిన అసాధారణ వాటాదారుల సమావేశంలో ఈ ఆమోదం పొందనున్నట్లు బ్యాంక్ గతవారం పేర్కొంది.
రూ.2.1 లక్షల కోట్లలో భాగమే!
2017–18, 2018–19లో ప్రభుత్వ రంగ బ్యాంకులకు తాజా మూలధనంగా రూ.2.1 లక్షల కోట్లను సమకూర్చనున్నట్లు కేంద్రం ప్రకటించింది. 20 ప్రభుత్వ బ్యాంకులు 2017–18లో రూ.88,139 కోట్లను పొందాయి. 2018–19లో రూ.65,000 కోట్లు పొందనున్నాయి.
ప్రణాళికలో భాగంగా రూ. రూ.58,000 కోట్లను మార్కెట్ ద్వారా బ్యాంకులు సమీకరించుకోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది జూలైలో ఐదు బ్యాంకులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పొందనున్న మూలధనంలో భాగంగా రూ.11,336 కోట్లను పొందాయి. వీటిలో పంజాబ్ నేషనల్ బ్యాంక్(రూ.2,816కోట్లు), అలహాబాద్ బ్యాంక్ (రూ.1,790 కోట్లు), ఆంధ్రాబ్యాంక్(రూ.2,019 కోట్లు), ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ (రూ.2,157 కోట్లు), కార్పొరేషన్ బ్యాంక్ (రూ.2,555 కోట్లు) ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment